
ముంబై : బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల నిశ్చితార్థపు ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రేపు(శనివారం) సౌత్ ముంబైలోని అంటిలియాలో ఉన్న అంబానీ 27 అంతస్తుల భవనంలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ నిశ్చితార్థానికి ముందస్తుగా జరుగుతున్న వేడుకలకు ఫిల్మ్ ఇండస్ట్రికి చెందిన షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్‌లు హాజరయ్యారు.షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్‌తో ఈ పార్టీకి హాజరు కాగ, సచిన్ తన సతీమణి అంజలితో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు.
అంతేకాక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న ప్రియాంక చోప్రా, తన బాయ్‌ఫ్రెండ్ అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ఈ ప్రీ-ఎంగేజ్‌మెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు. బుధవారం అంబానీ హౌజ్‌లో జరిగిన మెహందీ వేడుకతో ఈ ప్రీ-ఎంగేజ్‌మెంట్ పార్టీలు ప్రారంభయ్యాయి. ఆకాశ్, శ్లోకాలకు అంబానీ గారాల పట్టి, ఆ ఇంటి ఆడబిడ్డ ఇషా అంబానీ హారతి పడుతున్న వీడియోను సైతం ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అంతేకాక కొడుకు నిశ్చితార్థపు సంబురాల్లో నీతా డ్యాన్సులతో అలరించారు. ఆకాశ్ అంబానీ కూడా తన కాబోయే భార్య శ్లోకాతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









Comments
Please login to add a commentAdd a comment