ఆపిల్ డివైస్ ఇక వాటర్‌ప్రూఫ్..!
తొలిసారిగా పేటెంటెడ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇతర కంపెనీలకు భిన్నంగా వాటర్‌ప్రూఫ్ మోడల్స్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఇందుకోసం ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోఫోబిక్ కోటింగ్‌ను వినియోగిస్తోంది. ఆపిల్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంటు కోసం యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసింది కూడా. లోపలి ప్రధాన విడిభాగాలన్నింటిపైనా ఈ రసాయనం పూత పూస్తారు.
నీళ్లు లోపలికి పోయినా ఫోన్‌కు ఏ సమస్యా రాదు. అలాగే విడిభాగాలు అనుసంధానించే చోట షార్ట్ సర్క్యూట్ కాకుండా సిలికోన్ సీల్‌ను వినియోగిస్తారు.
మరో విషయమేమంటే ఈ టెక్నాలజీని ఏ ఉపకరణం కోసం వాడుతున్నారో ఆపిల్ స్పష్టం చేయనప్పటికీ.. భవిష్యత్తులో రాబోయే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్స్ వాటర్ ప్రూఫ్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు మొబైల్ ఫోన్ కంపెనీలు విక్రయిస్తున్న వాటర్ ప్రూఫ్ మోడల్స్ నీటిని లోపలికి వెళ్లనీయని రీతిలో డిజైన్ చేసి ఉంటాయి. సాధారణ మోడళ్లతో పోలిస్తే ఇవి కొంచెం మందంగా ఉంటాయి.