
డిజిటల్ ప్రపంచంలో హిట్ కాయిన్!
• నోట్ల రద్దుతో బిట్‌కాయిన్‌పై పెరిగిన ఆసక్తి
• నవంబర్‌లో రూ.68,000కు ఎగిసిన బిట్‌కాయిన్ విలువ
• దేశంలోని ట్రేడింగ్ ఎక్సే్ఛంజీల్లో పెరిగిన యూజర్ల సంఖ్య
• అవకాశాల్ని అందుకోవటానికి బిట్‌కాయిన్ స్టార్టప్‌లు
• ప్రపంచవ్యాప్తంగా అధికార నియంత్రణ లేని కరెన్సీ ఇదే
• బంగారంకన్నా విలువెక్కువ... బంగారమూ కొనుక్కోవచ్చు
• ప్రభుత్వాల జోక్యం లేకపోవటంతో సురక్షిత సాధనంగా గుర్తింపు!
• వీటిని స్వీకరించటానికి ఓకే అంటున్న ఆన్‌లైన్ సంస్థలు, దిగ్గజాలు
• ఒక బిట్‌కాయిన్‌ను 10 కోట్ల ‘సతోషి’లుగా విభజించే అవకాశం
• ఎప్పటికైనా గరిష్ఠంగా సృష్టించగలిగేది 2.1 కోట్ల బిట్‌కాయిన్లనే
• వాటిని విడగొట్టగలరు తప్ప మరిన్ని సృష్టించటం అసాధ్యం
• దాంతో మున్ముందు విలువ మరింత పెరుగుతుందనే భావన
• పెరుగుతున్న ఎక్సే్ఛంజీలు; డిజిటల్ బిట్‌కాయన్ వాలెట్లు
కరెన్సీల్లో ఖరీదైనదేంటి? రోజూ చూస్తుంటాం కనక ఠక్కున డాలరు గుర్తొస్తుంది. కానీ దాని విలువ మనకు కేవలం 68 రూపాయలు. అదే కువైట్ దినార్ అయితే..? దాదాపు 223 రూపాయలు. ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన కరెన్సీ ఇదే అంటారంతా!!. మరి బిట్‌కాయిన్ సంగతో..? ఒక బిట్‌కాయిన్ దాదాపు రూ.55,700. అంటే... తులం బంగారంకన్నా కూడా ఎక్కువ. దాదాపు రూ.49,000 పలుకుతున్న కిలో వెండికన్నా కూడా ఎక్కువ. అంతెందుకు!! మన షేర్ మార్కెట్లో అత్యధిక ధర పలికే ‘ఎంఆర్‌ఎఫ్’ షేరుకన్నా కూడా ఎక్కువ. ఇంకా చిత్రమేంటంటే... 2013 ఆరంభంలో దీని ధర దాదాపు రూ.500 దగ్గరుండేది. కానీ మూడేళ్లలో ఏకంగా 110 రెట్లకుపైగా పెరిగిపోయింది. ఎందుకింతలా పెరిగింది? అసలు బిట్‌కాయిన్ అంటే ఏంటి? దీన్నెవరు ముద్రిస్తారు? ఎక్కడ కొనాలి? దీని యజమానులెవరు? దీంతో ఏమేం కొనుక్కోవచ్చు? అసలెక్కడ వాడొచ్చు? ఇవన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానాలే... ఈ ప్రత్యేక కథనం.
బిట్‌కాయిన్ అంటే... డిజిటల్ కరెన్సీ. ఆన్‌లైన్లో కొని, ఆన్‌లైన్లో మాత్రమే వాడుకోగలిగే కరెన్సీ. డాలర్, యూరో, మన రూపాయి వంటి కరెన్సీల్లా దీన్నెవరూ ముద్రించరు. ఫెడరల్ బ్యాంకుల మాదిరిగా దీనిపై ఎవరి నియంత్రణా ఉండదు కూడా. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో శక్తిమంతమైన కంప్యూటర్లు, సర్వర్లను ఉపయోగించి దీన్ని సృష్టించే వ్యక్తుల్ని మైనర్స్‌గా పిలుస్తుంటారు. ఈ మైనింగ్ టీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఈ నెట్‌వర్కే బిట్‌కాయిన్ లావాదేవీల్ని పారదర్శక పద్ధతిలో బ్లాక్‌చెయిన్ ద్వారా నమోదు చేస్తుంది. అంటే! బిట్‌కాయిన్లకు తమ సొంత పేమెంట్ గేట్‌వే ఉందన్నమాట. అదీ కథ.
ధరెందుకు పెరుగుతోంది?
బిట్‌కాయిన్లను జపాన్‌కు చెందిన సతోషి నకమొతో 2008లో సృష్టించారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్ రూపంలో మార్చుకునే కరెన్సీగా... ఏ నియంత్రణా లేని కరెన్సీగా ఇది చలామణిలోకి వచ్చింది. కాకపోతే దీన్ని ఆన్‌లైన్ సైట్లు, ఇతర వ్యాపారులు తీసుకోవటం 2009 నుంచీ మొదలయింది. దీంతో బిట్‌కాయిన్ల ధర ఒకదశలో అమాంతం ఎగసింది. మళ్లీ పడింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపారులంతా దీన్నిపుడు అంగీకరిస్తుండటంతో ధర బాగా పెరుగుతోంది. బిట్‌కాయిన్ల ధర బాగా పెరగటానికి మరో కారణం కూడా ఉంది. ఎంత మైనర్లయినా... ఎంత శక్తిమంతమైన కంప్యూటర్లయినా ఈ బిట్‌కాయిన్లను 2.1 కోట్లకు మించి సృష్టించలేవు.
అంటే ఏ దశలోనైనా 2.1 కోట్లకన్నా ఎక్కువ బిట్‌కాయిన్లుండే చాన్సు లేదన్నమాట. కాకపోతే వీటిని ముక్కలు చెయ్యటం మాత్రం వీలవుతుంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ను అత్యంత తక్కువ డినామినేషన్లో... 10కోట్లవ వంతుకు విడగొడుతున్నారు. దీన్ని ‘సతోషి’గా పిలుస్తున్నారు. అంటే... 10 కోట్ల సతోషిలు కలిస్తే ఒక బిట్‌కాయిన్ అన్నమాట. దీనర్థం ఒక్కటే... కోట్ల కోట్ల సతోషిలు అందుబాటులోకి రావచ్చు. చిల్లర సమస్య కూడా ఉండదు. కాబట్టి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతుందన్నది కాదనలేని నిజం.
బిట్‌కాయిన్లు ఎందుకు ఆకర్షణీయమంటే..
⇔ దీన్ని ఒక ప్రభుత్వమో, కేంద్రబ్యాంకో నియంత్రించదు. కాబట్టి తాజా నోట్లరద్దు మాదిరిగా ఒక్క ఆదేశంతో వెనక్కి తీసుకోలేరు. నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లన్నీ కలసి దీన్ని నియంత్రిస్తాయి. అంటే వికేంద్రీకృత కరెన్సీ అన్నమాట.
⇔ బ్యాంకు ఖాతా అక్కర్లేదు. ఆన్‌లైన్లో బిట్‌కాయిన్ అడ్రస్ ఏర్పాటు చాలా తేలిక. మీ పేరు, ఇతర వివరాలు చెప్పకుండా ఆ అడ్రస్‌లో బిట్‌కాయిన్లు దాచుకోవచ్చు. లావాదేవీలన్నీ పారదర్శకం కనక... అన్నీ బ్లాక్‌చెయిన్లో నమోదవుతాయి. ఏ అడ్రస్ ఎవరిదనేది తెలియకపోయినా... దేన్లో ఎన్ని కాయిన్లున్నాయో ఈజీగా తెలుస్తుంది. డబ్బుకు లెక్కుంటుంది.
