
బైక్ ట్యాక్సీలకు ఆదరణ కరువు..
♦ పెట్టుబడులకూ కొరతే
♦ మూతబడుతున్న పలు స్టార్టప్‌లు
♦ నిబంధనల్లో అస్పష్టత కూడా కారణం
క్యాబ్‌లకు దీటుగా పలు స్టార్టప్ సంస్థలు బైక్ ట్యాక్సీ సేవలను అట్టహాసంగా ప్రారంభించినా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, పెట్టుబడుల కొరత మొదలైన సమస్యలు దీనికి తోడు కావడంతో దేశీ స్టార్టప్ సంస్థలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి పెద్ద సంస్థల తరహాలో భారీ సబ్సిడీలివ్వలేక కుదేలవుతున్నాయి. ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే బైక్ ట్యాక్సీ సర్వీసులకు లైసెన్సులు ఇస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి చూస్తే తెలంగాణ, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు వాణిజ్యపరమైన బైక్ ట్యాక్సీ సేవలకు ఆమోదముద్ర వేశాయి. హరియాణాలో కమర్షియల్ బైక్ ట్యాక్సీ లైసెన్సులు ఇస్తున్నప్పటికీ .. యాయా, డాట్, టూవీల్జ్, రైడ్‌జీ వంటి సంస్థలు కార్యకలాపాలు నిలిపివేశాయి. బాక్సీ, ఎంటాక్సీ వంటి మరో రెండు సంస్థలు డెలివరీస్ కార్యకలాపాలకు మళ్లాయి.
కాస్తో కూస్తో బాక్సీ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక బెంగళూరు సంగతి తీసుకుంటే హెడ్‌లైట్, హేబాబ్, జింగో సంస్థలు కూడా మూతబడ్డాయి. వ్యాపార సంస్థలకు మాత్రమే సర్వీసులు అందించే అవకాశాన్నీ పరిశీలించామని.. కానీ నిధులు పూర్తిగా అయిపోవడంతో అప్పటికే ఆలస్యమైపోయిందని హేబాబ్ వ్యవస్థాపకుడు విశాల్ బీఎం తెలిపారు. అటు ఇన్వెస్టర్ల నుంచి కూడా ఆసక్తి లేకపోవడంతో మూసివేయక తప్పలేదని పేర్కొన్నారు.
ఉబెర్, ఓలా ఆసక్తి అంతంతే..
బైక్ ట్యాక్సీ మార్కెట్ వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోవడంతో ఓలా, ఉబెర్‌లు కూడా పెద్దగా దీనిపై ఆసక్తి కనపర్చడం లేదు. నిబంధనలపరమైన విషయాల్లో నియంత్రణ సంస్థలతో చర్చల్లో పురోగతి లేకపోవడం వల్లే బైక్ ట్యాక్సీల కార్యకలాపాలు ముందుకు సాగలేదని ఉబెర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే, చర్చలు కొనసాగిస్తామని, తగిన సమయంలో బైక్స్‌ను మళ్లీ లాంచ్ చేస్తామని వివరించాయి,. త్వరలోనే బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. సాధారణంగా బైక్ నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 1.7గా ఉంటుంది.
కిలోమీటరుకు కనీసం రూ. 8 మేర చార్జీ, కనీసం అయిదు కి.మీ. ప్రయాణ దూరం ఉంటే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని, వ్యాపారాలు నిలదొక్కుకోగలవని బైక్ ట్యాక్సీ సంస్థలు అంటున్నాయి. ఆటోలతో పోలిస్తే ఇది చాలా చౌకేనని చెబుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణాలకి సంబంధించి.. బేస్ ఫేర్ మొదలైనవి కూడా కలిపి చార్జీలు కి.మీ.కి రూ. 7–8 మధ్యలో ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ... కేంద్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై కొత్తగా ముసాయిదా నిబంధనలు రూపొం దించడం స్టార్టప్ సంస్థల్లో కాస్త ఆశలు రేపుతోంది.
పడుతూ.. లేస్తూ.. బాక్సీ
మిగతా బైక్ ట్యాక్సీ సంస్థలతో పోలిస్తే బాక్సీ, ర్యాపిడో మొదలైనవి కాస్త పెట్టుబడులు దక్కించుకోగలిగాయి. అరవింద్, పవన్, రిషికేష్‌లు ప్రారంభించిన ర్యాపిడో ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి గణనీయంగా పెట్టుబడులు సమీకరించగలిగింది. ఇన్వెస్ట్ చేసిన వారిలో గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్, హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అటు బాక్సీ సైతం దాల్మియా గ్రూప్, హెచ్‌టీ మీ డియా లాంటి దిగ్గజ గ్రూప్‌లతో పాటు ఏంజె ల్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 9 కోట్లు సమీకరించింది.
గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో బాక్సీ ప్లాట్‌ఫాంపై ప్రస్తుతం 600 పైగా బైక్‌లు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 40 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. కేవలం యాప్ బుకింగ్స్‌పైనే ఆధారపడకుండా.. మెట్రో స్టేషన్లు, బైక్ ట్యాక్సీ స్టాం డ్స్‌లో కూడా తమ వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే తోడ్ప డుతోందని బాక్సీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే లాభాలూ ఆర్జించగలమని ధీమా వ్యక్తం చేశాయి.