అశోక్ లేలాండ్ లాభం రెండు రెట్లు
ఆదాయం 10 శాతం అప్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.144 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.291 కోట్లకు పెరిగిందని అశోక్ లేలాండ్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.3,775 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.4,176 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో వాహన పరిశ్రమ 15 శాతం వృద్ధిని సాధిస్తే తాము మాత్రం 19 శాతం వృద్ధిని సాధించామని అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు.
‘‘కరెన్సీ, వడ్డీరేట్ల స్వాప్ సంబంధిత లాభాలు రూ.18 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెరిగాయి. మేం వాహనాలు ఎగుమతి చేస్తున్న కీలక మార్కెట్లలో అమ్మకాలు తగ్గాయి. కానీ రెండో క్వార్టర్ నుంచి పుంజుకుంటామనే నమ్మకం ఉంది. దేశీయం గా 22,061 యూనిట్ల మధ్య, భారీ తరహా వాణిజ్య వాహనాను విక్రయించాం. కంపెనీ చరిత్రలో ఈ విభాగంలో ఇవే రికార్డ్ స్థాయి అమ్మకాలు’’ అని వివరించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థల నుం చి 3,600 బస్సులకు ఆర్డర్లు పొందామని, వీటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారాయన. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అశోక్ లేలాం డ్ షేర్ 3.6% లాభపడి రూ.97 వద్ద ముగిసింది.