
భారత్‌లో అమెజాన్ సొంత స్టోర్లు..!!
⇒ ఫుడ్ ఔట్‌లెట్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు
⇒ అమెరికా తర్వాత భారత్‌లోనే ఏర్పాటు
⇒ ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంపై కన్ను
మనకు త్వరలో అమెజాన్ స్టోర్లు దర్శనమివ్వనున్నాయి. గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’.. భారత్‌లో సొంత స్టోర్లను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది ఇప్పటికే ఫుడ్ ఓన్లీ ఔట్‌లెట్స్ ఏర్పాటు సహా దేశీయంగా తయారుచేసిన ఆహార ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అమెజాన్ స్థానికంగా తయారైనా లేదా ఉత్పత్తి చేసిన ఫుడ్ ప్రొడక్టులను దేశవ్యాప్తంగా ఏ విధానంలోనైనా (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) కస్టమర్లకు విక్రయించాలని భావిస్తోంది. అంటే సంస్థ ఫుడ్ ప్రొడక్టుల రిటైల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్ తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అమెరికాలో ఏర్పాటు చేసింది.
కొత్త వెంచర్ ఏర్పాటు!
ఫుడ్ ప్రొడక్టుల రిటైల్ వ్యాపారం కోసం అమెజాన్ భారత్‌లో కొత్త వెంచర్‌ను (అనుబంధ సంస్థ) ఏర్పాటు చేయనుంది. ఇందులో సింగపూర్‌కు చెందిన అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్ కంపెనీకి 99 శాతం వాటా ఉండనుంది. ఇక మిగిలినది అమెజాన్.కామ్‌కు (మారిషస్) సంబంధించినది. కంపెనీ ఈ వెంచర్ ద్వారా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇది స్థానికంగా తయారుచేసి, ప్యాక్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్‌లను థర్డ్ పార్టీ లేదా సొంత ప్రైవేట్ లేబుల్స్ ద్వారా మార్కెట్‌లో విక్రయించనుంది. వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభిస్తే ఫుడ్ సప్లై చైన్‌లో మధ్యవర్థుల అవసరం లేకపోవడం, వ్యర్థాలు తగ్గుదల వంటి పలు అంశాల కారణంగా రైతులకు రాబడి పెరిగే అవకాశముంది.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా స్టోర్ల ఏర్పాటు
ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అమెజాన్ తొలిగా కొన్ని కాన్సెప్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా స్థానికంగా తయారు చేసిన ఫుడ్ ప్రొడక్టులను విక్రయించాలని భావిస్తోంది. ‘మేం ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి అనుమతి కోరాం. లక్ష్యాల కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. తొలిగా కొన్ని కాన్సెప్ట్ స్టోర్లను ఏర్పాటు చేసి, ప్రొడక్టులను విక్రయిస్తాం’ అని ఎ.టి.కార్నే పార్ట్‌నర్ అభిషేక్ మల్హోత్రా తెలిపారు. ఎంపిక చేసిన ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్స్, మాల్స్‌లో స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో పటిష్టమైన ఫుడ్ సప్లై చైన్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ వంటి అంశాలు తమకు ప్రోత్సాహకంగా ఉన్నాయని అమెజాన్ ఇండియా పేర్కొంది.
కేంద్రానికి కొంత ఊరట
అమెజాన్ దరఖాస్తు కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చింది. గ్లోబల్ రిటైలర్లు, తయారీదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం చాలానే ప్రయత్నించింది. గతేడాది ప్రభుత్వ ఉన్నతాధికారులు రిటైల్ ఫుడ్ విభాగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం వాల్‌మార్ట్, నెస్లె, హింజ్, థాయ్‌లాండ్‌కు చెందిన సీపీ ఫుడ్స్ వంటి పలు కంపెనీల ప్రతినిధులను దేశానికి ఆహ్వానించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ నేతృత్వంలో ఒక అధికారుల బృందం లండన్‌కు వెళ్లి, అక్కడ టెస్కో, సైన్స్‌బరీ, హరోడ్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్, కోబ్ర బీర్ వంటి పలు బ్రిటిష్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన ప్రభుత్వానికి గతేడాది చివరిలో దేశీ గ్రాసరీ డెలివరీ కంపెనీలైన బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ నుంచి దరఖాస్తులు అందాయి.
కాగా తాజాగా అంతర్జాతీయ కంపెనీ అయిన అమెజాన్ నుంచి తొలి దరఖాస్తు వచ్చింది. ఆహార ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయం నుంచి ప్యాకేజింగ్ వరకు గిడ్డంగుల ఏర్పాటు, పంపిణీ సౌకర్యాలు సహా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అమెజాన్.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)కి తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఫుడ్ రిటైల్ విభాగంలో 100 శాతం ఎఫ్‌డీలకు అనుమతినిచ్చింది. దీంతో గ్లోబల్ కంపెనీలు ఇక్కడ పూర్తిస్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.
2015లోనే రిటైలోకి అడుగు..
అమెజాన్ కంపెనీ 2015 నవంబర్‌లోనే రిటైల్ స్టోర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇది తొలిగా సీటెల్‌లో బుక్‌స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని తర్వాత పోర్ట్‌లాండ్, శాన్ డియాగో ప్రాంతాల్లో కూడా ఔట్‌లెట్స్‌ను ప్రారంభించింది. ఇది తన తొమ్మిదవ బుక్‌స్టోర్‌ను ఈ ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేయనుంది. అలాగే ఇది తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ‘అమెజాన్ గో’ పేరుతో సీటెల్‌లోనే ఏర్పాటు చేసింది. దీని సేవలు ఈ ఏడాది నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నవి. కాగా 2016లో కంపెనీ నికర అమ్మకాలు 27 శాతం వృద్ధితో 136 బిలియన్ డాలర్లకి ఎగశాయి.