⇔ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అతివేగంగా లావాదేవీలు జరిగిపోతాయి. లావాదేవీల ఖర్చు అత్యల్పం.
⇔ క్రెడిట్, డెబిట్ కార్డులకొచ్చేసరికి సమాచారమంతా ఆన్‌లైన్లో ఇస్తాం కనక మోసాలకు కొదవలేదు. బిట్‌కాయిన్లలో అది దాదాపు అసాధ్యం. ప్రతి వ్యక్తికీ ప్రయివేటు, పబ్లిక్ కీ రెండుం టాయి. పబ్లిక్ కీ అంటే అడ్రస్. అది అందరికీ తెలిసేదే. ప్రయివేటు కీ మాత్రం తనకే తెలుస్తుంది. ఆ రెంటినీ కలిపి లావాదేవీ జరిపితే... క్లిష్టమైన గణితంతో కలసి సర్టిఫికెట్ పుడుతుంది. అప్పుడు సదరు లావాదేవీ అధికారికమవుతుంది.
⇔ బ్యాంకులు మీ ఖాతా కావాలనుకుంటే స్తంభింపజేయగలవు. బిట్‌కాయిన్ వ్యవస్థలో అలా జరిగే అస్కారం లేదు. ఒక అడ్రస్‌లో ఎన్ని కాయిన్లున్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అడ్రస్ ఎవరిదనేది తెలియదు. పైపెచ్చు మీరు బిట్‌కాయిన్లతో ఏది కొన్నా రహస్యంగానే ఉంటుంది.
మరి ఈ కాయిన్లు కొనేదెలా?
బిట్‌కాయిన్లను వ్యక్తుల నుంచిగానీ, ఎక్సే్ఛంజీల నుంచిగానీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే వీటిని కొనే ముందు వాలెట్ కొనుక్కోవాలి. వాలెట్లను మీ కంప్యూటర్లో, ఆన్‌లైన్లో, లేదా హార్డ్ వేర్ రూపంలో అందించే వాల్ట్ రూపంలో ఉంచుకోవచ్చు. తరువాత కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు చాలా సంస్థలు, ఎక్సే్ఛంజీ లున్నా... బిట్‌స్టాంప్, క్రాకెన్ (అమెరికా), బిట్‌ఫినెక్స్ (హాంకాంగ్), ఓకే కాయిన్, బీటీసీసీ (చైనా), బీటీసీఎక్స్, కాయిన్ సెక్యూర్ (ఇం డియా) వంటివి ఆయా దేశాల్లో ప్రధానమైనవి. కాకపోతే ప్రతి ఎక్సే్ఛంజీ ఇపుడు ఆయా దేశాల్లోని నిబంధనల మేరకు వ్యక్తుల పాన్ వంటి వివరాలడుగుతోంది. ఇక కాయిన్‌బేస్, సర్కిల్ వంటి వాలెట్ సంస్థలు కూడా వాలెట్ సేవలతో పాటు ఎక్సే్ఛంజీల మాదిరి కొనుగోలు, అమ్మకం సేవలందిస్తున్నాయి. చాలా దేశాల్లో వీటిని క్రెడిట్, డెబిట్ కార్డులు... మనీ ఆర్డర్లు ఉపయోగించి కొనుగోలు చేసే వీలుంది. విశేషమేంటంటే మీ వాలెట్ డిజిటల్ రూపంలోనే ఉంటుంది కనక ఎప్పటికప్పుడు మారే బిట్‌కాయిన్ విలువ మీ వాలెట్లోనూ కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మీ బిట్‌కాయిన్ల విలువ కూడా మారుతుంది.
మైనింగ్ జరిగేది ఎలా?
బిట్‌కాయిన్లను ఒకరికొకరు పంపించుకోవచ్చు. మరి ఎవరో ఒకరు రికార్డులు నిర్వహించాలి కదా? నిర్ణీత సమయానికి జరిగిన రికార్డులన్నిటినీ తమ కంప్యూటర్ల సాయంతో ఎవరో ఒకరు నిర్వహిస్తారు. దాన్ని బ్లాక్‌గా వ్యవహరిస్తారు. సదరు బ్లాక్‌లతో బ్లాక్ చెయిన్ ఏర్పడుతుంది. అది ఆ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవతుంది. కానీ కొత్త లావాదేవీలు నమోదయ్యే కొద్దీ ఇది మరింత పెరుగుతుంది. దాన్నంతటినీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ల సాయంతో యాష్‌లు, ఇతర సాంకేతిక పదాలుపయోగించి సురక్షితం చేస్తారు. ఇలా బ్లాక్‌చెయిన్ అప్‌డేట్ చేసిన మైనర్లకు నజరానాగా 25 బిట్ కాయిన్లు దక్కుతాయి. అది అందరికీ తెలుస్తుంది కూడా. కాకపోతే లావాదేవీలు పెరిగేకొద్దీ... ఇది మరింత సంక్లిష్టంగా మారుతుంటుంది.
ఇక బిట్‌కాయిన్ మైనింగ్‌కు ఉపయోగించే హార్డ్‌వేర్ కూడా తేలికదేమీ కాదు. సెకనుకు ఎన్ని ఎక్కువ హ్యాష్‌లు జనరేట్ చేసే ప్రాసెసర్ అయితే కాయిన్లు పొందేందుకు అన్ని అవకాశాలుంటాయన్న మాట. మామూలు సిస్టమ్‌లు సెకనుకు 10మెగా హ్యాష్‌లు జనరేట్ చేసేవైతే... మైనర్లు వాడేవి సెకనుకు 1టెరా హ్యాష్‌లు జనరేట్ చేసే శక్తి కలిగి ఉంటాయి. ఇక వీటికయ్యే విద్యుత్ ఖర్చులూ ఎక్కువే. ఇవి కాక ఇంకొన్ని పరికరాలూ ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్ మైనింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించటం ద్వారా మైనర్ల టీమ్‌లో చేరొచ్చు.
రోజుల వ్యవధిలో భారీ రాబడులు..
బిట్‌కాయిన్లలో పెట్టుబడులపై అవగాహన ఉన్న కొందరు ఇన్వెస్టర్లు డీమోనిటైజేషన్ తరుణంలో బాగానే లాభపడ్డారు. కొన్నాళ్ల క్రితం రూ.49,000–51,000 స్థాయిలో కొనుగోలు చేసిన వారు నవంబర్‌లో రూ.68,000–69,000 స్థాయిలో విక్రయించి లబ్ధి పొందారు. సాధారణంగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఏళ్ల తరబడి చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై చక్రగతిన 25–30 శాతం మేర రాబడులు వస్తుండగా.. కేవలం నెలరోజుల వ్యవధిలోనే బిట్‌కాయిన్లు 25 శాతం పైగా రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది రూ.55,700 స్థాయిలో కదులుతోంది. ఈ పరిణామాలతో కొత్త ఇన్వెస్టర్లు కూడా వీటి వైపు చూస్తున్నారు.
బిట్‌కాయిన్ స్టార్టప్‌లకు పండుగ!!
పెద్ద నోట్ల రద్దుతో అంతా ప్రత్యామ్నాయా మార్గాలవైపు చూస్తున్న నేపథ్యంలో బిట్‌కాయిన్ స్టార్టప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. ఈ మధ్య దేశంలో జేబ్‌పే, ఉనోకాయిన్, కాయిన్‌సెక్యూర్ వంటి బిట్‌కాయిన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘జేబ్‌పే’లో నవంబర్‌లో ట్రేడింగ్ పరిమాణం ఏకంగా రూ.120 కోట్ల స్థాయిని తాకింది. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఆదాయం కూడా 25 శాతం పెరిగినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొందరు ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తిగత పెట్టుబడులు జేబ్‌పే సమీకరించింది. సాధారణంగా ప్రతి నెలా సుమారు 20,000 కొత్త యూజర్లు జేబ్‌పేలో చేరుతుండగా.. నవంబర్‌లో ఈ సంఖ్య ఏకంగా 50,000కు పెరిగింది. మొత్తం మీద జేబ్‌పేలో ప్రస్తుతం 2,50,000 మంది పైచిలుకు యూజర్లున్నారు. మరోవైపు, ఉనోకాయిన్ యూజర్ల సంఖ్య గత నెలలో మూడు రెట్లు పెరిగి 1,20,000కి చేరింది. ట్రేడింగ్ పరిమాణం రెట్టింపై రోజుకు 300 బిట్‌కాయిన్ల స్థాయికి చేరింది. ఇక, కాయిన్‌సెక్యూర్ కొత్త యూజర్ల సంఖ్య 300 శాతం పెరిగి 90,000కు చేరింది.
దేశీయంగా బిట్‌కాయిన్ స్టార్టప్‌లు..: దేశీయంగా సుమారు 20 బిట్‌కాయిన్ స్టార్టప్‌లున్నాయి. వీటిలో మూడు మాత్రమే ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించగలిగాయి. ఇందులో జేబ్‌పే (1 మిలియన్ డాలర్లు), ఉనోకాయిన్ (1.5 మిలియన్ డాలర్లు), కాయిన్‌సెక్యూర్ (1.5 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఉనోకాయిన్ ఇటీవలే బ్లూమ్ వెంచర్స్, అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ డిజిటల్ కరెన్సీ గ్రూప్ నుంచి నిధులు సమీకరించింది.
బిట్ కాయిన్లను దేనికి వాడొచ్చు?
ఇప్పుడు కాయిన్‌బేస్ వంటి వాలెట్లు తమ వాలెట్లోని బిట్‌కాయిన్లతో నేరుగా బంగారాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. బంగారం బిస్కెట్లను ఆర్డర్ చేస్తే డెలివరీ చేస్తున్నాయి కూడా. ఇక డెల్ వంటి సంస్థలతో పాటు విదేశాల్లోని పలు ఎయిర్‌లైన్ సంస్థలు కూడా బిట్‌కాయిన్లను కరెన్సీగా అంగీకరిస్తున్నాయి. అమెజాన్ వంటి సైట్లలో షాపింగ్‌కు వినియోగించే గిఫ్ట్ కార్డులనూ వీటితో కొనొచ్చు. ఇపుడిప్పుడే చాలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు వీటిని అంగీకరిస్తున్నాయి. కాకపోతే ప్రతి లావాదేవీనీ మైనర్లు ధ్రువీకరిస్తుంటారు. తరువాత బ్లాక్‌చెయిన్ ఏర్పడుతుంది. దీనికి 10 నిమిషాల వరకూ సమయం పట్టొచ్చు. ఒక బిట్‌కాయిన్‌ను 10కోట్ల సతోషిలుగా విడగొట్టే అవకాశముంది కనక ఏ ధరతోనైనా లావాదేవీ చేసుకోవచ్చు.
ఇక ఇండియా విషయానికొస్తే పెద్ద ఈ కామర్స్ సంస్థలు.. బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఫ్లయింగ్ స్పాగెట్టీ మాన్‌స్టర్ వంటి రెస్టారెంట్లు కూడా వీటిని అనుమతించాలని భావిస్తున్నాయి. సప్న బుక్‌హౌస్, వైకే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఫ్లైట్‌షాప్ వంటి వ్యాపార సంస్థలు ఉనోకాయిన్ ఎక్సే్చంజీ ద్వారా బిట్‌కాయిన్ల చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. బిట్‌కాయిన్‌ను కూడా ఒకరకంగా పసిడి లాంటి పెట్టుబడి సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తుండటం గమనార్హం.