E-scooter
-
బీఎండబ్ల్యూ మరో ఈ-స్కూటర్.. ప్రీలాంచ్ బుకింగ్స్ రేపే..
అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. -
ఈవీ రంగంలోకి ప్రముఖ ల్యాప్‌టాప్ కంపెనీ.. తొలి ఈ-స్కూటర్ విడుదల
తైవాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది, తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్‌గో. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఏసర్ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది. MUVI 125 4G ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లు గరిష్ట వేగం 75 kmph. ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ తేలికపాటి ఛాసిస్ 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్ డిజైన్ డబుల్ డిస్క్ బ్రేక్స్ MUVI 125 4G సాంకేతిక వివరాలను మాత్రం ఏసర్ వెల్లడించలేదు. అయితే, ఇది మార్చుకోదగిన (స్వాపింగ్) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్‌లు, డీలర్‌షిప్‌పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 🚨 Taiwanese laptop maker 'Acer' has entered into the electric scooter market in India by launching its e scooter at ₹99,999/- pic.twitter.com/Fa3sqEjOVr — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 -
Electric Scooter: బైక్ లాంటి స్కూటర్ భలే ఉందే.. లాంచ్ చేస్తున్న టీవీఎస్
భారత్‌కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్‌లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్‌కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది. తాజా టీజర్లో స్కూటర్‌పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్లో స్పీడోమీటర్ క్లైంబింగ్‌ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్‌తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా) కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్‌లైట్ కన్సోల్‌గా పనిచేసే నాలుగు ఎల్ఈడీ ల్యాంప్‌లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ-స్కూటర్లో బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్‌వాచ్-కనెక్ట్ కంట్రోల్‌లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్‌తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది. -
ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో ఆఫర్
Bajaj Chetak Electric Scooter Price Cut: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చిలో బజాజ్ ఆటో రెండు వేరియంట్లలో అప్డేట్ చేసిన 2023 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రకటించింది. తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. చేతక్ఈవీ ధరలను తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. బేస్ చేతక్ ధర రూ.1.22 లక్షలు కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.52 లక్షలు. అయితే ఇప్పుడు, బేస్ వేరియంట్ నిలిపి వేసింది. అలాగే ప్రీమియం వేరియంట్ ధర రూ. 22 వేల తగ్గింపును అందిస్తోంది. దీని ప్రకారం రూ. 1.3 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనే వివరాలు అందుబాటులో లేవు. (టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్) బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ ఫీచర్లు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్‌లెస్ DC మోటార్‌తో ఆధారితంగా 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీతో. ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని కేవలం ఒక గంటలో 25 శాతం ఛార్జ్ చేయవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్, ఆల్-కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్‌వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ,రియర్ డ్రమ్ బ్రేక్స్ లాంటివి ఉన్నాయి.2023 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీమియమ్ ఎడిషన్ వెర్షన్ మూడు రంగులలో లభిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) -
ప్యూర్ ఈవీ కొత్త ఈ-స్కూటర్:150 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కొత్త ఇ-స్కూటర్‌ను పరిచయం చేసింది. ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో పేరుతో టాప్ ఎండ్ మోడల్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. PURE EV ePluto 7G ప్రో రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా ప్రకటించింది. బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించగా, డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయి. (మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!) ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో : బ్యాటరీ, ఫీచర్లు ఏఐఎస్ 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్, 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులోజత చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపిక చేసిన మోడ్‌ను బట్టి ఒకే ఛార్జ్‌పై 100 -150 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని, మూడు రైడింగ్ మోడ్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రౌండ్ LED హెడ్‌ల్యాంప్ లాంటి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. మాట్ బ్లాక్, గ్రే , వైట్ మూడు కలర్ వేరియంట్లలో ఇది లభించనుంది. తమ బెస్ట్ సెల్లింగ్ 7జీ మోడల్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని, లాంగర్ రేంజ్ స్కూటర్లను కోరుకునే కస్టమర్ల లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్టు ప్యూర్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ రోహిత్ వదేరా లాంచింగ్ సందర్బంగా తెలిపారు. ప్రీ-లాంచ్ టైంలోనే 5వేల బుకింగ్‌లను అందుకున్నామంటూ సంతోషం ప్రకటించారు. తొలి నెలలో 2వేలకు పైగా బుకింగ్‌లను ఆశిస్తున్నామన్నారు. మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల వార్తలకోసం చదవండి ‘సాక్షి బిజినెస్’ మీకెలాంటి వార్తలు కావాలో కామెంట్ల ద్వారా తెలియజేయండి. -
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
క్వాంటమ్ ఎనర్జీ సరికొత్త ఈ-స్కూటర్, ధర తక్కువే.. 130 కి.మీ. రేంజ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ ‘క్వాంటమ్ బిజినెస్’ పేరుతో ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. వాణిజ్యపరమైన డెలివరీలకు ఈ వాహనం అనుకూలమని సంస్థ తెలిపింది. దీని ధర రూ.99,000 నుంచి ప్రారంభమవుతుంది. రుణ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తోపాటు పలు ఎన్బీఎఫ్సీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. 1,200 వాట్ మోటార్, గంటకు 55 కిలోమీటర్ల వేగం, ఒక్కసారి చార్జింగ్‌తో 130 కిలోమీటర్ల రేంజ్, రిమోట్ లాక్, అన్‌లాక్, యాంటీ థెఫ్ట్ అలారమ్, యూఎస్బీ చార్జర్, డిస్క్ బ్రేక్‌లు, ఎల్సీడీ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. మూడేళ్లు లేదా 99,000 కిలోమీటర్ల పాటు ఈ వాహనంపై సంస్థ వారంటీ ఆఫర్ చేస్తోంది. ఇందులో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉపయోగించారు. (గుడ్ న్యూస్: యథాతథంగా కీలక వడ్డీరేట్లు) -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!
ముంబై: ఎలక్ట్రిక్ బైక్ షేరింగ్ కంపెనీ యూలూ, ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జొమాటో డెలివరీ భాగస్వాములకు యూలూ 25–35 వేల యూనిట్ల డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దె ప్రాతిపదికన సరఫరా చేయనుంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కంపెనీ అందించే పరిష్కారాలతో డెలివరీ భాగస్వాముల ఆదాయం 40 శాతం వరకు అధికం అవుతుందని యూలూ తెలిపింది. ఫిబ్రవరి నాటికి జొమాటో వేదికగా 4,000 పైచిలుకు డెలివరీ పార్ట్నర్స్ యూలూ ఈవీలను వినియోగిస్తున్నారని వెల్లడించింది. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) -
దేశీయ మార్కెట్లో రెండు కొత్త ఈ-స్కూటర్లు: ప్రత్యేకంగా..!
బెంగళూరు: ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ యులు, దేశీయ ద్విచక్ర తయారీ దిగ్గజం బజాజ్ ఆటో రెండు ఈవీ స్కూటర్లను సోమవారం మార్కెట్లో లాంచ్ చేశాయి. దేశీయ వినియోగానికి అనుగుణంగా రోజువారీ వినియోగంతో పాటు డెలివరీ సేవల కోసం కూడా ఉపయోగపడేలా ఈ స్కూటర్లను రూపొందించామని కంపెనీలు వెల్లడించాయి. యులు,బజాజ్ ఆటో సంయుక్తంగా మిరాకిల్ జీఆర్, డీఎక్స్ జీఆర్ పేరుతో లాంచ్ చేశాయి. దేశీయ అవసరాలు, రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని లాంచ్ చేస్తున్నట్టు యూలు, బజాజ్ ఆటో ఒక ప్రకటనలో తెలిపాయి. మిరాకిల్ జీఆర్, డీఈఎక్స్ జీఆర్ ఈ-స్కూటర్లు స్వాపింగ్ బ్యాటరీలతో పని చేస్తాయి. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. అందిస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పామని, ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 100 వరకు స్టేషన్లను ఏర్పాటు చేశామని యులు తెలిపింది. 2024 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వాహన అవసరాలు, ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకుని బాజజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యులు సీఈవో అమిత్ గుప్తా చెప్పారు.గత మూడు నెలల్లో తమ వాహనాల సంఖ్యను రెట్టింపు చేశామనీ, దేశంలోని ప్రధాన నగరాల్లో లక్ష వాహనాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి పదిరెట్ల కంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని సాధించాలని యూలు లక్క్ష్యంగా పెట్టుకుంది. నెక్ట్స్‌జెన్ మేడ్-ఫర్ ఇండియా వాహనాలు అధునాతన డిజైన్లతో మొత్తం ఎలక్ట్రిక్ మొబిలిటీ కేటగిరీకి మైలురాయిగా నిలుస్తాయని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
Yamaha 2023 కొత్త స్కూటర్లు చూశారా...అదిరే లుక్స్‌లో వచ్చేశాయ్!
సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా కొత్త స్కూటర్లను అప్డేటెడ్గా తీసుకొచ్చింది. 125 సీసీ స్కూటర్ లైనప్‌ను 2023 వర్షెన్లను లాంచ్ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125, RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త కలర్ స్కీమ్‌లు, అప్డేటెడ్ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం. 2023 యమహా ఫాసినో 125 ఎక్స్‌షోరూం ధర రూ. 91,030గా ఉంది. రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రీడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 93,530గా ఉంది. ఫాసినో 125 డిస్క్ వేరియంట్, రేయ్ జెడ్ఆర్ 125 స్కూటర్లరు డార్క్ మ్యాట్ బ్లూ కలర్‌లోనూ, రేయ్ జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్‌కి కనెక్ట్ చేసింది. ఫ్యూయెల్ కన్జమ్షన్ ట్రాకర్, మెయిన్టేనెన్స్ రికమెండేషన్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, మాల్ఫంక్షన్ నోటిఫికేషన్, రివర్స్ డాష్‌బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఇంజీన్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్ 6,500 ఆర్పీఎం వద్ద 8.2 పీఎస్ పవర్‌ను, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హైబ్రీడ్ ఇంజిన్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టెమ్ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్ కంప్లైంట్ బీఎస్6, ఎయిర్- కూల్డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (ఎఫ్ఐ) కొత్త వెర్షన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. -
హైస్పీడ్ ఈ-స్కూటర్ ‘మిహోస్’ లాంచ్..ఫ్రీ బుకింగ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో మరో ఈ స్కూటర్ సందడి చేయనుంది. జాయ్ ఇ-బైక్ తయారీదారు వార్డ్ విజార్డ్ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. జనవరి 22 నుండి కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ నుండి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 600+ అధీకృత షోరూమ్‌ల నుండి మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. మిహోస్ డెలివరీలు మార్చి 2023లో దశలవారీగా ప్రారంభం మవుతాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా జాయ్ ఇ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియాలో మొదటి 5000 మంది కస్టమర్లకు) లాంచ్ చేసింది. స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ విభిన్న సెన్సార్ల కలయికతో వస్తుంది. అదనపు మన్నిక, సేఫ్టీకోసం పాలీడైసైక్లోపెంటాడిన్ (PDCPD)తో రూపొందించింది. 7 సెకన్లలోపు వ్యవధిలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah Li-Ion ఆధారిత బ్యాటరీ,యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, GPS సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు మిహోస్‌లో ఉన్నాయి.'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' ద్వారా స్కూటర్ని ట్రాక్ చేయవచ్చు , బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు. రివర్స్ మోడ్‌తో ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి స్కూటర్‌ను వెనుకకు తరలించడానికి అనుమతిస్తుంది. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెరల్ వైట్ ఇలా నాలుగు రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో తమకు అద్భుతమైన స్పందన లభించిందనీ, ముఖ్యంగా ఈ స్కూటర్ రెట్రో డిజైన్‌ను ప్రశంసించడమే కాకుండా అదనపు భద్రత కోసం ఉపయోగించిన పాలీ డైసైక్లోపెంటాడిన్ బాగా ఆకర్షించిందనీ వార్డ్‌విజార్డ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా తెలిపారు. వినియోగదారుల సానుకూల స్పందనతోనే ఆన్లైన్ బుకింగ్స్‌ను ఉచితంగా ప్రారంభించామన్నారు. టాప్ నాచ్టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో, కస్టమర్ల ఆకాంక్షల్ని తీర్చగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’
సాక్షి, అమరావతి: వాతావరణంలో కాలుష్యం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం పంపింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని అందులో పేర్కొంది. ఒక్కో కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. వారు కోరితే ఈ–వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది. అందరికీ అవకాశం.. వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి 24–60 నెలల్లో వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లుచేయనున్నారు. కనీసం నెలకు రూ.2,500 చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద ప్రభుత్వోద్యోగులకు రుణాలు అందించేందుకు ధనలక్ష్మి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో నెడ్కాప్ ఒప్పందం కుదుర్చుకుంది. వడ్డీరేటు 9 శాతం. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు ఆ సంస్థ సీఈఓగానీ లేదా మేనేజర్‌గానీ అధీకృత లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆసక్తిగల ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్ఆర్ఈడీసీఏపీ సూచించింది. అందుబాటులోకి చార్జింగ్ స్టేషన్లు ఈవీల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్‌క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 109 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి చోట్ల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాలను గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అయ్యే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది చివరికల్లా 300 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని నెడ్కాప్ సంకల్పించింది. నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కి.మీ.కు ఒకటి ఏర్పాటుచేయనుంది. -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. తొలుత నేపాల్‌లో ప్రవేశిస్తోంది. ఇందుకోసం సీజీ మోటార్స్‌తో పంపిణీ ఒప్పందం చేసుకుంది. వచ్చే త్రైమాసికం నుంచే ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. రెండవ దశలో లాటిన్ అమెరికా, ఆసియాన్, యూరోపియన్ యూ నియన్‌కు విస్తరించనున్నట్టు వెల్లడించింది. చదవండి : బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్ -
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ‘పొల్యూషన్’ జరిమానా.. నవ్వులపాలైన పోలీసులు
మలప్పురం: పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు కూడా అందిస్తున్నాయి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్ లేదని జరిమానా విధిస్తే?! కేరళ పోలీసులు ఇదే పనిచేసి నవ్వులపాలయ్యారు. మలప్పురం జిల్లాలో కరువరాకుండు పోలీసు స్టేషన్ పరిధిలోని నీలాంచెరీలో గతవారం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వస్తుండగా తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపేశారు. పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ చేతిలో పెట్టి, రూ.250 వసూలు చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల నిర్వాకంపై జోకులు పేలాయి. టైపింగ్ మిస్టేక్ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. స్కూటర్ యజమాని డ్రైవింగ్ లైసెన్స్ చూపించలేకపోయాడని చెప్పారు. మెషిన్లో తప్పుగా టైప్ చేయడంతో పీయూసీ సర్టిఫికెట్ లేదంటూ ప్రింటౌట్ వచ్చిందని అన్నారు. -
బైక్స్ కాదు...స్కూటర్లు దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతేడాది ఏప్రిల్-జూలైలో దేశవ్యాప్తంగా 9,77,986 స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో ఈ సంఖ్య ఏకంగా 16,87,062 యూనిట్లు నమోదైంది. అంటే 72.5 శాతం అధికం. మోటార్‌సైకిళ్ల వృద్ధి 27 శాతానికే పరిమితమైంది. భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తక్కువ బరువు, సులభంగా నడపడానికి వీలుండడం స్కూటర్ల ప్రత్యేకత. నగరాల్లో అయితే కిక్కిరిసిన ట్రాఫిక్‌లో గేర్‌లెస్ వాహనాలే నయం అన్న భావన ప్రజల్లో ఉంది. స్కూటర్ల డిజైన్, పనితీరు విషయంలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ల అమ్మకాలు క్రమంగా అధికం అవుతున్నాయి. జోరుగా వృద్ధి నమోదు.. కంపెనీనిబట్టి స్కూటర్ల అమ్మకాల్లో 15–437 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మోటార్‌సైకిళ్ల కంటే ఇదే అధికం. ఈ ఏడాది జూలైలో 49.79 శాతం వాటాతో స్కూటర్ల రంగంలో హోండా యాక్టివా రారాజుగా నిలిచింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ ఎంటట్రీ ఇచ్చిన బజాజ్ ఆటో 9,261 యూనిట్లతో ఏకంగా 437.49 శాతం వృద్ధిని సాధించింది. ఇక 2021తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో హోండా మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ ఇండియా 78.39 శాతం అధికంగా 8,12,086 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 108.14 శాతం వృద్ధితో 4,08,036 యూనిట్లు, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30.3 శాతం దూసుకెళ్లి 2,21,931 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 15.42 శాతం అధికమై 1,04,885 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 60.32 శాతం హెచ్చి 57,525 యూనిట్లను సాధించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం.. క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఈ–టూవీలర్ల వాటా ఈ ఏడాది జనవరిలో 2.7 శాతం. జూన్ నాటికి ఇది 3.8 శాతానికి ఎగసింది. అన్ని కంపెనీలవి కలిపి జనవరిలో 27,590 యూనిట్లు రోడ్డెక్కితే, జూన్ నాటికి ఈ సంఖ్య 42,262 యూనిట్లకు చేరింది. జనవరి-జూన్‌లో దేశవ్యాప్తంగా 2,40,662 ఈ-టూవీలర్లు విక్రయం అయ్యాయి. హీరో మోటోకార్ప్ పెట్టుబడి చేసిన ఏథర్ ఎనర్జీ 2022 ఏప్రిల్-జూలైలో 219.48 శాతం వృద్ధిని సాధించింది 13,265 యూనిట్లను విక్రయించింది. ఓకినావా ఆటోటెక్ 259 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఓకినావా నుంచి 47,121 యూనిట్లు, హీరో ఎలక్ట్రిక్ 44,084, ఓలా 41,994, యాంపీర్ ఎలక్ట్రిక్ 33,785, ఏథర్ 15,952, ప్యూర్ ఈవీ 9,531, టీవీఎస్ 8,670, రివోల్ట్ 8,462, బజాజ్ 7,394 యూనిట్లు రోడ్డెక్కాయి. జోరుగా ఈ-స్కూటర్ల విక్రయాలు మోటార్‌సైకిళ్లు ఇలా.. భారత్‌లో 2021 ఏప్రిల్-జూలైలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 25,77,474 యూనిట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో ఈ సంఖ్య 27.07 శాతం వృద్ధితో 32,75,256 యూనిట్లుగా ఉంది. ఈ కాలంలో మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో బజాజ్ 5.53 శాతం, సుజుకీ 5.69 శాతం తిరోగమన వృద్ధి చెందాయి. హీరో 29.31 శాతం, హోండా 55.56, టీవీఎస్ 13.58, యమహా 67.19, రాయల్ ఎన్ఫీల్డ్ 41.81 శాతం వృద్ధి నమోదు చేశాయి. కాగా, 2021-22లో భారత్‌లో 1,34,66,412 యూనిట్ల ద్విచక్ర వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2025 నాటికి టూవీలర్స్ పరిశ్రమ దేశంలో 2.49 కోట్ల యూనిట్లకు చేరుతుందని అంచనా. -
ఆ హై-స్పీడ్ ఈ-స్కూటర్లు వచ్చేశాయిగా.. ఫీచర్లు, ధర?
సాక్షి, ముంబై: ఈవీయం మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ ఈవీయం పేరుతో కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాస్మో, కామెట్ , జార్ అనే పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా( ఎక్స్-షోరూమ్) వరుసగా రూ. 1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, 2.16 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. వీటి బుకింగ్‌లు ఆగస్టు 8 నుంచి మొదలు కానున్నాయి. మూడు ఇ-స్కూటర్లు ఒకే 72V 31 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తితో పని చేస్తాయి. అయితే వీటి మైలేజీ, పరిధి, ఛార్జింగ్ టైం, ఎలక్ట్రిక్ మోటారు భిన్నంగా ఉంటాయి. కాస్మో, కామెట్ రెండూ 2000W ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చినప్పటికీ, టాప్-ఆఫ్-ది-లైన్ జార్ 4000W ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది. జార్, కామెట్ రెండూ ఒకే ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని, కాస్మో ఒకే ఛార్జ్‌తో 80 కి.మీ పరిధిని అందిస్తాయి. ఈ స్కూటర్లు స్పీడ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్స్) లభ్యం. కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లేటెస్ట్ LCD డిస్ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాఫికింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్, లొకేట్ మై వెహికల్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. కాస్మో అతి తక్కువ వేగాన్ని గంటకు 65 కి.మీ, కామెట్, జార్ రెండూ గంటకు 85 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. భారతీయ మార్కెట్లో తమ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ మూడు ఈ-స్కూటర్లు వినియోగదారుల మనసు దోచుకుంటాయని విశ్వసిస్తున్నామని కంపెనీ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. -
వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి రెండు నెలల్లో రూ. 500 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఏడాది చివరికల్లా బిలియన్ డాలర్ల(రూ. 7,800 కోట్లు) ఆదాయం అందుకోగల మని కంపెనీ భావి స్తోంది. అయితే తొలి రెండు నెలల్లో ఎన్ని వాహనా లు విక్రయించిందీ వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కస్టమర్ల విశ్వాసం పెరుగుతున్నదని, దీంతో భవిష్యత్‌లో మరింత పురోభివృద్ధిని సాధించగలదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజుకి 1,000 వాహనాలను తయారుచేయగల కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే భారీ ఆర్డర్లను పొందిందని, ఇకపై మరింత వేగాన్ని చూపే వీలున్నదని తెలియజేసింది. కాగా వాహన రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఓలా ఎస్1 ప్రో రిజిస్ట్రేషన్ 12,683 యూనిట్ల నుంచి 9,196 యూనిట్లకు క్షీణించాయి. ఇప్పటివరకూ కంపెనీ 50,000 స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఆగస్ట్‌లో కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో బ్రాండుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
Ola Future Factory: రెండు చక్రాలు.. 20 వేల చేతులు
అందరూ స్త్రీలే పని చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని ఓలా కార్యాచరణలో పెట్టింది. 10 వేల మంది మహిళా కార్మికులను భర్తీ చేయనుంది. ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు పని చేసేæఫ్యాక్టరీ, ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఇది ఒక్కటే. ‘పురుషులు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఓలా అంటోంది. ఇన్నాళ్లు ఫ్యాక్టరీలను పురుషులు నడిపారు. ఈ పర్యావరణ హిత స్కూటర్ ఫ్యాక్టరీని స్త్రీలు నడపనున్నారు. తమిళనాడు కృష్ణగిరిలో ఒక ఘనమైన మహిళా ఘట్టం మొదలైంది. అక్కడ స్థాపితమైన ‘ఓలా ఈ–స్కూటర్ ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళా కార్మికులతో, సిబ్బందితో పని చేయనుంది. మొత్తం 10 వేల మంది స్త్రీలు ఈ ఓలా ఫ్యాక్టరీలో పని చేయనున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఫ్యాక్టరీలో చేరింది. ఇంకో ఐదారు నెలల్లో మొత్తం మహిళా కార్మికులు చేరితే ఇదొక అద్భుతమైన స్త్రీ కార్మిక వికాస పరిణామం అవుతుంది. దీనికి అంకురార్పణ చేసిన ఓలా చరిత్ర లిఖించినట్టవుతుంది. ‘స్త్రీ బలపడితే సమాజం బలపడుతుంది’ ఓలా చైర్మన్– గ్రూప్ సి.ఇ.ఓ భవిష్ అగర్వాల్ సోమవారం ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ‘మా మొదటి బ్యాచ్ వచ్చింది. మిగిలిన వారు రావడమే తరువాయి’ అని ఆయన అన్నారు. ఈ–స్కూటర్ తయారు చేయనున్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలోని దాదాపు వందమంది తొలి మహిళా కార్మిక బ్యాచ్‌తో ఆయన సెల్ఫీ దిగారు. ‘స్త్రీలను ఆర్థికంగా బలపరిస్తే కుటుంబం బలపడుతుంది. దాంతో సమాజం బలపడుతుంది. మహిళా ఆర్థిక స్వావలంబనతో జి.డి.పి పెరుగుతుంది’ అని భవిష్ అన్నారు. ‘పారిశ్రామిక రంగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ శాతం పెంచాలంటే అందరం కలిసి స్త్రీలను అందుకు ప్రోత్సహించాలి. మా వంతుగా మేము ఓలా ఈ–స్కూటర్ ఫ్యాక్టరీని పూర్తిగా స్త్రీలతోనే నిర్వహించనున్నాం’ అని ఆయన అన్నారు. పర్యావరణానికి హాని చేసే పెట్రోల్ టూవీలర్లకు ప్రత్యామ్నాయంగా ఈ–స్కూటర్ల తయారీ దేశంలో ఊపందుకుంటోంది. ఓలా ఈ రంగంలో ప్రధాన వాటా పొందేందుకు భారీ స్థాయిలో ఫ్యూచర్ ఫ్యాక్టరీని కృష్ణగిరిలో స్థాపించింది. ఇది పూర్తి కావడానికి సుమారు 2500 కోట్లు అవుతాయని అంచనా. 2022లో మార్కెట్లోకి వచ్చే లక్ష్యంగా ఇది పని చేయనుంది. ‘సంవత్సరానికి కోటి ఈ–స్కూటర్లు లేదా ప్రపంచ మార్కెట్లో 22 శాతం ఈ–స్కూటర్లు తయారు చేయడం ఈ ఫ్యాక్టరీ లక్ష్యం’ అని భవిష్ తెలియచేశారు. ప్రతి రెండు సెకండ్లకు ఒక స్కూటర్ తయారయ్యే స్థాయిలో వేల మంది మహిళా సిబ్బంది ఇక్కడ పని చేస్తారు. వీరికి 3000 రోబోలు సహకరించనున్నాయి. ‘మేము మహిళలతో ఈ ఫ్యాక్టరీని నడిపేందుకు పూర్తిస్థాయి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అక్కడ శిక్షణ ముగించుకుని వచ్చి ఫ్యాక్టరీలో చేరుతారు’ అని భవిష్ చెప్పారు. ఇంతవరకూ అందరూ సైరన్ మోగుతుంటే డ్యూటీకి వెళ్లే పురుషులను చూశారు. మరి కొన్నాళ్లలో వేల మహిళలు ఈ ఫ్యాక్టరీలోకి వెళ్లే దృశ్యం కచ్చితంగా కోట్ల మంది స్త్రీలకు స్ఫూర్తిదాయకం కానుంది. -
సరుకు డెలివరీకి సరికొత్త ఇ-స్కూటర్
సాక్షి,న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీలో ఉన్న కబీరా మొబిలిటీ హెర్మ్స్-75 పేరుతో హైస్పీడ్ ఈ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. గోవా ఎక్స్‌షోరూంలో దీని ధర రూ.89,600. పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారాలను అందించే లక్ష్యం, సరుకు డెలివరీకి ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జ్ చేస్తే ఫిక్స్డ్ బ్యాటరీ అయితే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మార్చుకోవడానికి వీలుండే స్వాపేబుల్ బ్యాటరీతో 80 కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. కబీరా ఖాతాలో ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ బైక్స్, ఆరు స్కూటర్ మోడళ్లున్నాయి. Introducing Hermes 75, the Electric Bull. Starting at ₹89,600. Learn more at https://t.co/FmBFZmyszu #Hermes75 #KabiraMobility #KM #HelloEV pic.twitter.com/D2T036uvHw — KabiraMobility (@KabiraMobility) April 12, 2021 -
ఒకినావా ఆర్30 ఈ స్కూటర్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఒకినావా స్కూటర్స్ కొత్త ఇ- వాహనాన్ని లాంచ్ చేసింది. ఒకినావా ఆర్ 30 పేరుతో స్లో స్పీడ్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వయసుల వినియోగదారులతోపాటు ముఖ్యంగా తక్కువ వేగంగా పిల్లలకు బావుంటుందని, వారికి కొత్త ఎలక్ట్రిక్ వాహన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పిల్లలు, మహిళలు వారి రోజువారీ పనులైన షాపింగ్, ట్యూషన్లు, పాఠశాలలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని ఒకినావా పేర్కొంది. 250 వాట్ల వాటర్ రెసిస్టెంట్ మెటారు, 1.25 కిలోవాట్ల డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని జోడించింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 4-5 గంటలు పడుతుంది. స్కూటర్ ఆటో కట్‌తో మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. ఈ-స్కూటర్ పెర్ల్ వైట్, సీ గ్రీన్, సన్‌రైజ్ ఎల్లో, గ్లోసీ రెడ్, మెటాలిక్ ఆరెంజ్ 5 రంగులలో లభిస్తుంది. స్టైలిష్ ఫ్రంట్ హెడ్లైట్లు, రియర్ లైట్లు, స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఇతర ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఇది రూ. 58992 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. బ్యాటరీ , మోటారు రెండింటిపై 3 సంవత్సరాల వారంటీ అందిస్తోంది. -
ఆంపియర్ మాగ్నస్ ప్రో : కొత్త ఇ-స్కూటర్
సాక్షి, ముంబై: గ్రీవ్స్ కాటన్ కు చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సరికొత్త ఇ-స్కూటర్ లాంచ్ చేసింది. రూ .73,990 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద మాగ్నస్ ప్రో పేరుతో దీన్ని విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లో లభిస్తుందనీ, త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త ఇ-స్కూటర్‌ను కంపెనీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. యాంటీ-తెఫ్ట్ అలారం, డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, బ్రైట్ ఎల్ఇడి లైట్లు, ఎల్ఇడి డిఆర్ఎల్లు (పగటిపూట రన్నింగ్ లాంప్స్), టెలిస్కోపిక్ సస్పెన్షన్, 450 ఎంఎం లెగ్ స్పేస్, భారీ స్టోరేజ్ బూట్ స్పేస్ , ఛార్జీకి సగటున 75-80 కిలోమీటర్ల మైలేజీలాంటి మెయిన్ ఫీచర్లను ఇందులో జోడించింది. హై-స్పీడ్ ఇ-స్కూటర్ విభాగంలో మాగ్నస్ ప్రో సౌకర్యవంతమైన, భద్రతా లక్షణాలతో సౌలభ్యంగా లిష్ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని ఆంపియర్ ఎలక్ట్రిక్ సీవోవో సంజీవ్ చెప్పారు. కోవిడ్-19 తరువాత వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త మాగ్నస్ ఇ-స్కూటర్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ సీఎండీ నాగేష్ బసవన హళ్లి వ్యాఖ్యానించారు. The new Magnus Pro has arrived! The electric scooter that will redefine the way you rode the conventional scooter. Book yours today at Rs. 2999* and live magnified: https://t.co/WUWwrizy6n #AmpereElectric #AmpUpYourLife #GoElectric #EVRevolution #launch #productlaunch pic.twitter.com/Vgc0JaRnpx — Ampere Electric Vehicles (@ampere_ev) June 15, 2020 -
ఈ–స్కూటర్‌తో డేటా హ్యాక్!
హూస్టన్: ఎలక్ట్రానిక్–స్కూటర్లను హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశోధన ద్వారా వెల్లడించారు. ఇందులో భారతీయ నిపుణులు పాల్గొన్నారు. వాహనదారుల గోప్యతకు సంబంధించిన వివరాలను ఈ–స్కూటర్ల ద్వారా హ్యాక్ చేయొచ్చని వీరు చెబుతున్నారు. ఈ–స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసినపుడు.. రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. దీంతో ఆ వాహనం ప్రయాణించే ప్రాంతం, ఎంత దూరం తిరిగింది వంటి వివరాలు ఫోను, వాహనాల్లో నిక్షిప్తం అవుతాయి. ఇదే హ్యాకర్లకు అవకాశం కల్పిస్తోందని వారు తెలిపారు. ఈ వివరాల ద్వారా వాహనదారులు తరచుగా తిరిగే మార్గాలను, వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఉండే లొకేషన్ వంటి వివరాలను హ్యాకర్లు తెలుసుకుంటారని చెప్పారు. సైబర్ సెక్యూరిటీని పటిష్టంగా ఉండేలా మోటారు వాహనాల కంపెనీలు తమ వాహనాలను తయారు చేయాలని వారు సూచించారు. -
కొత్త చేతక్.. చూపు తిప్పుకోలేం!
న్యూఢిల్లీ: చేతక్ స్కూటర్‌ను బజాజ్ ఆటో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేటి అవసరాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా దీన్ని రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా సరికొత్త రూపంతో ఎలక్ట్రిక్ వాహనంగా చేతక్ వినియోగదారులకు ముందుకు రానుంది. జనవరిలో ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో అమ్మకాలు ప్రారంభిస్తారు. కొత్త చేతక్ స్కూటర్‌కు సంబంధించిన 5 ఆసక్తికర అంశాలు మీకోసం. 1. ఎలక్ట్రిక్ వాహనంగా తయారైన కొత్త చేతక్‌లో 4కేవీ ఎలక్ట్రిక్ మోటర్తో పాటు ఐపీ67 రేటింగ్ లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. 2. ఎలక్ట్రిక్ వాహనాల గురించి కొనేటప్పుడు రేంజ్ (మైలేజీ) గురించి అడుగుతారు. చేతక్ ఎకానమీ మోడ్‌లో 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిలోమీటర్ల రేంజ్ వరకు నడుస్తుంది. 3. లోహపు బ్యాడీతో ఆకర్షణీయంగా ముస్తాబైన బజాబ్ చేతక్ ఆరు రంగుల్లో లభ్యమవుతుంది. డిజిటల్ కన్సోల్, గుర్రపునాడ ఆకారంలో డీఆర్ఎల్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ బ్లింకర్స్ ఉన్నాయి. 4. వేగాన్ని సులువుగా నియంత్రించేలా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉంది. 12 అంగులాల చక్రాలు అమర్చారు. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ ఉంది. అయితే బజాజ్ బ్యాడ్జ్(లోగో) మాత్రం లేదు. 5. కొత్త చేతక్ ధర రూ. 90 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. (చదవండి: చేతక్ మళ్లీ వచ్చేసింది!!) -
చేతక్ మళ్లీ వచ్చేసింది!!
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్ చేతక్ స్కూటర్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్ ఆటో బుధవారం చేతక్ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 95 కి.మీ. దాకా మైలేజీ.. అధికారికంగా చేతక్ ఈ–స్కూటర్ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్ డీలర్షిప్స్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్ బజాజ్ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్ ప్లాంటులో తయారు చేసే చేతక్ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. హమారా బజాజ్...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్ స్కూటర్ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది. మహాయోధుడు రాణా ప్రతాప్ సింగ్‌కి చెందిన వేగవంతమైన అశ్వం ’చేతక్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు.. అప్పట్లోనే కోటి పైగా అమ్ముడయ్యాయి. బుక్ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టు ఉండేది. 2005 ప్రాంతంలో స్కూటర్స్ తయారీని బజాజ్ నిలిపివేసి పూర్తిగా మోటార్‌సైకిల్స్‌పై దృష్టిపెట్టింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు సబ్సిడీ.. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీ అందుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు అంతకు ముందు మోటార్‌నుబట్టి ఈ సబ్సిడీ నిర్ణయించేవారు. ప్రస్తుతం టెక్నాలజీని బట్టి సబ్సిడీ ఇస్తున్నారు. ఒక కిలోవాట్ అవర్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉందని అవేరా న్యూ అండ్ రెనివేబుల్ ఎనర్జీ మోటోకార్ప్ టెక్ ఫౌండర్ వెంకట రమణ తెలిపారు. ఉదాహరణకు 3 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల వాహనం ఖరీదు రూ.80,000 ఉందనుకుందాం. వినియోగదారు షోరూంలో రూ.50,000 చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి వాహనాల అమ్మకాల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం కింద నమోదయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం తయారీదారు స్కూటర్ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లపైగా వేగం, 250 వాట్స్ కంటే అధిక సామర్థ్యం ఉన్న మోటార్ ఉంటేనే స్కూటర్‌గా పరిగణిస్తారు. -
త్వరలో ‘నిర్భయ’ స్కూటర్
ముంబై: ముంబై: మరో రెండు నెలల్లో నిర్భయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. మహిళల భద్రత కోసం ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్(జీపీఆర్ఎస్ ఎనేబుల్ ట్రాకింగ్ సిస్టమ్) ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత. మొబైల్ ఫోన్ల ద్వారా ఈ స్కూటర్‌ను ఒక యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చని మోరెల్లో యమసకి సీఈఓ రజిత్ ఆర్. ఆర్య పేర్కొన్నారు. ఈ స్కూటర్‌కు ఉన్న ఒక బటన్‌ను నొక్కితే, సదరు స్కూటర్ ఎక్కడ ఉన్నదన్న సమాచారాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలుస్తుందని, ప్రతీ 2/3 నిమిషాలకు ఈ సమాచారం ట్రాన్స్మిట్ అవుతుందని వివరించారు. ఈ స్కూటర్ ధర రూ.35,000 ఉండొచ్చని, మహిళా కొనుగోలుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వాలని యోచిస్తున్నామని వివరించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 25 కిమీ. అని, దీనికి డ్రైవింగ్ లెసైన్స్ అవసరం లేదని వివరించారు. త్వరలో హైస్పీడ్ స్కూటర్లు ఈ తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మరో రెండు నెలల్లో మార్కెట్లోకి తెస్తామని రజిత్ ఆర్. ఆర్య వెల్లడించారు. ముంబైకు చెందిన ఆర్య గ్రూప్, జపాన్‌కు చెందిన యమసకి మోటార్స్ కలసి మోరెల్లో యమసకి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. తక్కువ వేగంతో నడిచే మూడు స్కూటర్లను ప్రస్తుతం ఈ కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో హై-స్పీడ్ స్కూటర్లనందిస్తామని ఆర్య వివరించారు.