విలేకరుల సమావేశంలో అవతార్ మోంగా, అమిత్ కుమార్ (పర్సనల్ బ్యాంకింగ్ హెడ్) (ఎడమ నుంచి కుడికి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు విత్ డ్రా చేసుకోవాలంటే ఏటీఎంకో లేక బ్యాంక్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్.. మీ దగ్గర్లోని ఐడీఎఫ్‌సీ బ్యాంకు మైక్రో ఏటీఎం సెంటర్‌కెళితే చాలు. డెబిట్, క్రెడిట్ కార్డులేమీ అవసరం లేకుండా కేవలం వేలిముద్ర ఆధారంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు... జమ చేయొచ్చు కూడా. అంతేకాదు వివిధ బ్యాంకులతో ఉన్న ఒప్పందం ఆధారంగా తమ కస్టమర్ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నెలకు ఎన్నిసార్లయినా నగదు ఉపసంహరించుకోవచ్చని, దీనికి పరిమితులేవీ లేవని కూడా ఐడీఎఫ్‌సీ బ్యాంకు స్పష్టంచేసింది. కనీస నగదు నిల్వల వంటి షరతులు కూడా లేవు. పైపెచ్చు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారైనా ఈ మైక్రో ఏటీఎం ద్వారా లావాదేవీలు జరుపుకొనే వీలుంది. బుధవారమిక్కడ హైదరాబాద్‌లో తొలి ఐడీఎఫ్‌సీ బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అవతార్ మోంగా... సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
మైక్రో ఏటీఎంలపై ఫోకస్ పెడుతున్నామన్నారు కదా? అసలేంటివి? ఎలా పనిచేస్తాయి?
మైక్రో ఏటీఎం అంటే టెక్నాలజీ నిండిన ఒక ట్యాబ్లెట్ మాత్రమే. రేషన్ షాపులు, పెట్రోల్ బంకులు, కిరాణా, కూరగాయల దుకాణాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఆ డివైజ్‌పై కస్టమరు వేలి ముద్ర వేయగానే... తన బ్యాంక్ ఖాతా వివరాలొచ్చేస్తాయి. దీంతో ఒక ఖాతా నుంచి ఇంకో ఖాతాకు నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కావాలంటే సంబంధిత పాయింట్ ఆఫ్ సేల్ నిర్వాహకుడి నుంచి నగదును తీసుకోవచ్చు. తన దగ్గరే జమ చేయొచ్చు కూడా. అది అప్పటికప్పుడు మీ ఖాతాలోకి కూడా చేరిపోతుంది. దీనికి ఎలాంటి నిర్వహణ చార్జీలుండవు. నగదు లావాదేవీలే కాదు... వాహన, గృహ, వ్యక్తిగత, రిటైల్, వ్యాపార రుణాలు, బీమా పథకాలు, వినియోగ బిల్లుల చెల్లింపుల వంటి సేవలన్నో దీని ద్వారా పొందొచ్చు. డెబిట్ కార్డుపై రూ.25 లక్షల ప్రమాద బీమా కవరేజీ కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ ఆధారంగా గ్రామీణులకు బ్యాంక్ సేవలందించడమే ఈ మైక్రో ఏటీఎంల ఉద్దేశం.
మరి ఈ మైక్రో ఏటీఎంలను ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు?
ఎవరైనా ముందుకు రావచ్చు. వారికి మా బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఇస్తాం. దాని ద్వారానే వారు తమ చుట్టుపక్కలి వారికి సేవలందిస్తారు. దీనిపై వారికి కమీషన్ కూడా వస్తుంది. గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఇది అదనపు ఆదాయంగా ఉంటుంది. స్థానికంగా చక్కని సంబంధాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్నాం.
తెలంగాణలో ఇది తొలి బ్రాంచి కదా.. మరి కొత్త బ్రాంచీలకు సంబంధించి లక్ష్యాలేమైనా ఉన్నాయా?
2014 ఆగస్టులో ఐడీఎఫ్‌సీకి బ్యాంకు లైసెన్స్ వచ్చింది. ప్రస్తుతం 25 రాష్ట్రాల్లోని 670 ప్రాంతాల్లో 45 వేల గ్రామాల్లో సేవలందిస్తున్నాం. దేశంలో 13 వేల మైక్రో ఏటీఎంలు, 3,423 ఆధార్ పే కేంద్రాలు, 135 బ్రాంచీలు ఉన్నాయి. వీటిలో 100 బ్రాంచీలు గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు మాకు 24 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 15 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 767 మైక్రో ఏటీఎంలు, 182 ఆధార్ పే కేంద్రాలున్నాయి. ఇక్కడ నెలకు 1.5 లక్షల లావాదేవీలు ఆధార్ పే ద్వారా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 200 బ్రాంచీలు, వచ్చే ఏడాది మార్చి నాటికి 30 వేల మైక్రో ఏటీఎంల ఏర్పాటు లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగిసేనాటికి హైదరాబాద్‌లో మరో 4 బ్రాంచీలతో పాటూ బెంగళూరులో 8, చెన్నైలో 5 శాఖలను ప్రారంభిస్తాం.
ఐడీఎఫ్‌సీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉందా?
గతేడాది డిసెంబర్ నాటికి స్థూల రిటైల్, కార్పొరేట్ ఆస్తులు రూ.67,488 కోట్లుగా, నికర లాభం రూ.146.1 కోట్లుగా ఉంది. ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. గతేడాది డిసెంబర్ నాటికి 8,668 మంది ఉద్యోగులున్నారు.
తెలంగాణలో ప్రత్యేకమైన సేవలందించే యోచనేమైనా ఉందా?
పెన్షన్లు, ఎల్పీజీ వంటి ఇతరత్రా సబ్సిడీలు, స్కాలర్‌షిప్స్, పౌర సరఫరాలు వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) కోసం ఏపీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది ఆధార్ అనుసంధానిత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా పనిచేస్తుంది. ఈ సేవలను ప్రయోగాత్మకంగా తెలంగాణ సిద్ధిపేటలోని పలు రేషన్ షాపుల్లోనూ నిర్వహిస్తున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో అధికారికంగా అందుబాటులోకి తెస్తాం. తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లోనూ ప్రారంభిస్తాం. విద్యుత్, మున్సిపల్ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లోనూ ఐడీఎఫ్‌సీ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కోసం ఆయా విభాగాలతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.
2 నెలల్లో క్యాపిటల్ ఫస్ట్ విలీనం పూర్తి
విలీనం తర్వాత మిశ్రమ సంస్థ నిర్వహణ ఆస్తుల విలువ రూ.88 వేల కోట్లు ఐడీఎఫ్‌సీతో క్యాపిటల్ ఫస్ట్ హోమ్ ఫైనాన్స్ విలీన ప్రక్రియకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) బుధవారం అనుమతినిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉందని.. మరో 2 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఐడీఎఫ్‌సీ ఈడీ అవతార్ మోంగా విలేకరులతో చెప్పారు. విలీనం తర్వాత మిశ్రమ సంస్థ నిర్వహణ ఆస్తు ల విలువ రూ.88 వేల కోట్లుగా ఉంటుందన్నారు. ‘‘షేర్ హోల్డర్లకు 139:10 నిష్పత్తిలో షేర్లు జారీ చేయాలని ఇప్పటికే బోర్డులు నిర్ణయించాయి. అంటే 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు ఐడీఎఫ్‌సీ షేర్లు 139 వస్తాయి’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment