న్యూఢిల్లీ: రుణభారాన్ని తగ్గించుకునేందుకు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో భాగంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తమ అనుబంధ సంస్థ భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 8.3 కోట్ల షేర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించింది. తద్వారా రూ.3,325 కోట్లు సమీకరించింది. ఈ లావాదేవీతో భారతి ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థల వాటా భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 53.51 శాతానికి పరిమితం కానుంది.
సెప్టెంబర్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం ఇన్‌ఫ్రాటెల్‌లో ప్రమోటర్ల వాటాలు 58 శాతంగా ఉన్నాయి. విలీనం కాబోతున్న మరో రెండు టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు కూడా భారత్‌లోని తమ టవర్ల వ్యాపారాన్ని ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి రూ.7,850 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఎయిర్‌టెల్ తాజా షేర్ల విక్రయ లావాదేవీ నిర్వహించింది. సోమవారం నాటి క్లోజింగ్ ధరతో పోలిస్తే 3.6 శాతం డిస్కౌంట్‌తో షేరు ఒక్కింటికి రూ.400.6 చొప్పున విక్రయించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తామని సంస్థ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్‌టెల్ రుణభారం రూ.91,480 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment