న్యూ ఢిల్లీ: ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్ తన నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే 4G నెట్వర్క్ సేవలతో ముందున్న ఎయిర్ టెల్ రానున్న మూడేళ్లలో 60,000 కోట్ల రూపాయలను నెట్వర్క్ విస్తరణ కోసం కేటాయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తుందని భారతీ ఎయిర్టెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నెట్వర్క్ సేవల కోసం ఇప్పటికే ఎయిర్ టెల్ 1,60,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. కాగా అదనంగా చేపడుతున్న 'ప్రాజెక్ట్ లీప్' ద్వారా ఎయిర్ టెల్ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సౌకర్యాలు కల్పించడంతో పాటు కంపెనీ భవిష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 70,000 కేంద్రాలలో నెట్వర్క్ వ్యవస్థను విస్తరించనున్నారు.