రుణం కాకూడదు భారం! | Benefit for those who take on shorter duration for Loans | Sakshi
Sakshi News home page

రుణం కాకూడదు భారం!

Published Mon, Jun 15 2020 4:19 AM | Last Updated on Mon, Jun 15 2020 5:20 AM

Benefit for those who take on shorter duration for Loans - Sakshi

‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

మన దేశంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు.   

నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి.

విలువను పెంచుకునేందుకు..
పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్‌ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్‌) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్‌ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం.

కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్‌ డోర్‌ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం.

సామర్థ్యాన్ని మించొద్దు..
వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్‌ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది.

మెరుగైన ఆఫర్‌
రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్‌ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు.

అధిక ఈఎంఐ
రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్‌ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్‌ టర్మ్‌) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement