బఫెట్‌ వారసుడెవరు? | 6 Things to Watch for in Warren Buffett's Annual Letter | Sakshi
Sakshi News home page

బఫెట్‌ వారసుడెవరు?

Published Sat, Feb 24 2018 12:40 AM | Last Updated on Sat, Feb 24 2018 12:43 AM

6 Things to Watch for in Warren Buffett's Annual Letter - Sakshi

ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్టర్‌గా ప్రఖ్యాతి గాంచిన ఒరాకిల్‌ ఆఫ్‌ ఒమాహ వారెన్‌ బఫెట్‌... తన వారసుడిని ప్రకటించే సమయం ఆసన్నమైనట్టే ఉంది. బెర్క్‌షైర్‌ హతావేకు సీఈఓ, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బఫెట్‌కు ప్రస్తుతం 87 ఏళ్లు. వైస్‌ చైర్మన్‌గా ఉన్న చార్లెస్‌ మంగర్‌కు 94 ఏళ్లు. ఈ కీలక అధికారులిద్దరికీ వయోభారం మీద పడింది కనక బఫెట్‌ వారసుడిని ప్రకటించే సమయం దగ్గర పడిందనేది పరిశీలకుల భావన. వారెన్‌ బఫెట్‌  తన కంపెనీ బెర్క్‌షైర్‌ వాటాదారులకు ఏడాదికోసారి రాసే వార్షిక  లేఖ శనివారం వాటాదారులకు  అందనుంది. రివాజుగానే ఈ లేఖలో అమెరికా ఆర్థిక వ్యవస్థ, కంపెనీ భవిష్యత్‌ వ్యూహాలు, అమెరికాలో తాజా పన్ను సంస్కరణలు, కంపెనీపై ఈ పన్ను సంస్కరణల ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? బీమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్న అండర్‌ రైటింగ్‌  సమస్యలేంటి? వంటివన్నీ ఆయన ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అమెజాన్‌ డాట్‌కామ్, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌ కంపెనీతో ప్రారంభించే ఆరోగ్య రంగ సంబంధిత వెంచర్‌ గురించి కూడా ఆయన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా కంపెనీ భవిష్యత్తు నాయకత్వం గురించి ఆయన ఏమని వ్యాఖ్యానిస్తారో తెలుసుకోవాలని ఒక్క అమెరికా, యావత్‌ ప్రపంచంతోపాటు భారత్‌ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచంలో ఒక బ్రాండ్‌ లాంటి బఫెట్‌ వారసుడి రేసులో ఓ భారతీయుడూ ఉన్నాడు మరి. బఫెట్‌ వారసుడికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు పుస్తకాల దాకా మార్కెట్లోకి వచ్చాయంటే..  ఈ అంశంపై ఎంత ఉత్సుకత ఉందో అర్థంకాక మానదు.


జనవరిలో ప్రమోషన్లు...
కంపెనీలో చిరకాలంగా పనిచేస్తున్న అజిత్‌ జైన్, గ్రెగరీ ఏబెల్‌లకు ఈ ఏడాది జనవరిలో కంపెనీ వైస్‌ చైర్మన్లుగా పదోన్నతి లభించింది. బీమాయేతర వ్యాపారాలకు వైస్‌ చైర్మన్‌గా 55 ఏళ్ల ఏబెల్, బీమా వ్యాపారాల వైస్‌ చైర్మన్‌గా 66 ఏళ్ల అజిత్‌ జైన్‌లు వ్యవహరిస్తారు. వారెన్‌ బఫెట్‌ వారసుడిగా ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉన్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ వర్గాలు భావిస్తున్నాయి. తాజా ప్రమోషన్లు.. తన వారసత్వ ప్రక్రియలో భాగమేనని బఫెట్‌ వర్ణించారు.

పోటాపోటీ...
భారత్‌లో జన్మించిన అజిత్‌ జైన్‌ భారత్‌లో ఐబీఎమ్‌ సేల్స్‌ పర్సన్‌గా పనిచేశారు. ఇక్కడ ఐబీఎమ్‌ తన కార్యకలాపాలను నిలిపేయడంతో ఉద్యోగం కోల్పోయి హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరారు. అక్కడ చదివాక కొన్నాళ్లు మెకిన్సేలో పనిచేశారు. 1986లో బెర్క్‌షైర్‌లో చేరారు. ప్రస్తుతం బెర్క్‌షైర్‌ నేషనల్‌ ఇండెమ్నిటీ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రీ ఇన్సూరెన్స్‌ వ్యాపారాన్ని కూడా ఆయనే చూస్తున్నారు. తనకంటే స్మార్ట్‌గా జైన్‌ పనిచేస్తున్నారని కొన్నేళ్ల క్రితం అజిత్‌జైన్‌కు బఫెట్‌ కితాబివ్వడం విశేషం.

బఫెట్‌ ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుగా కోట్ల డాలర్ల నిధులను అజిత్‌ జైన్‌ బీమా వ్యాపారం ద్వారా ఆర్జించి ఇచ్చారు. బెర్క్‌షైర్‌ కోసం నా కంటే అజిత్‌ జైన్‌ అధికంగా సంపాదించారని గత ఏడాది వార్షిక లేఖలో వారెన్‌ బఫెట్‌ ప్రస్తావించడం విశేషం. ఇక కెనడాలో జన్మించిన ఏబెల్‌ ప్రస్తుతం బెర్క్‌షైర్‌ హతావే ఎనర్జీ కంపెనీకి సీఈఓగా, చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1992లో బెర్క్‌షైర్‌లో చేరిన ఆయనను డీల్‌ మేకర్‌ అని బఫెట్‌ ప్రశంసిస్తుంటారు.

అజిత్‌ జైన్, ఏబెల్‌లు ఇద్దరూ ఇద్దరేనని, అత్యంత విశ్వాస పాత్రులని, ఉద్వేగాలకు తావివ్వకుండా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారని పేరు ఉంది. ఇద్దరి మీదా బఫెట్‌కు మంచి గురి ఉంది. కంపెనీ రీ ఇన్సూరెన్స్‌ వ్యాపారాన్ని అజిత్‌ జైన్‌ మరో స్థాయికి తీసుకెళ్లగా, ఏబెల్‌ ఇంధన వ్యాపారాన్ని విస్తృతంగా విస్తరించారు. వీరిద్దరితో పాటు జార్జ్‌ పాలో లెమన్, టాడ్‌ కాబ్స్, టెడ్‌  వేలర్‌ కూడా రంగంలో ఉన్నారు. కానీ ఏబెల్, అజిత్‌ జైన్‌లకే అవకాశాలు అధికమని చెప్పాలి.

ఏబెల్‌ది కొంచెం పైచేయి?
అజిత్‌ జైన్‌ కంటే గ్రెగ్‌ ఏబెల్‌ పదేళ్ల చిన్నవాడు కనక అజిత్‌ జైన్‌ కంటే ఏబెల్‌కే బఫెట్‌ వారసుడయ్యే అవకాశాలు అధికమనేది పరిశీలకుల మాట. అజిత్‌ జైన్‌కు ఆరోగ్య సమస్యలు ఉండటం కూడా ప్రతికూలమే. అలాగని అజిత్‌ అవకాశాలను కొట్టిపారేయలేం. జైన్‌ సరేనంటే సీఈఓను  చేయడానికి కంపెనీ బోర్డ్‌ సిద్ధంగా ఉందని బఫెట్‌  2011లోనే చెప్పారు.

మరోవైపు తాను మరీ ముసలాడినేమీ కాలేదని, మరో పదేళ్లు పని చేయగలనని బఫెట్‌ పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితమైతే వారెన్‌ బఫెట్‌ వారసుడి ప్రకటన వెలువడితే అది ఆ షేర్‌కు హార్ట్‌ ఎటాక్‌లా ఉండేదని, ఇప్పుడు చిన్న జెర్క్‌లాంటిది మాత్రమేనని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కొడుకు హోవార్డ్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, డైరెక్టర్‌గా కొనసాగుతాడని బఫెట్‌ తెలిపారు.

పన్ను ప్రయోజనాలు
అమెరికాలో ట్రంప్‌ తెస్తున్న పన్ను సంస్కరణలు బెర్క్‌షైర్‌కు భారీగా లాభం చేకూర్చే అవకాశాలున్నాయి. పన్ను రేటు తగ్గనున్నందన బెర్క్‌షైర్‌ బుక్‌ విలువ 3,700 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని అంచనా. పన్ను కోత ప్రయోజనాలతో భారీ లాభాలొస్తాయనే అంచనాలతో బెర్క్‌షైర్‌ షేర్‌ గత ఏడాది తొలిసారిగా 3 లక్షల డాలర్ల మేర ఎగసింది.

బెర్క్‌షైర్‌ వ్యాపార సామ్రాజ్యమిదీ..
బెర్క్‌షైర్‌ హతావేను 1965 నుంచి బఫెట్‌ నడిపిస్తున్నారు. ఐదు దశాబ్దాల ఆయన సామ్రాజ్యం నేడు భారీగా ఎదిగింది. దాదాపు 12కు పైగా అనుబంధ కంపెనీలున్నాయి. అలాగే వాహన బీమా అందించే గీకో,  బెర్క్‌షైర్‌ హతావే రీ ఇన్సూరెన్స్‌ సంస్థలు గ్రూప్‌లో కీలకం. బీఎన్‌ఎస్‌ఎఫ్‌ రైల్వే, ఫ్రూట్‌ ఆఫ్‌ ద లూమ్, ద బఫెలో న్యూస్‌ కూడా కీలక సంస్థలే. క్రాఫ్ట్‌ హెంజ్‌ కంపెనీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, వెల్స్‌ ఫార్గో కంపెనీలో చెప్పుకోదగ్గ వాటాలున్నాయి.


–సాక్షి బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement