
బ్యాలన్స్‌డ్ ఫండ్సే ఎందుకు?
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు ప్లాన్‌లు ఉన్నాయని,
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు ప్లాన్‌లు ఉన్నాయని, డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు? అసలు ఈ రెండు ప్లాన్‌ల మధ్య ఏం తేడాలున్నాయి?
– మధుకర్, విజయవాడ
మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్‌లు దాదాపు రెండూ ఒకే విధంగా ఉంటాయి. వ్యయాల్లో తేడాఉంటుంది. డైరెక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్‌లకు సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎలాంటి కమీషన్‌ను, లేదా డిస్ట్రిబ్యూటర్ ఫీజును చెల్లించదు. డైరెక్ట్ ప్లాన్‌లలో మీరు నేరుగా(డైరెక్ట్‌గా) మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. డైరెక్ట్ ప్లాన్‌లలో బ్రోకరు, మధ్యవర్తి, ఏజంట్‌ల ప్రమేయం ఉండదు. అందుకని ఈక్విటీ ఫండ్స్‌కు సంబంధించిన డైరెక్ట్ ప్లాన్‌ల వార్షిక వ్యయాలు, రెగ్యులర్ ప్లాన్ కన్నా కనీసం 1% తక్కువ. డూ–ఇట్–యువర్ సెల్ఫ్ తరహా లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై కొంచెం అవగాహన ఉన్నవారికి ఇవి అనువుగా ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజంట్ సేవలు తీసుకోవడం మంచిది. అందుకని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం రెగ్యులర్ ప్లాన్‌లనే ఎంచుకోండి. కొంత కాలం గడిచిన తర్వాత, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి కొంత అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
నేను మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం రెండు, మూడు విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకున్నాను. అయితే ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్, సంబంధిత బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా తెరవాలని అంటున్నాయి. ఇలా ప్రతి బ్యాంక్‌లో ఖాతా తెరవడం తప్పనిసరా?
–జాన్సన్, విశాఖపట్టణం
ఈ విషయంలో మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సంబంధిత మ్యూచువల్ ఫండ్ అనుబంధ బ్యాంకుల్లో ఖాతాలు తెరవవలసిన అవసరం లేదు. వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరవవలసిన పనిలేదు. కేవలం ఒక్క బ్యాంక్ ఖాతా ద్వారానే మీరు ఏ మ్యూచువల్ ఫండ్‌లోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి ఆ సామ్ములను పొందవచ్చు. ఎన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఒక బ్యాంక్ ఖాతా సరిపోతుంది.
తొలిసారి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని మీరు సూచిస్తుంటారు కదా! వీటినే ఎందుకు ఎంచుకోవాలి? కొన్ని మంచి బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను సూచించండి.
–ప్రవల్లిక, హైదరాబాద్
మార్కెట్లు చక్రీయంగా ఉంటాయి. అంటే ఒక్కోసారి గరిష్ట స్థాయిలో, మరో సారి కనిష్ట స్థాయిలో, హెచ్చుతగ్గులకు, ఒడిదుడుకులకు గురవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ జోరుగా ఉంది. దీని ఆధారంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులు పొందాలనుకోవడం సరైన వ్యూహం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన కొంత కాలానికి మార్కెట్ పడిపోయిందనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ కరిగిపోతుంది. బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. బ్యాలన్స్‌డ్ ఫండ్స్ తమ నిధుల్లో 25 శాతం వరకూ స్థిర ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫలితంగా ఈ ఫండ్స్‌కు కొంత స్థిరత్వం వస్తుంది. అంతేకాకుండా బ్యాలన్స్‌డ్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక ఏడాది దాటితే వాటిపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మరో వైపు బ్యాలన్స్‌డ్ ఫండ్‌కు సంబంధించిన ఫండ్ మేనేజర్, తన ఫండ్ పోర్ట్‌ఫోలియోను తరచుగా రీబ్యాలన్స్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పుడు ఇది మంచి వ్యూహం. బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచి పద్ధతి. ఇక ఇన్వెస్ట్ చేయడానికి టాటా, ఐసీఐసీఐ రిలయన్స్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
నా వయస్సు 30 సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై కొంత అవగాహన ఉంది. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ రకమైన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో సూచించండి?
–వినయ్, కరీంనగర్
పన్ను ఆదా చేయాల్సిన అవసరం ఉంటే పన్ను ఆదా చేసే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ తరహా ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీకు పన్ను ఆదా చేయాల్సిన అవసరాలు లేకపోతే, బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన మీకు ఉన్నట్లయితే, పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేకపోతే ఒకటి లేదా రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మీ ఆదాయం పెరిగితే తదనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా పెంచండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను కనీసం ఆరు నెలలకొకసారైనా పరిశీలించి, తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి.