న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్ సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12.73 శాతం వృద్ధితో రూ.396 కోట్లు, ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.6,097 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.351 కోట్లు, ఆదాయం రూ.5,451 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా 12 శాతం పెరిగి రూ.5,540 కోట్లకు చేరాయి. జనవరి–డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా అంబుజా సిమెంట్స్ పాటిస్తోంది. రిటైల్ వినియోగదారులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, కీలక మార్కెట్లపై దృష్టి పెట్టడం ద్వారా నికర విక్రయాల్లో 10.4 శాతం వృద్ధిని నమోదు చేశామని అంబుజా సిమెంట్ ఎండీ, సీఈవో అజయ్‌కపూర్ తెలిపారు.
ఇంధన ధరల పెరుగుదల, రూపాయి అస్థిరతల ప్రభావాన్ని వ్యయాల నియంత్రణతో అధిగమించినట్టు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 5.46 మిలియన్ టన్నుల సిమెంట్‌ను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.02 మిలియన్ టన్నులుగా ఉంది. జీడీపీ వృద్ధిపై దృష్టి పెట్టడం, ప్రభుత్వం చేపట్టిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, అందరికీ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల కార్యక్రమాలతో సిమెంట్‌కు మంచి డిమాండ్ నెలకొందని కపూర్ చెప్పారు. ఇది కొనసాగుతుందని, ముందు ముందు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment