రిలయన్స్‌కు 4జీ లెసైన్స్ వివాదం..
తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జేఐఎల్)కు 4జీ లెసైన్స్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ... దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పీఐఎల్)పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసుకుంది. ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని సీపీఐఎల్ అనే ఒక ప్రభుత్వేతర స్వచ్చంధ సంస్థ(ఎన్‌జీఓ) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది.
అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అటు కేంద్రానికి, ఇటు ఎన్‌జీఓలకు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ, మైగ్రేషన్ విధానాలపై పలు ప్రశ్నలు సంధించింది.
వాదనల తీరిది...: ఎన్‌జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ వ్యవస్థకు స్పెక్ట్రమ్... డేటాకు సంబంధించినదేతప్ప, వాయిస్ కాలింగ్‌కు కాదన్న కాగ్ ముసాయిదా నివేదిక ఆధారంగా పిల్‌ను దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీగా రిలయన్స్ కేవలం 1% చెల్లిస్తే... మిగిలిన కంపెనీలు అత్యధికంగా 5% వరకూ చెల్లించిన విషయాన్ని ఆయన ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
20 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌కు బిడ్ దాఖలు చేసిన ఇన్‌ఫోటెల్‌ను ‘బినామీ’ కంపెనీగా పేర్కొన్న న్యాయవాది, బిడ్‌ను (రూ.12,000 కోట్లు) గెలుచుకున్న కొద్ది గంటల్లోనే కంపెనీని రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. అయితే రిలయన్స్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, కాగ్ నివేదిక సరికాదని అన్నారు. స్పెక్ట్రమ్‌కు సంబంధించి ఒక సమగ్ర మైగ్రేషన్ విధానం ఉందని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు.