సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత‍్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని దేశాలకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఏప్రిల్ 30 వరకు ఈ నిషేధం అమలు కానుందని ఎయిరిండియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందే, ఇటలీ, ఫ్రాన్స్‌తో సహా చాలా యూరోపియన్ మార్గాల్లో విమానయాన సంస్థ సేవలను తగ్గించిన ఎయిరిండియా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కువైట్‌కు తన విమాన సర్వీసులను నిలిపివేసింది. కాగా మార్చి 13 నుండి ఏప్రిల్ 15 వరకు దౌత్య లాంటి కొన్ని వర్గాలు మినహా అన్ని వీసాలను నిలిపివేయాలని బుధవారం ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం సాయంత్రానికి 5 వేలకు చేరుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment