మరో 5.56 లక్షల మందిపై ఐటీ శాఖ దృష్టి
♦ నోట్ల రద్దు తర్వాత భారీ డిపాజిట్లు
♦ ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) అనంతరం గత పన్నుల ప్రొఫైల్‌తో పొంతన లేకుండా భారీ స్థాయిలో నగదు డిపాజిట్లు చేసిన మరో 5.56 లక్షల మంది వ్యక్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. పన్నుల చెల్లింపునకు సంబంధించి సదరు వ్యక్తుల గత చరిత్ర, డీమోనిటైజేషన్ తర్వాత చేసిన డిపాజిట్ల సరళికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని గుర్తించినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ వారికి ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపుతున్నట్లు పేర్కొంది. నల్లధనం చలామణీని అరికట్టే దిశగా ఏప్రిల్‌లో ప్రారంభించిన ’ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశ కింద ఆదాయ పన్నుశాఖ వీరిని గుర్తించింది.
క్లీన్ మనీ తొలి దశలో ఈ–వెరిఫికేషన్ కోసం తమ బ్యాంకు ఖాతాలన్నింటి వివరాలు వెల్లడించని మరో 1.04 లక్షల మందిని కూడా గుర్తించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31న ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో.. భారీ డిపాజిట్లు చేసిన 17.92 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఈ–వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా.. 9.72 లక్షల మంది వ్యక్తులు తమ వివరణను ఆన్‌లైన్‌లో సమర్పించారు.