జీఎస్‌టీతో వృద్ధి పరుగులు..!
డీమోనిటైజేషన్‌తో ‘ఉగ్ర’ నిధులకు చెక్...
► ఐఎంఎఫ్ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
వాషింగ్టన్: త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)తో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తమ ప్రభుత్వం అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియతో పన్ను ఆదాయాలు మెరుగుపడటంతోపాటు దొంగనోట్ల చెలామణీకి అడ్డుకట్ట పడుతుందన్నారు.
‘డీమోనిటైజేషన్‌తో భారత్ ఆర్థిక వ్యవస్థ తక్కువ నగదు వినియోగం దిశగా పరిణామం చెందుతుంది. ఉగ్రవాదుల నిధులకు వీలుకల్పిస్తున్న దొంగనోట్ల ముప్పుకు కూడా కళ్లెం పడుతుంది’ అని పేర్కొన్నారు. దేశీయంగా పటిష్టమైన డిమాండ్‌కు తోడు తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలతో రానున్న సంవత్సరాల్లో వృద్ధి మరింతగా పరుగులు తీస్తుందన్నారు. ‘జూలై 1 నుంచి జీఎస్‌టీ అమలుకు సంసిద్ధంగా ఉన్నాం. జీఎస్‌టీతో పన్నుల వ్యవస్థ సామర్థ్యం బలోపేతం అవుతుంది. వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పనలో కూడా ఇది తోడ్పాటునందిస్తుంది. దేశవ్యాప్తంగా ఏకరూప మార్కెట్ ఆవిర్భావానికి దోహదం చేస్తుంది’ అని జైట్లీ వివరించారు.
ఐఎంఎఫ్ విశ్వసనీయతకు దెబ్బ...
ఐఎంఎఫ్‌లో కోటా సంస్కరణల అమల్లో జాప్యం పట్ల ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాప్యం మరింతగా కొనసాగితే ఐఎంఎఫ్ తన చట్టబద్ధత, విశ్వసనీయతను కోల్పోతుందని పేర్కొన్నారు. 15వ సాధారణ కోటా సమీక్షలు(జీఆర్‌క్యూ) పూర్తి చేసేందుకు గడువును 2019 వార్షిక సమావేశాల వరకూ పొడిగించడం పట్ల భారత్ చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
కనీసం ఈ గడువుకైగా కట్టుబడతారని ఆశిస్తున్నా’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాస్తవిక మార్పులకు అనుగుణంగా ఐఎంఎఫ్‌లో కోటా సంస్కరణలు అమలు చేయాలని భారత్ ఎప్పటినుంచో కోరుతూవస్తోంది. దీనివల్ల వర్థమాన దేశాల కార్యకలాపాలు ఐఎంఎఫ్‌లో పెరగడంతోపాటు తమ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు వీలవుతుంది.