సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ ప్రొడక్టులు | Apple unveils own chip to Mac book desktops | Sakshi
Sakshi News home page

సరికొత్త ఫీచర్లతో యాపిల్‌ ప్రొడక్టులు

Published Tue, Jun 23 2020 11:22 AM | Last Updated on Tue, Jun 23 2020 2:51 PM

Apple unveils own chip to Mac book desktops - Sakshi

గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ సొంత చిప్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై యాపిల్‌ తయారీ మాక్‌ కంప్యూటర్లు సొంత చిప్‌తో వెలువడనున్నట్లు తెలియజేసింది. తద్వారా 15 ఏళ్లుగా ఆధారపడుతున్న ఇంటెల్‌ కార్ప్‌నకు యాపిల్‌ టాటా చెప్పనుంది. యాపిల్‌ తయారీ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు ఇకపై సొంత చిప్‌తో రూపొందనున్నట్లు కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ తాజాగా పేర్కొన్నారు. వెరసి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలోని క్యుపర్టినోగల కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచవ్యాప్త డెవలపర్‌ వార్షిక సమావేశం తొలి రోజు కుక్‌ మరిన్ని వివరాలు వెల్లడించారు.

ఐఓఎస్‌ 14
తమ హార్డ్‌వేర్‌ ప్రొడక్టులకు సిలికాన్‌ హృదయంవంటిదని, ప్రపంచస్థాయి డిజైన్‌ టీమ్‌ ద్వారా సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు కుక్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ తయారీ ఐఫోన్లు, ఐప్యాడ్లలో యాపిల్‌ అభివృద్ధి చేసిన చిప్‌లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. యాప్‌ స్టోర్‌ ద్వారా అందిస్తున్న సేవలు ఇటీవల కంపెనీ ఆదాయంలో ప్రధాన వాటా సాధిస్తున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. కారు తాళాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు డిజిటల్‌ షేరింగ్‌ చేసేందుకు వీలుగా యాపిల్‌ కొత్త వ్యవస్థను రూపొందించింది. ఐమెసేజ్‌ వ్యవస్థ ద్వారా బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ వాహనాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు యాపిల్‌ పేర్కొంది. ప్రస్తుతం అందిస్తున్న ఐఓఎస్‌ 13 ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాదిలో మరిన్ని కార్లకు ఈ సదుపాయాన్ని విస్తరించే వీలున్నట్లు వివరించింది.

నచ్చిన సైజులో విడ్జెట్స్‌
యాపిల్‌ కొత్త ఐవోఎస్‌ 14ను ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా విడ్జెట్స్‌ను విభిన్న పరిమాణంలో నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. అంతేకాకుండా పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తద్వారా వీడియోను మినిమైజ్‌ చేసుకుని స్క్రీన్‌లో ఏదో ఒక కార్నర్‌లో సెట్‌ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఐఫోన్లలో ఇన్‌కమింగ్‌ ‍కాల్స్‌ తెరనంతటినీ ఆవరించకుండా పైభాగానికి కుదించుకోవచ్చు. ఇక ఐప్యాడ్స్‌, ఐఫోన్ల వినియోగంలో డివైస్‌ల మధ్య ఐపోడ్స్‌ ఆటోమేటిగ్గా కనెక్ట్‌(స్విచ్‌ బ్యాక్‌) అవుతాయి. ఇక యాపిల్‌ వాచీలకు ఓఎస్‌-7ను అభివృద్ధి చేసింది. స్లీప్‌ ట్రాకింగ్‌ను ప్రధానంగా కంపెనీ ప్రస్తావిస్తోంది. వినియోగదారుడు నిద్రకు ఉపక్రమించగానే ఆటోమ్యాటిగ్గా స్లీప్‌ మోడ్‌లోకి మారుతుందని యాపిల్‌ తెలియజేసింది. ఇంకా యాపిల్‌ టీవీలకు వీడియో కెమెరాల ద్వారా డోర్‌బెల్‌ నోటిఫికేషన్స్‌ తదితర సౌకర్యాలను మెరుగుపరచినట్లు వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement