
సెన్సెక్స్ సీఈవోల సగటు జీతం రూ. 10 కోట్లు
డోజోన్స్‌తో పోలిస్తే పదో వంతు మాత్రమే
దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే 30 దిగ్గజ కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే... బ్లూచిప్ కంపెనీ సీఈవోల సగటు జీతాలు పెరిగాయ్. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో సగటున (ప్రభుత్వ రంగ కంపెనీలు మినహా)ఇవి రూ. 9.9 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది(2012-13)లో సీఈవోల సగటు వేతనం 8.5 కోట్లుగా నమోదైంది. అయితే అమెరికా స్టాక్ సూచీ డోజోన్స్ ఇండస్ట్రియల్(డీజేఐఏ) సూచీకి ప్రాతినిధ్యం వహించే దిగ్గజాలతో పోలిస్తే ఇవి పదో వంతు మాత్రమేకావడం గమనార్హం.
గతేడాది యూఎస్ డోజోన్స్‌లో భాగమైన 30 కంపెనీల సీఈవోలకు సగటున ఒక్కొక్కరికీ 17.5 మిలియన్ డాలర్లు(రూ. 105 కోట్లు) జీతం లభించడం విశేషం! ఇక యూకే, జర్మనీ సీఈవోలు సైతం ఇండియాకంటే అధిక స్థాయిలో జీతాలు ఆర్జిస్తుండ టం ప్రస్తావించదగ్గ అంశం! యూకే, జర్మనీ బ్లూచిప్ కంపెనీల సీఈవోలకు సగటున రూ. 50-60 కోట్ల స్థాయిలో వేతనాలు అందుతున్నాయి.
అతి తక్కువ... ఎక్కువ: ఇన్ఫోసిస్ సీఈవో సిబూలాల్ జీతం అత్యంత తక్కువగా రూ. 16 లక్షలకు పరిమితంకాగా... హీరోమోటో కార్ప్ సీఈవో పవన్ ముంజాల్ అత్యధికంగా రూ. 38 కోట్లను అందుకున్నారు. ఇక అమెరికా దిగ్గజాలలో ఒరాకిల్ కార్ప్ సీఈవో లారీ ఇల్లిసన్ అత్యధికంగా 78.4 మిలియన్ డాలర్లు (రూ. 470 కోట్లు) జీతం ఆర్జించారు.