ముంబై: అంబుజా సిమెంట్స్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) జనవరి–మార్చి క్వార్టర్‌లో 30 శాతం వృద్ధితో రూ.514 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించినట్లు కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అజయ్ కపూర్ చెప్పారు.
గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.397 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్ దిగ్గజం లఫార్జే హోల్సిమ్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి– డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,608 కోట్ల నుంచి 1 శాతం తగ్గి రూ.6,546 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6,099 కోట్ల నుంచి 5% తగ్గి రూ.5,790 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా 29 శాతం ఎగసింది.
6.22 మి. టన్నుల సిమెంట్ అమ్మకాలు...
స్టాండ్ అలోన్ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం జనవరి– మార్చి క్వార్టర్‌లో రూ.247 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 20 శాతం వృద్ధితో రూ.272 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.2,530 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.2,763 కోట్లకు చేరాయి. ప్రీమియమ్ బ్రాండ్లు– కాంపోసెమ్, రూఫ్ స్పెషల్ అమ్మకాలు బాగుండటం, రియలైజేషన్లు మెరుగుపడటం వంటి కారణాల వల్ల నికర అమ్మకాలు 9 శాతం పెరిగాయి. సిమెంట్ అమ్మకాలు 6.02 మిలియన్ టన్నుల నుంచి 6.22 మిలియన్ టన్నులకు పెరిగాయి.
బీఎస్‌ఈలో అంబుజా సిమెంట్స్ షేర్ 1.4 శాతం నష్టంతో రూ.237 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment