ఓపెన్‌ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్‌ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.
మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్‌ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్‌లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్‌ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment