
బాండ్లలో పెట్టుబడులు సురక్షితమా?
ప్ర: నేను, నా భార్య ఇద్దరమూ వివిధ వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్నాం. మాకు ఒక పాప, ఒక బాబు. ఇద్దరూ మైనర్లే. వారి పేర్ల మీదుగా కూడా ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) ఖాతాలు తెరవాలనుకుంటున్నాము. మేము గరిష్టంగా ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు నిర్వహించవచ్చు? అన్ని పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి ఎంత మొత్తానికి పన్ను రాయితీలు పొందవచ్చు? –కేశవరావు, విజయవాడ
మీరు, మీ భార్య, చెరో పీపీఎఫ్ ఖాతా నిర్వహించవచ్చు. ఒక్కో ఖాతాకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ట పెట్టుబడి రూ.500, గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలు. తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు తమ మైనర్ పిల్లలకు సంరక్షకులుగా మరో పీపీఎఫ్ ఖాతా తెరవవచ్చు. అయితే ప్రతి బిడ్డ తరపున భార్యభర్తల్లో ఎవరో ఒకరు మాత్రమే పీపీఎఫ్ ఖాతా తెరవాలి. అయితే ఒక్క వ్యక్తి, తన తరపున, తన పిల్లల తరపున ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పీపీఎఫ్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
ప్ర: బాండ్ల బుడగ పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నదా? స్వల్పకాలిక బాండ్ ఫండ్స్ కంటే గిల్ట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితంగా ఉంటాయా? – అను జైన్, సికింద్రాబాద్
ఈక్విటీ మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. మార్కెట్ శిఖర స్థాయికి పెరగవచ్చు లేదా పాతాళ స్థాయికి పడిపోవచ్చు. కానీ ఈ తరహా తీవ్రమైన ఒడిదుడుకులు స్థిర ఆదాయ సాధనాలైన బాండ్లలో ఉండవు. బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే కొన్ని ప్రయోజనాలుంటాయి. బాండ్లు ఎవరు జారీ చేస్తున్నారో మనకు ముందే తెలుస్తుంది. దీంతో బాండ్ జారీ చేసే సంస్థ సమర్థత మనం తెలుసుకోవచ్చు. బాండ్ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? వచ్చే రాబడి(కూపన్ రేట్) ఎంత ? తదితర వివరాలు మనకు ముందే తెలుస్తాయి. దీర్ఘకాలంలో చూస్తే, బాండ్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు.
కానీ స్వల్పకాలంలో వడ్డీరేట్లు తగ్గితే ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయి. బాండ్ల బుడగ పగిలిపోవడమనేది ఆర్‌బీఐ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీరేట్లలో మార్పులు కారణంగా తలెత్తే ఒడిదుడుకులు పెద్దగా ప్రభావం చూపవనే చెప్పవచ్చు. ఇక భద్రత విషయానికొస్తే, స్వల్పకాలిక బాండ్ ఫండ్స్‌కు, గిల్ట్ ఫండ్స్‌కు పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక గిల్ట్ ఫండ్స్, స్వల్పకాలిక బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులే పొందవచ్చు.
ప్ర: మ్యూచువల్ ఫండ్స్‌కు స్టాప్ లాస్, లాభాల స్వీకరణ వంటి స్టాక్ మార్కెట్ సంబంధిత అంశాలు వర్తిస్తాయా ? –రాకేశ్, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్స్‌కు స్టాప్ లాస్, లాభాల స్వీకరణ వంటి అంశాలు వర్తించవు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ నష్టాలు వచ్చి, ఇన్వెస్ట్‌చేసిన మొత్తం తగ్గుతుందనే భయం మీకు ఉంటే, బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మ్యూచువల్ ఫండ్స్‌ను చూడకూడదు. స్టాక్ మార్కెట్లోని షేర్ల మాదిరి మ్యూచువల్ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ ఇన్వెస్టరైనా ఏడాదికాలంలో తరచుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ట్రేడ్ చేయలేడు. ఎగ్జిట్ లోడ్, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను తదితర వ్యయాలు, చార్జీలు ఉంటాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే లాభాల స్వీకరణ, స్టాప్‌లాస్ వంటి స్టాక్ మార్కెట్ అంశాలు మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించవనే చెప్పాలి.
ప్ర: నాకు, నా భార్యకు కలిపి జాయింట్‌గా ఒక సేవింగ్స్ ఖాతా ఉంది. ఈ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ఐటీ రిటర్నుల్లో చూపాల్సి ఉంటుందా? –కపిల్, వరంగల్
సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్నుల్లో చూపాల్సి ఉంటుంది. మీరు, మీ భార్య కలసి జాయింట్‌గా సేవింగ్స్ ఖాతాను నిర్వహిస్తున్నారు కదా ! మీ భార్యకు సంపాదన లేని పక్షంలో ఈ సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్‌పై వచ్చే వడ్డీని మీ ఐటీ రిటర్నుల్లో మీ మొత్తం ఆదాయానికి కలిపి చూపాలి. ఒక వేళ మీ భార్య ఉద్యోగం చేయడమో, వ్యాపారం ద్వారా సంపాదించడమో చేస్తున్నట్లయితే, మీలో ఎవరి ఐటీ రిటర్నుల్లో అయినా ఈ ఆదాయాన్ని చూపించవచ్చు. మీ మీ పన్ను బాధ్యతలను బట్టి మీ ఐటీ రిటర్నులో కానీ, మీ భార్య ఐటీ రిటర్నులో గానీ ఈ వడ్డీ ఆదాయాన్ని చూపించాలి.
సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వచ్చే వడ్డీని–ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అనే పద్దుకింద చూపించాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తాల్లో ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 టీటీఏ ప్రకారం రూ.10,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి మించిన వడ్డీ ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. మీ సర్టిఫికెట్‌ను మీ వద్దే భద్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ ట్యాక్స్ స్క్రూటినీ సందర్భంలో అసెస్సింగ్ ఆఫీసర్ ఈ సర్టిఫికెట్‌ను ప్రస్తావించినప్పుడు ఈ సర్టిఫికెట్‌ను చూపిస్తే సరిపోతోంది. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్