70వ వసంతంలో స్కూటర్ ప్రియుల ఐకానిక్
టూవీలర్ పరిశ్రమలో ఐకానిక్ బ్రాండ్ గా నిలిచిన ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పా ను స్కూటర్ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఈ ఇటాలియన్ బ్రాండ్ తన 70వ వసంతాన్ని ఘనంగా జరుపుకుంది. దీన్ని పురస్కరించుకుని కొత్త వెస్పా సెట్టాన్ టెసిమో లిమిటెడ్ వెర్షన్ ప్రిమ అవెరా 50, ప్రిమ అవెరా 150, జీటీఎస్ 300 మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
రైల్వే క్యారేజీలు, లోకోమోటివ్ తయారీదారుగా ప్రపంచం ముందుకు వచ్చిన వెస్పా పేరెంట్ కంపెనీ ఫియాజ్జియో , రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వెస్పా బ్రాండుకు శ్రీకారం చుట్టింది. కేవలం రెండు లాభాలతో వెస్పా బ్రాండ్ ను 1946 నుంచి తయారీ చేయడం ప్రారంభించింది. ఒకటి చౌకైన రవాణాకు, రెండు ఉద్యోగులు, యంత్రాలు ఎల్లప్పుడూ పనిచేసేలా ఉంచడం కోసం ఈ స్కూటర్ ను తయారీని ఫియాజ్జియా చేపట్టింది. ఏప్రిల్ 26, 1946లో కంపెనీ వ్యవస్థాపకులు ఎన్‌రికో పియాజ్జియో ఇటాలియన్ సెంట్రల్ పేటెంట్ ఆఫీస్‌లో విభిన్న మోటార్‌సైకిల్ మోడళ్లను తయారు చేసేందుకు తన పేటెంట్‌ను ఫైల్ చేశారు.
ఫియోజ్జియో ఇంజనీర్లు అప్పుడే కొత్తగా ఏమీ స్కూటర్ ను కనుగొనలేదు. కానీ దాన్ని ఐకానిక్ బ్రాండ్ గా రూపొందించడానికి మాత్రం అహర్నిశలు కృషిచేశారు. నాటి నుంచి నేటి వరకూ అనేక రకాల వెస్పా స్కూటర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. పియాజ్జియో మొట్టమొదటిగా 'వెస్పా ఎమ్‌పి6' ప్రోటోటైప్‌ను సృష్టించారు. ఈ ప్రోటోటైప్ విభిన్న వెస్పా స్కూటర్లకు పునాదిగా నిలిచింది. 1953 వరకూ తన ఉనికి చాటుకోవడానికి వెస్పా ఎంతలా ప్రయత్నించిందంటే చెప్పలేం.
కానీ ఒక్కసారిగా రాత్రికి రాత్రే 1953లో విలియం వైలర్ చిత్రం 'రోమన్ హాలిడే' తో వెస్సా బ్రాండ్ సంచలనాన్ని సృష్టించింది. ఒక్క గంట 59 నిమిషాల వరకూ సాగే ఆ చిత్రంలో, హీరో హీరోయిన్లు గ్రెగరి పెక్, ఆడ్రీ హెప్బర్న్ లు వెస్పా 125 స్కూటర్ పైనే కనిపిస్తారు. దీంతో ఈ స్కూటర్ కు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఆ ఏడాది వెస్పా అమ్మకాలు లక్ష మార్కును టచ్ చేసి రికార్డు సృష్టించాయి. ఈ హిట్ తో ఫియోజ్జియో ఈ స్కూటర్లను వివిధ మోడల్స్ లో, స్టైలిస్ డిజైన్ రీ బ్రాండ్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికీ ఓ స్పెషల్ బ్రాండ్ గానే వెస్పా మార్కెట్లో నిలుస్తోంది. సెయింట్ ట్రోపెజ్ లో జరిగిన ఈ నెల మొదట్లో జరిగిన వెస్పా వరల్డ్ డేస్ ప్రోగ్రామ్ లో..10వేలకు పైగా వెస్పిస్టిలను గ్యాలరీగా ప్రదర్శించింది.
1960లో ప్రాంతంలో వెస్పా స్కూటర్ల ఇండియాలోకి ప్రవేశించాయి. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఇటలీకు చెందిన పియాజ్జియో నుంచి లైసెన్సు పొంది, భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే, పియాజ్జియోతో బజాజ్ ఆటో ఈ కాంట్రాక్ట్‌ను 1971లో రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 1983లో వెస్పా స్వతహాగా ఇండియాలోకి ప్రవేశించి ఎల్ఎమ్ఎల్, పి-సిరీస్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించింది. కానీ 1999లో ఎల్ఎమ్ఎల్, వెస్పాల భాగస్వామ్యం ముగిసిపోయింది. ప్రస్తుతం తన స్కూటర్లు మాత్రమే భారత్ లో విక్రయిస్తోంది. త్వరలోనే వెస్పా 300 జీటీఎస్ ను, వెస్పా 946 లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఫియాజ్జియో సిద్ధమైంది.