న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్ చేసే అవకాశముంది. ఉద్యోగుల వేతనాలు నేడే క్రెడిట్ అయినప్పటికీ, వాటిని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా..ఈ బంద్ దెబ్బకొట్టనుంది.
ఈ బంద్‌లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతపడబోతున్నాయి. దీంతో వేతన విత్‌డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, ఏటీఎంల సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్‌డ్రాయల్స్‌లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.
అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ.. బ్యాంకు యూనియన్లు ఈ బంద్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల కన్వినర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment