ముంబై: మొండి బకాయిల సమస్యల పరిష్కారం కోసం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం బ్యాంకు ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది. ముఖ్యంగా ఎన్‌పీఏల కారణంగా బ్యాంకుల ఆదాయం మందగించడం ఉద్యోగులకు ముప్పుగా మారింది. ఇటీవలి ఆర్‌బీఐ కఠిన చర్యల కారణంగా దేశీయ బ్యాంకుల్లో 60 ఉద్యోగుల్లో కోత పెట్టే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆర్‌బీఐ ప్రతిపాదించిన దివాలా చట్టం బ్యాంకులకు అనుకూలమైన చర్యగా అభివర్ణించిన క్రిసిల్ ఉద్యోగాల కోత షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. విడుదల చేసిన నివేదికలో బ్యాంకుల ఉద్యోగాల కోతను ప్రముఖంగా ప్రస్తావించింది. బకాయిల వసూలుతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 25 శాతం ప్రొవిజనింగ్ పెంచుకోవాలన్న ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు భారీగా ఉద్యోగాలను తగ్గించుకోనున్నాయని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతం వృద్ధిని సాధించినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే తదుపరి ఆరు ఎనిమిది త్రైమాసికాల్లో ప్రొవిజనింగ్ రుసుమును వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి లభిస్తే ఈ భారీ ప్రభావం కొంత శాంతించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ గణనీయమైన మందగమనాన్ని అధిగమించడంలో దాదాపు 70శాతంకంటే ఎన్‌పీఏ లు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి, క్యాపిటల్ పొజిషన్ ను చాలా దగ్గరగా పరిశీల్సించాల్సి ఉందని క్రిసిల్ డైరెక్టర్ రామ పటేల్ పేర్కొన్నారు.
కాగా ఇన్ సాల్వెనసీ అండ్ బ్యాంకరప్టీ కోడ్ దివాలా స్మృతి(ఐబీసీ) 2016 ద్వారా ఎగవేతదార్ల మెడలు వంచేందుకు సిద్ధపడిన ఆర్‌బీఐ బకాయిలు రాబట్టుకోడానికి పెద్ద ముందడుగు వేసింది. ఈక్రమంలో 12 అతిపెద్ద మొండి ఖాతాలను ప్రకటించింది. వీటిలో ఆరింటిని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూ అప్పగించింది. వీటిలో ప్రధానంగా అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాలు ఆరు. అంతర్గత సలహా కమిటీ (ఐఏసీ) సిఫారసుల ఆధారంగాఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా మొండి ఖాతాలకు గట్టి హెచ‍్చరిక జారీ చేయడంతోపాటు నిర్ణీత సమయంలో ఈ కేసుల పరిష్కారాన్ని బ్యాంకులకు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే