
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌సీఎల్‌టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్ దాఖలు చేసింది.ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్సీ చట్టం ప్రకారం తమ కంపెనీపై కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) ఆరంభమైందని జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. దివాలా ప్రక్రియ ప్రారంభమవడంతో తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ అధికారాలన్నీ సస్పెండ్ అవుతాయని, ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్‌పీ) బోర్డ్ అధికారాలు నిర్వహిస్తారని వివరించింది.
రెండు వారాల పురోగతి నివేదిక
భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్‌వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. సాధారణంగా రిజల్యూషన్ ప్రణాళికకు 180 రోజుల గడువు ఇస్తారు. అయితే జాతీయ ప్రాముఖ్యత గల అంశం కాబట్టి త్వరితంగా దీనిని ఒక కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో 90 రోజుల గడువునే నిర్దేశించారు. జెట్ ఎయిర్‌వేస్ దివాలాపై తదుపరి విచారణ వచ్చే నెల 5న జరగనున్నది. అదే తేదీన రెండు వారాల పురోగతి నివేదికను ఐఆర్‌పీ సమర్పించాలని కూడా ముంబై ధర్మాసనం ఆదేశించింది. బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసింది.
Comments
Please login to add a commentAdd a comment