కొత్త సీఈవో వేట మొదలైంది
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ నాన్ -ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన నందన్ నీలేకని వేట మొదలు పెట్టారు. ఇన్ఫో లో పరిస్థితులు చక్కదిద్దడంతోపాటు సీఈవో ఎంపిక తన ప్రధాన కర్తవ్యమని ప్రకటించిన నీలేకని ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ దిగ్గజాల పేర్లను ఇన్ఫీ సీఈవో పదవికి పరిశీలిస్తున్నారు.
ఇన్ఫీ సీనియర్లు ఇన్ఫీ హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ హెడ్ మొహిత్ జోషి, డిప్యూటీ సీవోవో రవికుమార్, ప్రస్తుత తాత్కాలిక సీఈవో ప్రవీణ్ రావు ఈ పదవికోసం పోటీపడుతుండగా ప్రధానంగా ఈ రేసులో జిరాక్స్ బీపీవో బిజినెస్ సీఈవోగా ఉన్న అశోక్ వేమూరిముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బీజీ శ్రీనివాస్ కూడా ఈ పోటీలోఉన్నారు. 2013 దాకా దాదాపు 14 ఏళ్లపాటు ఇన్పోసిస్‌కు సేవలందించారు శ్రీనివాస్. ప్రస్తుతం ఈయన పీసీసీ డబ్ల్యుకి ఎండీ గాఉన్నారు. దీంతోపాటు బోర్డులో కీలకమార్పులు చోటు చేసుకోనున్నాయి.
మరోవైపు క్రైసిస్‌లో పడిపోయిన ఇన్ఫోసిస్ ను ఆదుకునేందుకు పీస్ మేకర్ గా నందన్ నీలేకని పునరాగమనం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. అలాగే సంస్థ స్థిరత్వం, కంపెనీ ప్రాభవాన్ని, చరిత్రను నిలుపుతానని హామీ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్లో ఇన్ఫోసిస్ 5శాతానికి పైగా లాభపడి షేర్ ఆఫ్ డేగా నిలిచింది.
కాగా సీఎండీ పదవికి విశాల్ సిక్కా రాజీనామా తరువాత ఇన్ఫోసిస్ సంక్షోభంలో పడింది. దీంతో స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. వేలకోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, సంస్థ మార్కెట్ క్యాపిటల్ భారీగా క్షిణించిన సంగతి తెలిసిందే.