ఎయిర్ టెల్ గుప్పిట్లోకి మరో టెలికాం
ఎయిర్ టెల్ గుప్పిట్లోకి మరో టెలికాం
Published Wed, Jun 28 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
నష్టాల్లో ఉన్న టెలికాం ఆపరేటర్లను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటూ.. ఎయిర్ టెల్, ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే భారత వ్యాపారాల్లో నష్టాలో ఉన్న టెలినార్ ను తనలో విలీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్ టెల్... మరో టెలికాం ఆపరేటర్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. టాటా గ్రూప్ కు చెందిన టాటా టెలీసర్వీసులను భారతీ ఎయిర్ టెల్ కొనుగోలు చేసే అవకాశముందుని ఓ యూకే రీసెర్చ్ సంస్థ చెప్పింది. దీంతో వచ్చే మూడేళ్లలో కేవలం నాలుగు ఆపరేటర్లు మాత్రమే భారత టెలికాం సెక్టార్ లో ఉంటాయని లండన్ కు చెందిన సీసీఎస్ ఇన్ సైట్ రిపోర్టు చెప్పింది. 57 టెలికాం ఎం అండ్ ఎం ప్రభావితదారులతో అధ్యయనం చేపట్టి సీసీఎస్ ఇన్ సైట్ ఈ రిపోర్టును నివేదించింది.
ఈ సర్వేలో 68 శాతం మంది నిపుణులు(బ్యాంకర్లు, లాయర్లు, టెలికాం ఎగ్జిక్యూటివ్ లు) 2020 నాటికి నాలుగే ఆపరేటర్లు మార్కెట్లో ఉంటాయని చెప్పారని రిపోర్టు తెలిపింది. వారిలో 300 మిలియన్ కు పైగా సబ్ స్క్రైబర్లతో మూడు ప్రైవేట్ ప్రొవైడర్లు, 100 మిలియన్ కు పైగా యూజర్లతో ఓ ప్రభుత్వ రంగ ఆపరేటర్ ఉంటుందని పేర్కొంది. టాటా టెలి ఓ కొత్త హోమ్ కోసం వెతుకుతుండగా.. అంబానీ బ్రదర్స్ తమ రెండు వ్యాపారాలను(రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్లు) కలిపేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పింది. వొడాఫోన్, ఐడియా విలీనమవుతూ టెలికాం మార్కెట్లో ఆధిపత్య స్థానానికి వచ్చేయాలని చూస్తుండగా.. భారతీ ఎయిర్ టెల్ కూడా ఇటీవల ఎక్కువగా కొనుగోలు చర్చలు తెరలేపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నష్టాల ఊబిలో ఉన్న టాటా టెలీని కొనుగోలు చేయడానికి ఎయిర్ టెల్ కొంత వ్యాపార తెలివితేటలు కూడా వాడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టాటాలతో డీల్ కుదుర్చుకోవడానికి ప్రధాన కారణం మార్కెట్ రెవెన్యూ షేరులో ఆధిపత్య స్థానాన్ని అలానే కొనసాగించాలని కోరుకోవడమేనని తెలిపారు. వొడాఫోన్, ఐడియా డీల్ ఎయిర్ టెల్ కు పెనుముప్పుగా ఉందని, కానీ వారికి కచ్చితంగా సునిల్ మిట్టర్ కౌంటర్ ఇస్తారని ఓ టాప్ ఇండస్ట్రి విశ్లేషకుడు చెప్పారు. ఆకర్షణీయమైన ధరలతో ఇలాంటి డీల్స్ ను కుదుర్చుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా టెలి సుమారు రూ.9500 కోట్ల రెవెన్యూలను కలిగి ఉంది.
Advertisement
Advertisement