చేతక్‌ మళ్లీ వచ్చేసింది!! | Bajaj Chetak electric scooter launch | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 17 2019 4:02 AM | Last Updated on Thu, Oct 17 2019 5:09 AM

Bajaj Chetak electric scooter launch - Sakshi

చేతక్‌ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరిస్తున్న రవాణా శాఖ మంత్రి గడ్కరీ, రాజీవ్‌ బజాజ్‌

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్‌ ఆటో బుధవారం చేతక్‌ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే.. ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

95 కి.మీ. దాకా మైలేజీ..
అధికారికంగా చేతక్‌ ఈ–స్కూటర్‌ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్‌ ప్లాంటులో తయారు చేసే చేతక్‌ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

హమారా బజాజ్‌...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్‌ స్కూటర్‌ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది.  మహాయోధుడు రాణా ప్రతాప్‌ సింగ్‌కి చెందిన వేగవంతమైన అశ్వం ’చేతక్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు.. అప్పట్లోనే కోటి పైగా అమ్ముడయ్యాయి. బుక్‌ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్‌ లిస్టు ఉండేది. 2005 ప్రాంతంలో స్కూటర్స్‌ తయారీని బజాజ్‌ నిలిపివేసి పూర్తిగా మోటార్‌సైకిల్స్‌పై దృష్టిపెట్టింది.

ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌కు సబ్సిడీ..
ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీ అందుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు అంతకు ముందు మోటార్‌నుబట్టి ఈ సబ్సిడీ నిర్ణయించేవారు. ప్రస్తుతం టెక్నాలజీని బట్టి సబ్సిడీ ఇస్తున్నారు. ఒక కిలోవాట్‌ అవర్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉందని అవేరా న్యూ అండ్‌ రెనివేబుల్‌ ఎనర్జీ మోటోకార్ప్‌ టెక్‌ ఫౌండర్‌ వెంకట రమణ తెలిపారు. ఉదాహరణకు 3 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల వాహనం ఖరీదు రూ.80,000 ఉందనుకుందాం.

వినియోగదారు షోరూంలో రూ.50,000 చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీకి వాహనాల అమ్మకాల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం కింద నమోదయ్యే ఎలక్ట్రిక్‌ స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం తయారీదారు స్కూటర్‌ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్‌ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లపైగా వేగం, 250 వాట్స్‌ కంటే అధిక సామర్థ్యం ఉన్న మోటార్‌ ఉంటేనే స్కూటర్‌గా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement