సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..! | Big FDI Moves For Single Brand Retail, Digital Media, Manufacturing | Sakshi
Sakshi News home page

సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..!

Published Fri, Aug 30 2019 5:33 AM | Last Updated on Fri, Aug 30 2019 5:38 AM

Big FDI Moves For Single Brand Retail, Digital Media, Manufacturing - Sakshi

సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఇప్పటిదాకా ప్రతిబంధకంగా ఉన్న పలు నిబంధనలను కేంద్రం సడలించడంతో భారత్‌లో సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ దిగ్గజ సంస్థల ప్రణాళికలకు ఊతం లభించినట్లయింది. దీంతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ సహా పలు సంస్థలు భారత్‌లో సింగిల్‌ బ్రాండ్‌ విక్రయాలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం దేశీ సంస్థల భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన జారా, హెచ్‌అండ్‌ఎం, గ్యాప్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు కూడా నిబంధనల సడలింపుతో మార్గం సుగమమైంది.  

ఒకే బ్రాండ్‌ ఉత్పత్తులను విక్రయించే పలు సింగిల్‌ బ్రాండ్‌ విదేశీ సంస్థలు.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత మార్కెట్లో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ సొంతంగా కార్యకలాపాలు సాగించాలంటే కచ్చితంగా ముందు ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలన్న నిబంధన వాటికి అడ్డంకిగా ఉంటోంది. స్టోర్‌ ఏర్పాటు వ్యయాలు భారీగా ఉంటున్న నేపథ్యంలో అసలు తమ ఉత్పత్తులకు ఎంత డిమాండ్‌ ఉంటుందో తెలియకుండా ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు చేయడం సరికాదనే ఉద్దేశంతో అవి వెనుకడుగు వేస్తూ వస్తున్నాయి. ఒకవేళ ముందుకొచ్చినా.. స్థానికంగా ఏదో ఒక సంస్థతో టైఅప్‌ పెట్టుకోవడం తప్పనిసరవుతోంది. దీంతో పాటు 30 శాతం కొనుగోళ్లు స్థానికంగా జరపాలన్న మరో నిబంధన కూడా విదేశీ సంస్థలకు అడ్డంకిగా ఉంటోంది. ఫలితంగా.. అవి స్థానికంగా ఇతర సంస్థలతో జట్టు కట్టి కార్యకలాపాలు సాగించాల్సి వస్తోంది. తాజాగా తప్పనిసరి ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ఏర్పాటు, సోర్సింగ్‌ నిబంధనలను సడలించాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది.

పలు ప్రయోజనాలు..
నిబంధనల సడలింపుతో సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ సంస్థలు ముందుగా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరపవచ్చు. అయితే, రెండేళ్ల వ్యవధిలో ఆఫ్‌లైన్‌ స్టోర్‌ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సోర్సింగ్‌ విషయానికొస్తే సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లు తొలి అయిదేళ్లలో సగటున 30% స్థానికంగా కొనుగోళ్లు చేస్తే చాలు. ఆ తర్వాత నుంచి ఏటా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇందులోనూ రిటైలర్లకు ఇంకొంత వెసులుబాటు లభించనుంది. సదరు బ్రాండ్‌ను విక్రయించే కంపెనీ లేదా ఆ గ్రూప్‌ కంపెనీలు లేదా థర్డ్‌ పార్టీ వెండార్లయినా సరే స్థానికంగా జరిపే కొనుగోళ్లు సోర్సింగ్‌ నిబంధన పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు యాపిల్‌కు వెండార్‌.. ఫాక్స్‌కాన్‌ గానీ స్థానికంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే.. అది సోర్సిం గ్‌పరంగా యాపిల్‌కు కూడా దఖలుపడుతుంది.

వాస్తవానికి చిన్న, మధ్య తరహా దేశీ సంస్థలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ 30 శాతం నిబంధన పెట్టారు. విదేశీ సింగిల్‌ బ్రాండ్‌ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ఈ సోర్సింగ్‌ నిబంధన కూడా ఒక కారణమే. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా వంటి సంస్థలు భారత్‌లో చాన్నాళ్లుగా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ స్టోర్‌ పెట్టాలంటే కచ్చితంగా 30 శాతం ఇక్కడివే కొనాలన్న నిబంధన కారణంగా చాలా కాలం ముందుకు రాలేదు. తాజాగా నిబంధనల మార్పుతో విదేశీ రిటైలర్లకు మరింత వెసులుబాటు లభించనుంది.

ఉపాధికి ఊతం..
నిబంధనలను సడలించడం ఉభయతారకంగా ఉంటుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆయా సంస్థలు స్వయంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఊతం లభిస్తుందని, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపినా ఉపాధి కల్పనకు తోడ్పాటు లభించగలదని భావిస్తోంది. లాజిస్టిక్స్, డిజిటల్‌ చెల్లింపులు, కస్టమర్‌ కేర్, శిక్షణ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరగగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉదాహరణకు.. 2013లో అమెజాన్‌ భారత మార్కెట్లోకి వచ్చినప్పట్నుంచి 2,00,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరిగిందని అంచనా. అమెజాన్‌ సుమారు 5,00,000 మంది విక్రేతలతో కలిసి పనిచేస్తోంది. అమ్మకాలు పెరిగే కొద్దీ ఆయా విక్రేతలు మరింత మంది సిబ్బందిని తీసుకుంటూ ఉండటం వల్ల ఆ రకంగా కూడా ఉపాధికి ఊతం లభిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

‘స్మార్ట్‌ఫోన్స్‌’ విస్తరణ..
నిబంధనల సడలింపుతో ఎగుమతులకు కూడా ఉపయోగపడేలా భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ దిగ్గజం వన్‌ప్లస్‌ ఇండియా జీఎం వికాస్‌ అగర్వాల్‌ చెప్పారు. ‘ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ విస్తరణకు కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఇప్పటికే మా స్థానిక భాగస్వాములతో అన్ని ప్రధాన నగరాల్లో స్టోర్స్‌ ఏర్పాటు చేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తాజా పరిణామంతో భారత తయారీ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు రాగలవని మరో స్మార్ట్‌ఫోన్‌ సంస్థ వివో ఇండియా డైరెక్టర్‌ (బ్రాండ్‌ స్ట్రాటెజీ విభాగం) నిపుణ్‌ మార్యా చెప్పారు. యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి దిగ్గజ బ్రాండ్ల సొంత స్టోర్స్‌ ఏర్పాటుతో దేశీ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ రిటైలింగ్‌ మార్కెట్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదని పరిశ్రమ సమాఖ్య ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) అభిప్రాయపడింది.




సన్నాహాల్లో యాపిల్‌..
3 నెలల్లో ఆన్‌లైన్‌ విక్రయాలు
ఏడాదిన్నరలో తొలి ఆఫ్‌లైన్‌ స్టోర్‌

సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ నిబంధనల సడలింపుతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ తమ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించే సన్నాహాల్లో పడింది. వచ్చే 3–5 నెలల్లో ఇది సిద్ధం కావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆన్‌లైన్‌ స్టోర్స్‌ తరహాలోనే ఇది కూడా ఉండనుందని పేర్కొన్నాయి. ఇక వచ్చే 12–18 నెలల్లో ఆఫ్‌లైన్‌ స్టోర్‌ సైతం ప్రారంభించాలని యాపిల్‌ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్‌ భాగస్వామ్యంతో యాపిల్‌ ఆన్‌లైన్‌లో భారత్‌లో విక్రయాలు జరుపుతోంది.

భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాల్లో 35–40 శాతం వాటా ఈ–కామర్స్‌దే ఉంటోంది. ఐప్యాడ్‌ ట్యాబ్లెట్స్, మాక్‌బుక్‌ ల్యాప్‌టాప్స్‌ అమ్మకాలు కూడా ఆన్‌లైన్‌లో భారీగానే ఉంటున్నాయి. దేశీయంగా మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో ఆన్‌లైన్‌ అమ్మకాల వాటా 25 శాతం పైగా ఉంటోంది. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యాపిల్‌ భావిస్తోంది. ‘భారత్‌లో తొలి యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ ఏర్పాటు చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు అందిస్తున్న సేవలను భారతీయ కస్టమర్లకు కూడా అందిస్తాం. త్వరలోనే మిగతా ప్రణాళికలను వెల్లడిస్తాం‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది.  ప్రస్తుతం యాపిల్‌కు 25 దేశాల్లో స్టోర్స్‌ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement