నేడు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనుండటంతో సేవలకు అంతరాయం కలగనుంది. బ్యాంకుల విలీనాల ప్రతిపాదనలను ఉపసంహరించుకవోడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల్ని నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్‌పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయడం వంటి డిమాండ్లపై ఒక రోజు సమ్మెకు తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపునివ్వటం తెలిసిందే.
సమ్మె కారణంగా డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్స్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్ సేవలకు విఘాతం కలగనుంది. దీనిపై ఖాతాదారులకు ఇప్పటికే సమాచారం కూడా అందించినట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తెలిపింది. మరోవైపు ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు తదితర బ్యాంకుల సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.