ఆన్‌లైన్ బ్యాంకింగ్ సురక్షితమేనా?
ఫైనాన్షియల్ బేసిక్స్..
మన క్రికెట్ టీమ్ ఎప్పుడూ పేపర్ మీద బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ గ్రౌండ్‌లోకి వెళ్లాకే అసలు విషయం తేలుతుంది. క్రికెట్ టీమ్‌లాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్యవహారం కూడా. పేపర్ మీద, నిబంధనల పరంగా చూస్తే.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సురక్షితంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. జరగాల్సిన తంతు జరిగిన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. హైదరాబాద్‌కు చెందిన రఘు అనే వ్యక్తి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా దాదాపు రూ.1.23 లక్షలు పోగొట్టుకున్నాడు.
డబ్బు ఎలా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యిందో అతనికి కూడా తెలియదు. బ్యాంక్ దగ్గరకు వెళ్లి వివరాలు తెలుసుకుంటే.. ఆ డబ్బు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అకౌంట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును తిరిగి రికవరీ చేసుకోవాలంటే చాలా సమయం పట్టొచ్చు. ఇలాగే ఆన్‌లైన్‌లో ఎన్నో రకాల మోసాలు జరుగుతూవుంటాయి. ఇలాంటివాటి బారిన పడకుండా వుండాలంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
జాగ్రత్తలు ఇవి...
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉండాలి.
* పబ్లిక్ కంప్యూటర్లలో లాగిన్ అవకపోవడం మంచిది.
* మీ అకౌంట్ వివరాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు.
* సేవింగ్స్ అకౌంట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే అకౌంట్ నోటిఫికేషన్సను సెట్ చేసుకోవాలి.
* లెసైన్స్‌డ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి.
* అవసరం లేని సమయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి.
* తెలియని మెయిల్స్‌ను ఓపెన్ చేయకూడదు.
* ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పూర్తై వెంటనే లాగ్‌అవుట్ అవ్వండి.
* మీ అకౌంట్‌లో ఏవైనా తెలియని లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకును సంప్రదించండి.