న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక కాలంలో 77 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 271 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌కు రూ.478 కోట్లకు పెరిగిందని అంబుజా సిమెంట్స్ తెలిపింది. స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం, లఫార్జే హోల్సిమ్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ కంపెనీ జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది.
క్లింకర్ ఉత్పత్తి పెరగడం, అమ్మకాలు వృద్ధి చెందడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సంస్థ ఎండీ, సీఈఓ అజయ్ కపూర్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.5,646 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.6,265 కోట్లకు ఎగసింది. అమ్మకాలు 50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 17 శాతం వృద్ధితో 58.7 లక్షల మెట్రిక్ టన్నులకు ఎగిశాయి.
ఇబిటా 62 శాతం వృద్ధితో రూ.541 కోట్లకు పెరగ్గా, ఇబిటా మార్జిన్ 4.8 శాతం వృద్ధితో 19.9 శాతానికి చేరింది. మొత్తం వ్యయాలు రూ.5,310 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.5,541 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కో షేర్‌కు రూ. 2 తుది డివిడెండ్(వంద శాతం) ఇవ్వనున్నట్లు కంపెనీ తెలియజేసింది. గతంలో ఇచ్చిన రూ.1.60 మధ్యంతర డివిడెండ్‌తో కలుపుకొని మొత్తం డివిడెండ్ రూ.3.60కు పెరిగింది.
‘సిమెంట్’ భవిష్యత్తు సానుకూలమే...
ప్రీమియమ్ ఉత్పత్తులు, కీలకమైన మార్కెట్లు, వ్యయాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించామని, ఫలితంగా అమ్మకాలు పెరిగాయని, ఇబిటా కూడా పెరిగిందని అజయ్ కపూర్ పేర్కొన్నారు. మౌలిక రంగం అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు పెరగడం, అందుబాటు ధరల గృహాలపై ప్రభుత్వం దృష్టి సారించడం సిమెంట్ రంగానికి ప్రయోజనం కలిగిస్తాయని వివరించారు.
లఫార్జేహోల్సిమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, రోలాండ్ కోహ్లర్‌ను అంబుజా సిమెంట్ అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో అంబుజా సిమెంట్స్ షేర్ 2 శాతం లాభంతో రూ.263 వద్ద ముగిసింది.
అంచనాలను మించిన ఫలితాలు..!
అమ్మకాలు అంచనాలను మించడం, వ్యయ నియం త్రణ పద్ధతులు, ప్రీమియమ్ ఉత్పత్తుల వాటా పెరగడం వల్ల ఈ క్యూ3లో అంబుజా సిమెంట్స్ మంచి పనితీరు కనబరిచిందని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. డిమాండ్ పుంజుకుంటోందని, ఈ కంపెనీ బ్రాండ్ ఈక్విటీ పటిష్టంగా ఉందని, ప్రీమియమ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, విలువ ఆధారంగా ధరల నిర్ణయం కలసివస్తోందని, మొత్తం మీద భవిష్యత్తులో ఈ కంపెనీ మంచి వృద్ధినే సాధించగలదని ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment