- పోలండ్ అంబాసిడర్ థోమస్ లుకాజుక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోలండ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. 2014 నాటికి పోలండ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్లకు చేరిందంటే ఇక్కడి వ్యాపార అవకాశాలను అర్థం చేసుకోవచ్చని పోలండ్ అంబాసిడర్ థోమస్ లుకాజుక్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఇండియా-సెంట్రల్ యూరోప్ బిజినెస్ ఫోరం (ఐసీఈబీఎఫ్) 2వ ప్రదర్శన అక్టోబర్ 5-6 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. దీనికి సంబంధించిన రోడ్ షో కార్యక్రమం సందర్భంగా సోమవారమిక్కడ థోమస్ మాట్లాడుతూ.. 2007-08లో సంభవించిన యూరోపియన్ ఆర్థిక సంక్షోభంలోనూ స్థిరమైన అభివృద్ధిని సాధించింది పోలండ్ దేశమొక్కటేనని గుర్తు చేశారు.
ఆ ఏడాది 1.8 స్థూల జాతీయోత్పత్తిని సాధించిందని.. 2014 నాటికి 3.3కి చేరిందని పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు నిరుద్యోగాన్ని రూపుమాపుతాయనడానికి మా దేశం చక్కటి ఉదాహరణ. మా దేశంలో నిరుద్యోగం 5 శాతమే. ఇందుకు కారణం మా దేశంలోకి ఏటా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులొస్తున్నాయి. అంటే ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10-50 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని’’ ఆయన వివరించారు.
ఇండియా- పోలండ్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎందుకంటే ఇండియా నుంచి పోలండ్‌కు దిగుమతులు 413 మిలియన్ డాలర్లుగా ఉంటే.. పోలండ్ నుంచి ఇండియాకు 1,282 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడానికి సత్వర అనుమతుసహా పన్ను రాయితీలూ కల్పిస్తున్నామన్నారు. ‘‘ఐసీఈబీఎఫ్ తొలి ప్రదర్శన ఢిల్లీలో జరిగిందని.. 3వ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఫిక్కీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కో-చైర్మన్ దేవేంద్ర సురానా చెప్పారు. బెంగళూరులో జరిగే సదస్సులో యూరప్ నుంచి 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు.
పోలండ్‌లో వ్యవసాయాధారిత పరిశ్రమలకు అవకాశాలు
Published Tue, Aug 11 2015 12:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement