
ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా జైట్లీ
న్యూఢిల్లీ: ఆసియాలో ఉత్తమ ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ఎంపికయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ మేగజైన్.. ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ జైట్లీని ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, ఆసియా’గా ఎంపికచేసినట్లు తెలిపింది. గడచిన 18 నెలలుగా భారత్ ఆర్థిక వ్యవస్థ సాధించిన పురోగతి క్రెడిట్ ప్రధాని నరేంద్రమోదీకి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌రాజన్‌కు దక్కుతుందని, ఇందులో ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీకి భాగం ఉందనీ ఆ మేగజైన్ వ్యాసంలో పేర్కొంది.
ఆసియా ప్రాంతానికి సంబంధించి ‘ఎమర్జింగ్ మార్కెట్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ గత ఏడాది రఘురామ్ రాజన్‌కు లభించిన సంగతి తెలిసిందే. 2010లో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ జర్నల్ ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, ఆసియా’గా ఎంపికచేసింది.