‘మహారాజా’కు మంగళం! | Air India Sale: Government Decided To Sell 100 Percent Stake | Sakshi
Sakshi News home page

‘మహారాజా’కు మంగళం!

Published Tue, Jan 28 2020 5:07 AM | Last Updated on Tue, Jan 28 2020 9:19 AM

Air India Sale: Government Decided To Sell 100 Percent Stake - Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది. కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 17ను గడువుగా (డెడ్‌లైన్‌) నిర్ధేశించింది.

బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం... చౌక ధరల ఎయిర్‌లైన్స్‌ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో తనకున్న 100% వాటాలను అదేవిధంగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌(జేవీ) ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50% వాటానూ ఎయిరిండియా విక్రయించనుంది. ఈ జేవీ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలందిస్తోంది. బిడ్డింగ్‌లో విజయం సాధించిన సంస్థకు ఎయిరిండియాతో పాటు ఈ 3 సంస్థల్లో మొత్తం యాజమాన్య నియంత్రణను బదలాయించనున్నారు.

వాటికి మాత్రం మినహాయింపు... 
ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్, హాటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాల్లో తనకున్న కీలకమైన వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయిస్తున్నట్లు బిడ్డింగ్‌ పత్రంలో పేర్కొంది. ఈ సంస్థల్లోని వాటాలను ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(ఏఐఏహెచ్‌ఎల్‌)కు బదలాయించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది.

కాగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు ప్రస్తుతం ఉన్న రుణభారంలో రూ.23,287 కోట్లను వీటిని కొనుగోలు చేసే సంస్థలే భరించాల్సి ఉంటుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన రుణాన్ని(దాదాపు రూ.36,760 కోట్లు) ఏఐఏహెచ్‌ఎల్‌కు కేటాయించనున్నారు. మొత్తం బకాయిలు, రుణాలు కలిసి రూ.56,334 కోట్లను ఈ సంస్థకు బదలాయిస్తారు. దీంతో పాటు రూ.17,000 కోట్ల ఆస్తులు కూడా దీనికి దక్కుతాయి.

అమ్మకానికి మూడోసారి... 
ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనను ప్రకటించడం గడిచిన రెండేళ్లలో ఇది రెండోసారి. సంస్థలోని 76% వాటాను విక్రయించడంతోపాటు యాజమాన్య నియంత్రణను కూడా బిడ్డింగ్‌లో నెగ్గిన ప్రైవేటు సంస్థలకు కట్టబెడతామంటూ ప్రభుత్వం 2018లో తొలిసారిగా ప్రతిపాదించింది. అయితే, ఇందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా 100% వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. వాస్తవానికి 2001–02లో అప్పటి ఎన్‌డీఏ  హయాంలో ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విడివిడిగా ఉన్నప్పుడే అమ్మకానికి యత్నించినా.. సాధ్యం కాలేదు. అంటే ప్రస్తుత ప్రతిపాదన మూడోసారిగా లెక్క.

నిబంధనల సడలింపు... 
ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిరిండియాను అమ్మేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం తాజాగా బిడ్డింగ్‌ నిబంధనలను కూడా సడలించింది. ప్రధానంగా కొనుగోలుకు ముందుకొచ్చే బిడ్డర్లకు కనీస నెట్‌వర్త్‌(వ్యాపార విలువ)ను రూ.3,500 కోట్లుగా నిర్ధారించింది. అదేవిధంగా ఒకరికంటే ఎక్కువమంది కన్సార్షియంగా బిడ్డింగ్‌ వేసేవారికి కూడా భాగస్వామ్య సంస్థకు కేటాయించాల్సిన కనీస వాటాను 10%కి తగ్గించారు. 2018లో అమ్మకం ప్రతిపాదనలో దీన్ని రూ.5,000 కోట్లు, 26%గా కేంద్రం నిర్దేశించింది.

కాగా, తాజా బిడ్డింగ్‌ ప్రకారం కన్సార్షియంలో ప్రధాన భాగస్వామ్య సంస్థకు నెట్‌వర్త్‌లో 26% వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కన్సార్షియంలో వ్యక్తులు(ఇండివిడ్యువల్స్‌) కూడా చేరొచ్చు. కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న బిడ్డర్లకు డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ముసాయిదా వాటా కొనుగోలు ఒప్పందంతో పాటు సంస్థకు చెందిన అన్ని రికార్డులను అందుబాటులో ఉంచనున్నారు.

ఎంతో విలువైంది...
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో కలిపితే ఎయిరిండియా అనేది చాలా విలువైనదని..  ‘గొప్ప ఆస్తి’గా పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యాఖ్యానించారు. బిడ్డింగ్‌లో దీన్ని చేజిక్కించుకునే సంస్థ ఎయిరిండియా బ్రాండ్‌ను నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎయిరిండియాకు ఉన్న మొత్తం భూములు, భవనాలు ఇతరత్రా స్థిరాస్తులతో పాటు పెయింటింగ్స్‌ తదితర కళాకృతులు ఈ అమ్మకంలోకి రావని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో కొన్ని భవనాలు, స్థలాలు, కార్పొరేట్‌ ఆఫీసులను కొత్త ఇన్వెస్టర్లకు ఎయిర్‌లైన్‌ నిర్వహన నిమిత్తం కొంతకాలం వినియోగించుకోవడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ అమ్మకంపై బీజేపీకి చెందిన సుబ్రమణ్య స్వామి, యశ్వంత్‌ సిన్హా వ్యతిరేకతపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరివీ వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదన్నారు. ‘ఎయిరిండియా విక్రయం పూర్తిగా దేశద్రోహ చర్య. దీనిపై కోర్టుకెళ్తా’ అంటూ స్వామి సోమవారం ట్వీట్‌ చేశారు.

ఉద్యోగులకు షేర్లు... 
వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ఎయిరిండియా ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్రోగ్రామ్‌(ఎసాప్స్‌) కింద తక్కువ ధర(డిస్కౌంట్‌)కు షేర్లను ఇవ్వనున్నట్లు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వర్గాల్లోని ఒక వ్యక్తి తెలిపారు. ఎయిరిండియా షేర్లలో 3 శాతాన్ని (సుమారు 98 కోట్ల షేర్లు) ఎసాప్స్‌ కింద పక్కనబెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.1,384 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఎయిరిండియాలో అవసరానికి మించి సిబ్బంది ఎవరూలేరని.. రిటైర్‌ అయ్యే ఉద్యోగుల మెడికల్‌ ప్రయోజనాలకు సబంధించిన అంశాన్ని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ పేర్కొన్నారు.

►రూ.60,074 కోట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు 2019 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రుణ భారం
►రూ.4,800 కోట్లు 2018–19లో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు 17,984
►2019 నవంబర్‌ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం ఉద్యోగులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement