గ్లోబల్ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సారధ్యంలోని అమెజాన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టాప్ ప్లేస్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్‌ను వెనక్కి నెట్టి సోమవారం ఈ ఘనతను సాధించింది.
జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ రిటైల్ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి, ఈ భూమిపై అత్యంత విలువైన సంస్థగా మారింది. మంగళవారం గ్లోబల్ మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ షేరు మరో 10శాతం ఎగిసి, అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 810 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 57 లక్షల కోట్లు) గా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అమెజాన్ నిలిచింది. ఇది సమీప కంపెనీ మైక్రోసాఫ్ట్ సంపద 790 బిలియన్ డాలర్లతో పోలిస్తే 20 బిలియన్ డాలర్లు ఎక్కువ.
మరోవైపు చైనా దెబ్బతో యాపిల్ మరింత పడిపోయింది. ఒకపుడు1.1 ట్రిలియన్ డాలర్లు అధిగమించిన యాపిల్ మార్కెట్ క్యాప్, ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి 35 శాతానికి పైగా దిగజారింది. యాపిల్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ 710 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. 750 బిలయన్ డాలర్లతో గూగుల్ ( మాతృసంస్థ ఆల్ఫాబెట్ ) మూడవ స్థానంలో ఉంది.
జెఫ్ బెజోస్ నేతృత్వంలో అమెజాన్ రిటైల్ రంగంలో, ఆన్ లైన్ సేవలతో దూసుకుపోతోంది. 2013లో అమెజాన్ రెవిన్యూ 74.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2018 చివరి నాటికి కంపెనీ ఆదాయం 177.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అది 232.2 బిలియన్ డాలర్లుకు పెరగవచ్చని గ్లోబల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment