క్విప్ ద్వారా రూ.1,000 కోట్లు: ఆంధ్రాబ్యాంకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్ మెంట్ (క్విప్) ద్వారా డిసెంబరు నాటికి రూ.800–1,000 కోట్లు సమీకరించాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా ప్రస్తుతమున్న 61.26 శాతం నుంచి 60 శాతం దిగువకు చేరుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మూలధనం కింద రూ.1,100 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధుల రాకతో బ్యాంకులో ప్రభుత్వ వాటా పెరిగింది.
జీవిత బీమాలో సంయుక్త భాగస్వామ్య (జేవీ) కంపెనీ అయిన ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ ప్రతిపాదన ఏదీ లేదని బ్యాంకు అధికారి ఒకరు స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో ఈ కంపెనీ విలువ మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జేవీ ద్వారా డివిడెండు పెద్దగా స్వీకరించనప్పటికీ లాభాలు వస్తున్నాయని గుర్తుచేశారు. జేవీలో ఆంధ్రాబ్యాంకుకు 30 శాతం వాటా, బ్యాంక్ ఆఫ్ బరోడా 44 శాతం, యూకేకు చెందిన లీగల్ అండ్ జెనరల్‌కు 26 శాతం వాటా ఉంది.