స్కైప్ కాల్స్‌కు ఎయిర్‌టెల్ చార్జీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ డేటా ప్యాకేజీలు ఉపయోగించుకుని స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా కాల్స్ చేసుకునే వారు ఇకపై మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత డేటా ప్యాకేజీలలో చేర్చకుండా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (వీఓఐపీ)కి విడిగా చార్జీలు వసూలు చేయాలని ఎయిర్‌టెల్ నిర్ణయించడం ఇందుకు కారణం. డిస్కౌంటు రేటుతో లభించే ఇంటర్నెట్ ప్యాక్‌లు కేవలం బ్రౌజింగ్‌కి మాత్రమే పనిచేస్తాయని, వీఓఐపీ వీటిలో భాగం కాబోదని ఎయిర్‌టెల్ తమ వెబ్‌సైట్లో పేర్కొంది.
వీఓఐపీ వినియోగించుకునే వారు 10 కేబీకి/4 పైసలు (3జీ సర్వీసులకు), 10 కేబీకి/10 పైసలు (2జీ సర్వీసులకు) ప్రామాణిక డేటా రేటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా వీఓఐపీ డేటాకు విడిగా చార్జీలు విధించడం దేశీయంగా ఇదే తొలిసారి. దీని కోసం త్వరలో ప్రత్యేక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నామని ఎయిర్‌టెల్ వివరించింది. వాట్స్‌యాప్, లైన్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత సర్వీసుల సంస్థలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలంటూ మొబైల్ ఆపరేటర్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.