చైనాలో బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ మూసివేత
►సెప్టెంబర్ 30 నుంచి బీటీసీచైనా కార్యకలాపాలు బంద్
► 13% పైగా పతనమైన బిట్‌కాయిన్
బీజింగ్: క్రిప్టోకరెన్సీల చెలామణీని అరికట్టే దిశగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద బిట్‌కాయిన్ ఎక్సే్చంజీల్లో ఒకటైన బీటీసీచైనా (బిట్‌కాయిన్ చైనా) మూతబడనుంది. ఈ నెల 30 నుంచి తమ ఎక్సే్చంజీలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
సెప్టెంబర్ 4న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక పత్రం విడుదల చేసిన దరిమిలా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే లక్ష్యంతో మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ వార్తతో బిట్‌కాయిన్ విలువ గురువారం ఒక దశలో 15 శాతం దాకా క్షీణించి 3,262 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆగస్టు 12 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. చైనా ప్రభుత్వం వర్చువల్ కరెన్సీలను అరికట్టే చర్యలు తీసుకోవాలని యోచిస్తోందంటూ మంగళవారం వార్తలు వచ్చినప్పట్నుంచీ బిట్‌కాయిన్ విలువ పతనమవుతూనే ఉంది. 4,360 డాలర్ల గరిష్ట స్థాయికి కూడా వెళ్లిన బిట్‌కాయిన్ బుధవారం 4,000 డాలర్ల కిందికి పతనమైంది.