అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నగదు నిల్వలు యేటికేటికి పెరుగుతున్నాయట. 2007లో 74,200కోట్ల డాలర్లగా ఉన్న నగదు నిల్వలు, 2015కు రెండింతలు పెరిగి, 168లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. వీటిలో 72శాతం విదేశాల్లో ఉన్న నిల్వలేనని మూడీస్ తెలిపింది. ఈ నగదు నిల్వల్లో టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, సిస్కో, ఒరాకిల్ అగ్రస్థానంలో నిలిచాయని మూడీస్ ఇన్వెస్టర్ల సర్వీస్ నివేదించింది. మొత్తం నగదు నిల్వల్లో 30శాతం టాప్-5 టెక్ కంపెనీలే కలిగిఉన్నాయని పేర్కొంది.
అమెరికాల్లో ఉన్న పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి, విదేశాల్లోనే తమ రాబడులను పెంచుకోవాలని ఈ కార్పొరేషన్లు నిర్ణయించుకున్నాయని మూడీస్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఆ కంపెనీల నగదు నిల్వల్ని పెరిగాయని మూడీస్ పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో పన్నుల భారం 40శాతం అధికంగా ఉంటోంది. పన్నుచట్టాల్లో మార్పులు తీసుకు రానంత వరకూ.. విదేశాల్లోనే ఈ కార్పొరేట్ కంపెనీల నిల్వలు ఇలానే భారీగా పెరుగుతుంటాయని మూడీస్ నివేదించింది. సొంతదేశానికి ఆ నగదును తరలించాలంటే పన్ను చట్టాల్లో మార్పురావల్సిందేనని పేర్కొంది. టెక్ దిగ్గజం యాపిల్ కు 2010 వరకూ ఉన్న 3100కోట్ల డాలర్ల విదేశీ నిల్వలు, ఒక్కసారిగా 20,000కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పింది.