దేశీ ఈ-కామర్స్ మార్కెట్లోకి అలీబాబా!
న్యూఢిల్లీ: చైనా దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అలీ బాబా ఈ ఏడాది భారత ఈ-కామర్స్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన అవకాశాల కోసం అన్వేషిస్తోంది. భారత ఈ-కామర్స్ రంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అలీబాబా గ్రూప్ ప్రెసిడెంట్ జె మైకేల్ ఇవాన్స్ తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అలీబాబా గ్రూప్ గ్లోబల్ మేనేజింగ్ డెరైక్టర్ కే గురు గౌరప్పన్‌తో కలిసి మైకేల్ శుక్రవారం ఇక్కడ టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు. అలీబాబా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించి, దేశీ ఈ-కామర్స్ రంగంలో తనదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నట్లు ప్రసాద్ తెలి పారు. కాగా అలీబాబా ఇక్కడ పేటీఎం, స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టింది.