ఎన్నిఅవరోధాలు, అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పం,అచంచలమైన అంకితభావం ఉన్నవారు విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా చిన్న ఉద్యోగంచేస్తూనే అతి పెద్ద లక్ష్యంపై గురిపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. తాజాగా దాదాసాహెబ్ భగత్ విజయ గాథ దీనికి ఉదాహరణ.గతంలో ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్‌లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు. షెడ్ నుండి "మేడ్-ఇన్-ఇండియా" కాన్వా దాకా తన టాలెంట్‌తో రెండు కంపెనీలకూ సీఈఓ అయిన భగత్ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.
దాదాసాహెబ్ భగత్ ఎవరు?
మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. భగత్ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుండి పూణేకు వచ్చారు. ITI డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు 9వేల రూపాయల ఉద్యోగంలో చేరారు. కానీ దాన్ని వదిలేసి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. (R Thyagarajan Life Story: సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?)
ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ ,వాటర్ అందించడం భగత్ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్‌వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్ డిజైన్‌ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్‌లో చదువును కొనసాగించారు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు.
అనుకోని ప్రమాదం, మంచానికే పరిమితం
హైదరాబాద్‌లోని డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం దృష్టి పెట్టారు. ఈ డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు, భగత్ కారు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కుంగి పోలేదు. ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ స్టార్టప్‌ని ప్రారంభించారు. అలా 2015లో Ninthmotion ఆవిష్కృతమైంది. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ ఛానెల్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో సహాతన సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది క్లయింట్‌లను సాధించారు.
మలుపు తిప్పిన కోవిడ్-19
కాన్వా వంటి ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని భగత్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెండో బిజినెస్ డూగ్రాఫిక్స్ అవతరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ సాధారణడ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉంది. దీనిద్వారా యూజర్లు టెంప్లేట్‌లు, డిజైన్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అయితే COVID-19 సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా పూణేలో వ్యాపారాన్ని వదులుకుని, బీడ్‌లోని తన గ్రామానికి మకాం మార్చవలసి వచ్చింది.
ఇండియన్ 'కాన్వా' ప్రారంభం
తన గ్రామంలో మంచి మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి, భగత్ మంచి 4G నెట్‌వర్క్ రిసెప్షన్‌తో పశువుల కొట్టంలో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భగత్ స్వయంగా యానిమేషన్ అండ్ డిజైన్‌లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి, వారితో కలిసి ఆ షెడ్‌లోనే పని ప్రారంభించారు. అలా గ్రామం నుండి చాలా మందికి తక్షణమే వెంటనే డూగ్రాఫిక్స్ శిక్షణ ఇవ్వడం, కార్యకలాపాలు మొదలు కావడం జరిగిపోయింది.
కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించింది. వీరిలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరుతోపాటు, జపాన్, ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా ఉన్నారు. విశేష సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ "ఆత్మనిర్భర్ భారత్" విజన్‌కు మద్దతుగా డూ గ్రాఫిక్స్, పూర్తిగా భారతీయ నిర్మిత సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ పోర్టల్‌గా మార్చాలనేది భగత్ ఆశయం.
Comments
Please login to add a commentAdd a comment