బిట్ కాయిన్లను నిషేధించాలా.. నియంత్రించాలా?
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఆ తరహా బిట్‌కాయిన్స్ వినియోగంపై కేంద్రం చర్చకు తెరతీసింది. బిట్‌కాయిన్స్‌ను నిషేధించాలా, నియంత్రించాలా లేదా స్వయం నియంత్రణకు వదిలేయాలా అన్న అంశాలపై ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని చర్చావేదిక మైగవ్‌డాట్‌ఇన్‌లో కోరింది.
‘ఒకవేళ వర్చువల్ కరెన్సీలను (వీసీ) నియంత్రించనవసరం లేదని భావించిన పక్షంలో సమర్ధమైన స్వయంనియంత్రణ వ్యవస్థ ఎలా ఉండాలి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన చర్యలు ఎలా ఉండాలి’ అన్నవి తెలియజేయాల్సిందిగా సూచించింది.
మే 31 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను మైగవ్‌డాట్‌ఇన్‌లో పేర్కొనవచ్చు. వన్నాక్రై రాన్సమ్‌వేర్‌తో సైబర్ దాడులకు దిగిన సైబర్ క్రిమినల్స్ బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించాలంటూ బాధితులను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ తరహా కరెన్సీలు మరింతగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే బిట్‌కాయిన్స్ లాంటి వర్చువల్ కరెన్సీల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది.