
యాపిల్ నుంచి ఇక ఐ కార్?
ఐఫోన్, ఐ పాడ్ లాంటి ఉత్పత్తులతో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాశిస్తున్న ఆపిల్ కంపెనీ ఆటోమొబైల్ రంగంలోకి కూడా అడుగు పెడుతుందా? అదే నిజమైతే మార్కెట్లోకి ఎలాంటి కార్లను తీసుకొస్తుంది? అన్న అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాటరీతో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకరావడానికి పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసిందని, ఇలాంటి కార్ల అభివృద్ధికి ప్రస్తుతం ఓ రహస్యమైన ప్రదేశంలో ‘టైటాన్’ ప్రాజెక్టు పేరిట గోప్యంగా పరిశోధనలు నిర్వహిస్తోందని, ఈ ప్రాజెక్టులో ఇప్పటికే వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కంపెనీ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. ఆపిల్ క్యూపర్టినో క్యాంపస్‌లో కాకుండా సిలికాన్ వ్యాలీలోనే మరోచోట ఐ కార్లపై పరిశోధనలు సాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
ఇప్పటికే ఎలక్ట్రానిక్ కార్ల ఉత్పత్తులతో సంచలనం సృష్టిస్తున్న అమెరికా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ టెస్లా మోటార్స్‌కు పోటీగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పతి చేయడమే లక్ష్యం కావచ్చని, అందుకే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్ట్రీట్ వ్యూ స్టిల్ కెమేరాలను అమర్చిన ఆపిల్ కారు గతవారం కాలిఫోర్నియా వీధుల్లో కనిపించినప్పటి నుంచి ఐకార్‌పై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఆపిల్ డిజైనర్ సర్ జొనాధన్ స్వయంగా ఐకార్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారని, ఐకార్లే మార్కెట్‌లోకి వస్తే అవి ఆటోమొబైల్ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
అయితే సెల్ఫ్ డ్రైవింగ్ లాంటి ఆత్యాధునిక కార్లపై ప్రయోగాలు నిర్వహించాలంటే ముందుగా ప్రభుత్వం అనుమతి అవసరమని, ఇప్పటి వరకు కేవలం ఆరు ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే అలాంటి అనుమతులు తీసుకున్నాయని ఆటోమొబైల్ నిపుణులు తెలియజేస్తున్నారు. పైగా ఇటీవల కాలిఫోర్నియాలో కనిపించిన ఆపిల్ కారుకు నలువైపులా దృశ్యాలను తీసే ఆధునిక కెమేరాలు ఏకంగా 12 ఉన్నాయని, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు అన్ని కెమెరాలు అవసరం లేదని వారంటున్నారు. ఎర్త్ మ్యాపింగ్‌లో గూగుల్‌తో పోటీ పడేందుకు ఆపిల్ ప్రయోగాలు నిర్వహిస్తుండవచ్చని వారు చెబుతున్నారు.