
ఐఎంఎఫ్ లో పెరగనున్న భారత్ ఓటింగ్ హక్కులు
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఓటింగ్ హక్కులు పెరగనున్నాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఓటింగ్ హక్కులు పెరగనున్నాయి. ఇందుకుగాను ఐఎంఎఫ్‌లో దేశం రూ.69,575 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు గ్రాంట్‌ను కోరుతూ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెంటులో సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఐఎంఎఫ్ కోటా సంస్కరణల అమలు వల్ల మొట్టమొదటిసారి సంస్థ 10 అతిపెద్ద కోటా సభ్యత్వం ఉన్న దేశాల జాబితాలో నాలుగు వర్థమాన దేశాలు- భారత్, బ్రెజిల్, చైనా, రష్యాలు చేరనున్నాయి.
మిగిలిన ఆరు దేశాలు- అమెరికా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్. 188 సభ్యదేశాల ఐఎంఎఫ్‌లో ప్రస్తుత భారత్ ఓటింగ్ రైట్స్ విలువ 2.34%. కోటా రూపంలో ఈ వాటా 2.44%. దేశాల ప్రాధాన్యతలకు అనుగుణంగా కోటా పెంపు సంస్కరణల అమలు వల్ల ఆయా దేశాల ఇన్వెస్ట్‌మెంట్ పరిమితులు పెరగడం వల్ల ఐఎంఎఫ్ ఆర్థిక పరిపుష్టి మరింత మెరుగుపడనుంది.