hacking attacks
-
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్ నిఘా!
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షకు పంపించగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తేలింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ స్పైవేర్ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్బారిన పడ్డారని ‘ది వైర్’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్’ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్ ఆనాడు ప్రకటించింది. రాహుల్ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో కాగ్సైట్ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నెటిజన్లు రోజులో కనీసం 4-5 గంటలు ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు, మనం ఎంత విపరీతంగా ఇంటర్నెట్ వాడుతున్నాము అనేది. అయితే, ఈ ఇంటర్నెట్ వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. మన డేటాను రక్షించుకోవడం కోసం ప్రతి ఖాతాకు పాస్వర్డ్ పెట్టుకుంటున్నాం అనే విషయం అందరికీ తేలిసిందే. ఇలా, పెట్టుకున్న ఖాతా వల్ల మన డేటాకు ఎంత వరకు భద్రత లభిస్తుంది అంటే ఎవరు చెప్పలేము. ఏటా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు కొన్ని సార్లు డేటాను క్లిష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాస్వర్డ్లు ఒక్కోసారి గురుణచుకోవడం కష్టం. హ్యాకింగ్ భారీ నుంచి తప్పించుకోవడానికి తరచుగా పాస్వర్డ్ మార్చాల్సి ఉంటుంది. అలా చాలా తక్కువ మంది మాత్రమే క్రమం తప్పకుండా పాస్వర్డ్ మారుస్తూ ఉంటారు. మనం ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్‌వర్డ్‌లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ ఒక నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు జరుగుతున్నాయి. ఇక నో పాస్వర్డ్ మన సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలకు పాస్వర్డ్ పెట్టుకుంటే ఒక భాద, పెట్టుకోకపోతే ఒక భాద. మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఖాతాలకు పాస్వర్డ్ కాకుండా మరో ప్రత్యామ్నాయం అవసరమా అంటే, ప్రతి ఐదుగురిలో ఒకరు "అవును" అని సమాధానం అని ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఈ పాస్వర్డ్ కష్టాలు, హ్యాకింగ్ భాదల నుంచి తప్పించుకోవడానికి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఇకపై పాస్వర్డ్స్లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్‌లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్వర్డ్స్లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథేంటికేటర్ యాప్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. (చదవండి: ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలు గజగజ..! వారికి మాత్రం కాసుల వర్షమే..!) ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన యాప్స్‌కు వర్తించేలా చేయనుంది. అందులో అవుట్ లుక్ ,వన్‌డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్‌ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్‌లో పాస్‌వర్డ్‌లెస్ అకౌంట్ ఆప్షన్‌ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథేంటికేటర్ యాప్స్ నుంచి వచ్చే ఆన్‌స్క్రీన్ ప్రామ్ట్స్'తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ వాడటం ఎలా? మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్స్ తమ ఖాతాలను పాస్వర్డ్లెస్కి మార్చుకోవచ్చు. ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్ యాప్‌తో అనుసంధానించాలి. తర్వాత మీ మైక్రోసాఫ్ట్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్డ్ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్ అష్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు అథెంటీకేటర్ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు తిరిగి పాస్వర్డ్ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్ అష్షన్ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్లైన్ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు కూడా పాస్వర్డ్కి బదులు అథెంటికేషన్ ద్వారా లాగిన్ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే వీటిని ఉపయోగించలా? వద్దా? అనే నిర్ణయాన్ని వినియోగదారులకు ఇచ్చాయి. (చదవండి: Moto G31: మోటోరోలా నుంచి మరో శక్తి వంతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్!) -
ఓరి దేవుడా..! హ్యాకర్లు తెలివి మీరారు..ప్రమాదంలో యూట్యూబ్ క్రియేటర్లు
యూట్యూబ్ క్రియేటర్లకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఫిషింగ్ (ఒరిజినల్‌గా ఉండే ఫేక్ వెబ్‌సైట్స్) పేజెస్ తో పాటు, హానికరమైన ఫైల్స్‌తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారని తెలిపింది. హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్స్‌ను 4వేల డాలర్లకు అమ్ముకుంటున్నట్లు నిర్ధారించింది. కరోనా దెబ్బ కరోనా కారణంగా ఆర్ధిక మాధ్యం తలెత్తెతింది. దీంతో హ్యాకర్స్ సొమ్ము చేసుకునేందుకు మాల్వేర్లతో వరుస దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అయితే ఈ తరహా దాడలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ హ్యాకింగ్ గురించి హైలెట్ చేస్తూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాకింగ్‌కు గురైన 4వేల యూట్యూబ్ అకౌంట్లను పునరుద్ధరించినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. వీటితో పాటు 62,000 ఫిషింగ్ పేజీలు,2,400 హానికరమైన ఫైల్స్‌ను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. తెలివి మీరిన హ్యాకర్స్ ఇక యూట్యూబ్ ఛాన్సల్ను హ్యాక్ చేయడంలో హ్యాకర్స్ తెలివి మీరినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ అఫిషియల్ మెయిల్ పేరుతో ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేశారని, ఆ మెయిల్స్ క్రియేటర్లకు వెరిఫికేషన్ కోసం పంపించినట్లు థ్రెట్ ఎనాలసిస్ గుర్తించింది. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు తమకు యూట్యూబ్ నుంచి అఫియల్స్ మెయిల్ వచ్చిందని,వెంటనే వెరిఫికేషన్ కోసం ప్రయత్నించడం వల్ల హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వెరిఫికేషన్ కోసం పంపిన మెయిల్స్‌ను క్లిక్ చేయడం వల్ల క్రియేటర్ ఛానల్ హ్యాకింగ్ గురవ్వడంతో పాటు పర్సనల్ డేటాను సేకరించినట్లు తేలింది. అంతేకాదు హ్యాక్ చేసిన ఒక్కో యూట్యూబ్ ఛానల్‌ను 4వేల డాలర్లకు అమ్ముకున్నట్లు గూగుల్‌కు చెందిన థ్రెట్ ఎనాలసిస్ గ్రూప్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇక మే 2021 నుండి జీమెయిల్లో ఫిషింగ్ ఇమెయిల్‌ల వాల్యూమ్‌ను 99.6 శాతం తగ్గించినట్లు గూగుల్ తెలిపింది. చదవండి: మొండి గూగుల్.. ఆ ఫోన్లలో కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా వేస్టే! ఎందుకంటే.. -
పదిలో రెండుసార్లు ఫెయిల్.. హ్యాకింగ్ పాఠాలు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్‌లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. హ్యాకింగ్‌లో శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్ ఫోన్ నెంబర్‌తో ఓ వాట్సాప్ సృష్టించాడు. అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్ చేసేవాడు. అదే సమయంలో వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి తెలిపారు. -
మరో బాంబ్‌ను పేల్చిన అంతర్జాతీయ మానవ హక్కుల ఎన్జీవో!
ఇజ్రాయిల్ ఎన్ఎస్వోకు చెందిన పెగాసస్ మాల్వేర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ మాల్వేర్తో పలు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఇతరులపై గూఢాచర్యం నిర్వహించినట్లుగా పలు ఆంగ్ల దినపత్రికల దర్యాప్తులో తేలింది. తాజాగా అంతర్జాతీయ మానవ హక్కుల ఎన్జీవో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరో బాంబును పేల్చింది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్న ఐఫోన్లు జీరో-క్లిక్ ఐమెసేజ్స్తో పెగాసస్ మాల్వేర్ చొరబడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పలు ఐఫోన్ల లాగ్లను విశ్లేషించగా పలు భయంకర నిజాలు బయటకు వచ్చాయి. 2014 జూలై 14 నుంచి పలు ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లను పెగాసస్ స్పైవేర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2021 జూలైలో కూడా ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లపై గూఢాచర్యం చేసినట్లు ఎన్జీవో గుర్తించింది. మీరు ఐఫోన్ యూజర్ల..ఐతే జరభద్రం..! పెగాసస్ స్పైవేర్ ప్రస్తుత ఐఫోన్లలో నడుస్తున్న ఐవోఎస్ 14.6 వర్షన్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లుగా తాజా నివేదికలో తేలింది. అత్యంత భద్రత కల్గిన ఐఫోన్లను సింపుల్‌గా యూజర్ల ఎటువంటి చర్య లేకుండా పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయడానికి iMessageను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఆపిల్ కంపెనీ తన తదుపరి ఐవోస్ 14.7 వర్షన్‌ను మరికొద్ది రోజుల్లో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న బగ్‌ను గుర్తించడంలో ఆపిల్ విజయవంతమౌతుందనీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. -
ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు రావడం తెల్సిందే. భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్టీ–ఇన్ నోటీసు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మోసపూరిత ట్వీట్లు, లింక్‌లను దర్శించిన వారి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హ్యాకింగ్‌ను అడ్డుకునేందుకు ఎలా చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, సినీ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను దుండగులు హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న జో బిడెన్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తదితరుల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. భారత్‌లోనూ పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లోకి దుండగులు ప్రవేశించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఈఆర్టీ–ఇన్ స్పందించింది. -
అమితాబ్ ట్విటర్ ఖాతాలో ఇమ్రాన్ ఫొటో!
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. టర్కీష్‌కు చెందిన హ్యాకర్ గ్రూప్‌గా భావిస్తున్న అయిల్దిజ్ టిమ్ సోమవారం రాత్రి అమితాబ్ బచ్చన్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసింది. అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. ఆయన ఖాతాలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టింది. అదేవిధంగా ఆయన వ్యక్తిగత వివరాలను కూడా మార్చి.. ‘లవ్ పాకిస్థాన్’ అని పేర్కొంటూ టర్కీష్ జెండా ఏమొజీని ఉంచింది. అమితాబ్ ఖాతాను హ్యాక్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై సైబర్ యూనిట్ దర్యాప్తు జరుపుతోందని ముంబై పోలీసులు చెప్తున్నారు. అమితాబ్ ఖాతా కవర్ ఫొటోను మార్చి... ఆ స్థానంలో హ్యాకర్లు తమ గ్రూప్‌కు సంబంధించిన ఎగిరే రాబంధు ఫొటోను పెట్టారు. ‘సమస్త ప్రంపచానికి ఇదే మా పిలుపు. టర్కీష్ ఫుట్‌బాలర్స్ పట్ల ఐస్‌ల్యాండ్ రిపబ్లిక్ ప్రవర్తించిన తీరును మేం ఖండిస్తున్నాం. మేం మృదువుగా మాట్లాడినా.. కఠినంగా వ్యవహరిస్తాం. అది చెప్పడానికే ఈ సైబర్ దాడి. -అయిల్దిజ్ టిమ్ టర్కీష్ సైబర్ ఆర్మీ’ అంటూ హ్యాకర్లు అమితాబ్ ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టారు. భారత్‌లోని ముస్లింలను ఉద్దేశించి కూడా హ్యాకర్లు పోస్టు చేశారు. అయితే, హ్యాకింగ్ బారిన పడ్డ అమితాబ్ ట్విటర్ అకౌంట్‌ను ఒక గంటలోనే పునరుద్ధరించారు. గతంలో ఈ హ్యాకర్ల గ్రూప్ షహీద్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితరుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసింది. -
సంచలన ఆరోపణలు చేసిన భారతీయ హ్యాకర్!
లండన్/న్యూఢిల్లీ: అమెరికాలో తలదాచుకుంటున్న భారతీయ హ్యాకర్ ఒకరు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్ షుజా అనే హ్యాకర్ బాంబు పేల్చారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహకరించిందని తెలిపారు. జియో రూపొందించిన మిలటరీ గ్రేడ్ లో–ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను తన బృందం అడ్డుకోకుంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజయం సాధించేదని వెల్లడించారు. 2014 నాటికి జియో తన సేవలను ప్రారంభించకపోవడం గమనార్హం. ఈవీఎంల హ్యాకింగ్‌లో కేవలం బీజేపీనే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్కూ ప్రమేయం ఉందని షూజా ఆరోపించారు. తన బృందంలో కొందరిని హత్య చేయడంతో 2014లోనే తాను భారత్ విడిచి పారిపోయానన్నారు. లండన్‌లో సోమవారం స్కైప్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసుగు ధరించి షుజా మాట్లాడారు. అయితే తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన చూపలేదు. లండన్ మీడియా సమావేశంలో షుజా మాట్లాడుతూ.. ‘నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో 2009–14 మధ్య పనిచేశాను. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను నా బృందమే డిజైన్ చేసింది. కొత్త ఈవీఎంలను హ్యాక్ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్ మమ్మల్ని కోరింది. ఈసీఐఎల్, బీఈఎల్ రూపొందించే ఈవీఎం లను హ్యాక్ చేయగలం. రిలయన్స్ జియో అందించిన ఓ మాడ్యులేటర్ ద్వారా మిలటరీ గ్రేడ్ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. 2014 ఎన్నికల తర్వాత నా బృందానికి చెందిన కొందర్ని చంపేశారు. నాపై కూడా దాడి జరిగినప్పటికీ తప్పించుకోగలిగాను’ అని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఈసీ హ్యాకర్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. అది హ్యాకింగ్ హర్రర్ షో: బీజేపీ లండన్‌లో జరిగిన మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించిన ‘హ్యాకింగ్ హర్రర్ షో’గా బీజేపీ అభివర్ణించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఆ పార్టీ వెతుక్కుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈ కార్యక్రమానికి వెళ్లడం యాదృచ్ఛికం కాదనీ, సోనియా, రాహుల్ ఆయన్ను పంపారని దుయ్యబట్టారు. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరనీ, దేశవ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ బుర్రను హ్యాక్ చేశారని చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌లోనూ ప్రాబల్యం ఉందనీ, అలాంటివారు లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంత పెద్దవిషయం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
లీకైంది 2.9 కోట్ల మంది డేటానే
శాన్ఫ్రాన్సిస్కో: ఇంతకుముందు అంచనా వేసినట్లు 5 కోట్ల మందివి కాకుండా 2.9 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమచారమే హ్యాకర్ల చేతికి వెళ్లిందని ఫేస్బుక్ శుక్రవారం చెప్పింది. వీరిలో 1.5 కోట్ల మంది వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లను హ్యాకర్లు సంపాదించారనీ, మరో 1.4 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించి మరింత వ్యక్తిగత వివరాలైన లింగం, మతం, ఊరు, పుట్టినతేదీ, ఇటీవల చెక్–ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని ఫేస్బుక్ తెలిపింది. 5 కోట్ల మంది ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ గతనెల చివరి వారంలో వార్తలు రావడం తెలిసిందే. -
రోబోలకూ హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వాడుతున్న మనుషులకే కాదు రోబోలకు కూడా హ్యాకింగ్ ముప్పు ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. పరిశోధనలు చేసే రోబోల కదలికలను హ్యాకర్లు రిమోట్ ద్వారా నియంత్రించే ప్రమా దం ఉందని, ఆఖరికి రోబోల కెమెరా లోని సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రోబో ఆపరేటింగ్ సిస్టమ్ (ఆర్వోఎస్)ను ప్రపంచవ్యాప్తంగా స్కాన్ చేశారు. 2017–18 మధ్య చేసిన ఈ స్కానింగ్‌లో దాదాపు 100 వరకు సురక్షితం కాని వ్యవస్థలు ఆర్వోఎస్ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ‘కొన్ని సురక్షితం కాని రోబోలకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ పరిశోధనలు చేసే రోబోలు మాత్రం పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నియంత్రించవచ్చు’ అని పరిశోధకులు వివరించారు. రోబోలకు, వాటిని నడిపే మనుషులకూ ప్రమాదంగా పరిణమించేలా వాటిని ప్రభావితం చేయొచ్చన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందన్నారు. ఆర్వోఎస్ను హ్యాక్ చేయ డం ద్వారా రోబోల కెమెరాలు, సెన్సర్లు తదితర పరికరాలనూ నియత్రించొచ్చని చెప్పారు. -
‘ఎఫ్’ నుంచి ‘ఏ’ గ్రేడ్‌కు!
కన్సాస్: ఎక్కువ మార్కుల కోసం తల్లిదండ్రులు పిల్లలపై తెస్తున్న ఒత్తిడి ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. భారత సంతతికి చెందిన వరుణ్ సార్జా(20) అనే విద్యార్థి అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీలో 2016లో ఇంజనీరింగ్‌లో చేరాడు. అయితే మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో ఇంట్లో తల్లిదండ్రులు తిడతారని భయపడ్డ వరుణ్ అడ్డదారి తొక్కాడు. కీస్ట్రోక్ లాగర్ అనే హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తన గణితం ప్రొఫెసర్ కంప్యూటర్ను హ్యాక్ చేశాడు. అనంతరం పరీక్షల్లో తనకు వచ్చిన ‘ఎఫ్’ గ్రేడ్‌ను ‘ఏ’ గ్రేడ్‌గా మార్చుకున్నాడు. ఇదే తరహాలో మిగిలిన 9 సబ్జెక్టుల్లోనూ ఏ గ్రేడ్ వచ్చినట్లు హ్యాక్ చేయగలిగాడు. అయితే గణితంలో ఎన్నడూ మంచిమార్కులు తెచ్చుకోని సార్జాకు ఏకంగా ‘ఏ’ గ్రేడ్ రావడంపై అకడమిక్ అడ్వైజర్‌కు అనుమానం వచ్చి మార్కుల్ని తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సార్జాకు ఇక్కడి కోర్టు 18 నెలల జైలుశిక్ష విధించింది. -
డజను ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: రక్షణ, హోం మంత్రిత్వశాఖలు సహా 12కు పైగా ప్రభుత్వ వెబ్సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్‌దాడికి గురైన ఈ వెబ్సైట్లలో చైనీస్ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని జాతీయ సైబర్ భద్రత (ఎన్సీఎస్) సమన్వయకర్త గుల్షన్ రాయ్ అన్నారు. నెట్వర్కింగ్ వ్యవస్థలో హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. -
పొంచి ఉన్న ‘ఉగ్ర’సవాళ్లు
* వ్యూహాత్మక సంస్థలపై సైబర్ దాడులకు కుట్రలు * దేశ ఆర్థిక రంగాన్ని బలహీనపర్చడమే వారి లక్ష్యం * కేంద్ర బలగాల్లో మహిళలకు 33 శాతం కోటా * సీఐఎస్ఎఫ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాక్షి, హైదరాబాద్: ‘ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. దేశ అంతర్గత భద్రత, ఆర్థికాభివృద్ధికి గండికొట్టేందుకు జాతి వ్యతిరేక శక్తులు కాచుకుని ఉన్నాయి. నేటి సైబర్ యుగంలో ఉగ్రవాదం వికృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఆర్థికాభివృద్ధిలో కీలకమైన వ్యూహాత్మక సంస్థలపై హ్యాకింగ్ దాడుల కోసం సైబర్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోంది. సీసీటీవీ, వైఫై, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ల ఆధారంగానే హ్యాకింగ్ దాడుల కోసం ప్రమాదకర ఎత్తుగడలు వేస్తోంది. ఈ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టేందుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్ఎఫ్) ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సైతం నైపుణ్యతను సాధించాలి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రతా దళాల శిక్షణ సంస్థ (నిసా)లో మంగళవారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో కలసి పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ శిక్షణార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఉగ్రదాడుల గాయాలు ప్రజల మనసుల్లో దీర్ఘకాలం ఉండిపోతాయని, అమెరికాలో జరిగిన 9/11, భారత్‌లో జరిగిన 26/11 సంఘటనలు ఇంకా గుర్తున్నాయన్నారు. వ్యూహాత్మక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, వీఐపీలు, మెట్రో రైళ్లు, అంతర్గత భద్రత, విపత్తుల నిర్వహణ తదితర రంగాల్లో సీఐఎస్ఎఫ్ సేవలు మరవలేమన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల భద్రతకే పరిమితమైన సీఐఎస్ఎఫ్ నేడు తమ పరిధిని విస్తరించుకొని, ప్రైవేటు పరిశ్రమల భద్రత అవసరాల కోసం కన్సల్టెన్సీ సేవలూ అందిస్తోందన్నారు. మన ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, ప్రస్తుతం ఏడాదికి 2 ట్రిలి యన్ డాలర్ల వృద్ధి ఉండగా, రానున్న 8 ఏళ్లలో 7 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించేందుకు ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారన్నారు. వసుదైక కుటుంబం అనే సందేశాన్ని కేవలం భారత దేశం మాత్రమే ప్రపంచానికి వినిపించిందని, సరిహద్దుల లోపలున్న వారేకాక వెలుపల ఉన్న వారినీ తమ పౌరులుగా భావించే సంప్రదాయం భారత్‌కు ఉందన్నారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మహిళలకు 33 శాతం కోటా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశానని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో మహిళల భాగస్వామ్యం 5.04 శాతం మాత్రమే ఉందని, దీన్ని 33 శాతానికి పెంచుతామన్నారు. సీఐఎస్ఎఫ్లో ప్రస్తుతమున్న 1.39 లక్షల బలగాలను 2 లక్షలకు పెంచుతామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న 66 మంది అసిస్టెంట్ కమాండెంట్లు, 459 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డీజీ సరేందర్ సింగ్, అకాడమీ డెరైక్టర్ అనిల్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.