
పన్ను పరిధిలోకి మరో కోటి మంది!
పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకొచ్చేందుకు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
♦ ఈ ఏడాది ఐటీ శాఖ లక్ష్యమిది...
♦ ఏపీ, తెలంగాణల్లో 7.93 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు..!
న్యూఢిల్లీ : పన్నుల పరిధిలోకి మరింతమందిని తీసుకొచ్చేందుకు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2015-16)లోనే కొత్తగా కోటి మంది పన్ను చెల్లింపుదారులను జతచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పన్నుల పరి ధిని విస్తృతం చేయాలని.. లక్ష్యాన్ని ఈ ఏడాదే సాకారం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంతో ఐటీ శాఖ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి రంగంలోకి దిగాలని, తగిన వ్యూహాలతో ముందుకెళ్లాలని ఐటీ అధికారులకు సీబీడీటీ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ప్రధానంగా వ్యాపార సంఘాలు, వృత్తినిపుణులకు సంబంధించిన అసోసియేషన్లతో సమావేశాల నిర్వహణతో పాటు రిటర్నులు దాఖలు చేయని అసెస్సీల సమాచారాన్ని సేకరించే పనిని వేగవంతం చేయాలని కూడా సూచించింది.
ప్రాంతాలవారీగా కూడా...: సీబీడీటీ ప్రాంతాలవారీగా ఎంతమంది కొత్త అసెస్సీ(పన్ను చెల్లింపుదారులు)లను చేర్చాలనే లక్ష్యాలను కూడా ఐటీ అధికారులకు నిర్దేశించింది. అత్యధికంగా పుణె రీజియన్‌లో 10.14 లక్షల కొత్త అసెస్సీలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 10.14 లక్షల లక్ష్యంతో మహారాష్ట్ర ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా (వాయువ్య భారత్) రాష్ట్రాల్లో 9.30 లక్షల మందిని లక్ష్యంగా నిర్దేశించారు.
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా ఈ ఏడాది 7.93 లక్షల మంది కొత్త అసెస్సీలను జతచేయాలనేది సీబీడీటీ సంకల్పం. వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే భారీగా కొత్త అసెస్సీలను చేర్చే వ్యూహాన్ని సీబీడీటీ మొదలుపెట్టింది. అయితే, అధికారులకు క్షేత్రస్థాయిలో తగిన ఫలితాలు రాకపోవడంతో పాటు.. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 8 నెలల గడువు ఉండటంతో లక్ష్యాన్ని కోటికి పరిమితం చేశారు.