virtual currency
-
పబ్–జీ ఖర్చు 10 లక్షలు
ముంబై: పబ్–జీ గేమ్‌కు బానిసైన ఓ 16 ఏళ్ల బాలుడు తన తల్లి బ్యాంక్ ఖాతాలోని రూ. 10 లక్షలను ఆట కోసం ఖర్చు చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజులుగా బాలుడు పబ్–జీకి బానిసయ్యాడని, తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 10 లక్షలను వర్చువల్ కరెన్సీగా మార్చి ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి మందలించడంతో ఓ లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. -
క్రిప్టోకరెన్సీపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ (బిల్లు)పై కేబినెట్ నోట్ సిద్దమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బిల్లుకు క్యాబినెట్ ఆమోదం గురించి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిప్టోపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక మంత్రిత్వ స్థాయి కమిటీ ఇప్పటికే దీనిపై తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీచేసే ఏదైనా వర్చువల్ కరెన్సీ మినహా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలనూ భారత్‌లో నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది. కాగా,గతంలో ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ మాట్లాడుతూ.. త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోంది. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తుండగా.. పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ ‘నిషేధం’ ఎత్తివేత
న్యూఢిల్లీ: వివాదాస్పద క్రిప్టోకరెన్సీ అంశంపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. ఈ కరెన్సీలకు సంబంధించిన సేవలను అందించవచ్చని పేర్కొంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కన పెట్టింది. క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ ’నిషేధా’న్ని సవాల్ చేస్తూ .. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎంఏఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఓవైపు వర్చువల్ కరెన్సీలను నిషేధించలేదని ఆర్బీఐ చెబుతోందని, మరోవైపు అనేక కమిటీలు వేసినా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతోందని.. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ సరికాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. బిట్కాయిన్ల వంటి వర్చువల్ కరెన్సీలతో ఆర్థిక నష్టాలతో పాటు అనేక రిస్కులు పొంచి ఉన్నాయని 2013లో ఆర్బీఐ హెచ్చరించింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 6న మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం వర్చువల్ కరెన్సీ లావాదేవీలు జరిపే ఎవరికీ సర్వీసులు అందించరాదంటూ తన పరిధిలో పనిచేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. దీంతో క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించినట్లయింది. దీన్ని సవాలు చేస్తూ 2018 జూలై 3న ఐఎంఏఐ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎకానమీపై క్రిప్టోకరెన్సీల ప్రభావాల గురించి గతంలో అధ్యయనాలేమీ జరగలేదని, కేవలం నైతికత ప్రాతిపదికగా ఆర్బీఐ వీటిని నిషేధించిందని వాదించింది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర సమాచార..సాంకేతిక శాఖను ఆదేశించింది. ఈ కేసులోనే తాజా తీర్పునిచ్చింది. -
బిట్ కాయిన్ సంస్థలతో డీల్స్ వద్దు
ముంబై: బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలతో సంబంధాలను తక్షణం తెంచుకోవాలని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీ, చెల్లింపు సేవల సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు అన్ని వాణిజ్య, సహకార, చెల్లింపు బ్యాంక్‌లకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు కూడా వర్తిస్తాయని పేర్కొంది. వర్చువల్ కరెన్సీలతో రిస్క్ పొంచి ఉన్నదని హెచ్చరించిన మరుసటి రోజే ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం. కాగా క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, సిటి తదితర బ్యాంక్‌లు, సంస్థలు క్రిప్టోకరెన్సీల సంబంధిత లావాదేవీలను నిలిపేశాయి. దీంతో వాటి ట్రేడింగ్ దాదాపు 90 శాతం తగ్గిపోయింది. పేమెంట్ సంస్థలు డేటాను ఇక్కడే స్టోర్ చేయాలి.. రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా ఎండ్–టు–ఎండ్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సహా యూజర్ల నుంచి సేకరించిన మొత్తం డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించింది. యూజర్ల సమాచారానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డేటా స్టోరేజ్ సంబంధిత తాజా ఆదేశాలను పేమెంట్ సంస్థలు ఆరు నెలల్లోగా అమలు చేయాలని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. పేమెంట్ ప్రొవైడర్లందరూ పేమెంట్స్ సంబంధిత డేటాను భారత్‌లో స్టోర్ చేయడం లేదని తెలిపింది. ఆర్బీఐ నోటిఫికేషన్‌పై మొబిక్విక్ ఫౌండర్ బిపిన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. తమ సంస్థ వద్ద ఉన్న మొత్తం డేటాను ఇండియాలోనే స్టోర్ చేశామని తెలిపారు. సాధారణంగా యూనిఫైడ్ సిస్టమ్స్‌ను కలిగిన, ఒకే అప్లికేషన్ సర్వర్లతో గ్లోబల్‌గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ కంపెనీలు భారత్‌లో ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు కొద్దిగా కష్టమౌతుందని పేయూ ఇండియా ఎండీ జితేంద్ర గుప్తా పేర్కొన్నారు. కాగా ఫేస్బుక్ డేటా లీక్ అంశంతో యూజర్ల డేటా భద్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల నగదు రవాణాపై కఠిన నిబంధనలు బ్యాంకులు నగదు రవాణా సేవలను అవుట్సోర్స్ ఏజెన్సీలకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఆర్బీఐ కఠినతరం చేసింది. బ్యాంకులకు ఈ సేవలు అందించే సంస్థల నెట్‌వర్త్ కనీసం రూ.100 కోట్లు ఉండి, నగదు రవాణాకు అనువైన 300 వ్యాన్లను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఆయా సేవల ఏజెన్సీల వద్ద ఉండే నగదు బ్యాంకుల ఆస్తియేనని, అందుకు సంబంధించి ఎదురయ్యే ఏ సమస్య అయినా బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. నగదును తరలించే వ్యాన్లకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని, రాత్రి వేళల్లో తరలింపునకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతమున్న అవుట్సోర్సింగ్ ఒప్పందాలను సమీక్షించి నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా 90 రోజుల్లోపు వాటిలో మార్పులు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. -
జియోకు సొంత క్రిప్టోకరెన్సీ?
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్, ఎథీరియం, రిపుల్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఇటీవలి కాలంలో డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో బడా కంపెనీలు వర్చువల్ కరెన్సీ విభాగంలోకి దిగుతున్నాయి. తమ కస్టమర్ల కోసం బిట్‌కాయిన్‌లాంటి సొంత కరెన్సీని రూపొందించే పనిలో పడ్డాయి. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చౌక టారిఫ్‌లతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో... ప్రస్తుతం జియోకాయిన్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. జియోకాయిన్ ప్రాజెక్టుకు స్వయంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ సారథ్యం వహిస్తుండటం గమనార్హం. కాంట్రాక్టులు, సరఫరా మొదలైన కార్యకలాపాల నిర్వహణ కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత అప్లికేషన్స్‌ను రూపొందించడం జియోకాయిన్ ప్రాజెక్టు లక్ష్యం. పనిలో పనిగా బ్లాక్‌చెయిన్ ఆధారిత జియోకాయిన్లను కూడా రూపొందించడంపై ఇది దృష్టి పెట్టనుంది. ఇందుకోసం ఆకాశ్ అంబానీ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం సగటు పాతికేళ్ల వయసున్న యాభై మంది నిపుణులను తీసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. వీరంతా ఆకాశ్ అంబానీ సారథ్యంలో వివిధ బ్లాక్‌చెయిన్ సాధనాలపై పనిచేస్తారు. బ్యాంకులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెండు వర్గాలు తక్కువ వ్యయాలతో ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఈ బ్లాక్ చెయిన్ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. ఆర్థికపరమైన చెల్లింపులకు సంబంధించి బిట్‌కాయిన్ మొదలైన కరెన్సీలన్నీ ఇదే ప్రాతిపదికన రూపొందినవే. ఇదే కోవలో తమ కస్టమర్లకు లాయల్టీ పాయింట్స్ లాంటివి జియోకాయిన్ల రూపంలో అందించే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఐవోటీలోకి కూడా జియో...: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) విభాగంలోకి కూడా ప్రవేశించాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. ఇందుకు కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. స్మార్ట్ఫోన్లు, వేరబుల్ డివైజ్‌లు, గృహోపకరణాలు మొదలైన వాటన్నింటినీ ఒక నెట్వర్క్ కింద ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసే టెక్నాలజీని ఐవోటీగా వ్యవహరిస్తారు. ఈ టెక్నాలజీతో ఇవన్నీ పరస్పరం డేటాను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సందర్భానుసారంగా స్పందిస్తుంటాయి. ఐవోటీలో ఉండే భద్రతాపరమైన రిస్కులకు చెక్ చెప్పేందుకు కూడా బ్లాక్‌చెయిన్ ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఓవెపు కంపెనీలు కూడా సొంతంగా క్రిప్టోకరెన్సీలను రూపొందించుకోవడంలో నిమగ్నమవుతుండగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం వర్చువల్ కరెన్సీలకు చట్టబద్ధత లేదని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఫొటోగ్రాఫర్లకు కొడాక్ కాయిన్.. ఫొటోగ్రాఫర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఫోటోగ్రఫీ ఉత్పత్తుల సంస్థ కొడాక్ కూడా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత సాధనాలపై పనిచేస్తోంది. ఫోటో గ్రాఫర్లు తమ వర్క్ కాపీరైట్ చౌర్యానికి గురికాకుండా.. రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక బ్లాక్‌చెయిన్ ఎక్సే్చంజీని రూపొందిస్తోంది. సదరు వర్క్‌ను ఉపయోగించుకోదల్చుకునే వారు సురక్షితంగా క్రిప్టోకరెన్సీ కొడాక్ కాయిన్ల రూపంలో చెల్లింపులు జరిపేలా ఈ మాధ్యమాన్ని తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం వెన్ డిజిటల్ అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. సొంత క్రిప్టోకరెన్సీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఐపీవో తరహాలో ఈ నెలాఖర్లో ఐసీవో (ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్) కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
వర్చువల్ కరెన్సీలు పోంజీ స్కీములే!
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలు ఎలాంటి చట్టపరమైన చెల్లుబాటు, రక్షణ లేని పోంజీ స్కీముల్లాంటివని కేంద్రం వ్యాఖ్యానించింది. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే కష్టార్జితం హరించుకుపోయే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోంజీ స్కీముల తరహాలోనే వర్చువల్ కరెన్సీలు కూడా బుడగల్లాగా పేలిపోయే రిస్కులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల కష్టార్జితమంతా హరించుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పోంజీ స్కీముల వలలో పడకుండా వినియోగదారులు జాగ్రత్త వహించాలి‘ అని పేర్కొంది. వీటిపై ఆర్బీఐ ఇప్పటికే మూడుసార్లు హెచ్చరించిందని ఆర్థిక శాఖ తెలిపింది. డిజిటల్ ఫార్మాట్లో ఉండే క్రిప్టో కరెన్సీలు హ్యాకింగ్‌కు, మాల్వేర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని, ఫలితంగా పెట్టిన పెట్టుబడంతా శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని వివరించింది. బిట్‌కాయిన్‌లాంటి ఇతర వర్చువల్ కరెన్సీలకు భరోసానిచ్చేటువంటి అసెట్స్ ఏమీ లేవని, వీటి విలువ భారీగా పెరిగిపోవడానికి.. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవడానికి స్పెక్యులేషనే కారణమని ఆర్థిక శాఖ తెలిపింది. మరోవైపు, బిట్‌కాయిన్ లాంటి కరెన్సీల పర్యవేక్షణకు అంతర్జాతీయంగా ఉన్న వ్యవస్థలను పరిశీలించి తగు సిఫార్సులు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రత్యేక కమిటీ వేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలిపారు. -
బిట్‌కాయిన్ @ 11,000 డాలర్లు
సింగపూర్: వర్చువల్ కరెన్సీల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘బిట్‌కాయిన్’ బుధవారం తొలిసారిగా 10వేల డాలర్ల మైలురాయిని అధిగమించింది. అదే స్పీడ్‌లో 11 వేల డాలర్లను కూడా దేటేసింది. ఒకేరోజులో ఈ రెండు మైలురాళ్లను చేరడం విశేషం. తాజా జోరుతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరువైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న విలువతో పోలిస్తే(దాదాపు 750 డాలర్లు) బిట్‌కాయిన్ 10 రెట్లకు పైగా ఎగబాకడం గమనార్హం. డిజిటల్ గోల్డ్‌గా కూడా అభివర్ణించే బిట్‌కాయిన్ ప్రస్థానం 2009లో మొదలైంది. ప్రారంభంలో ఒక డాలర్ కంటే తక్కువగా ఉన్న ఈ బిట్‌కాయిన్‌కు ఎలాంటి లీగల్ ఎక్సే్చంజ్ రేట్ కానీ, ఏ దేశ కేంద్ర బ్యాంక్ దన్ను కానీ లేదు. కొన్ని స్పెషలిస్ట్ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడయ్యేది. కానీ చాలా వేగంగా సాం ప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. ఏడాదిన్నరలో లక్ష డాలర్లకు...! ఎక్సే్చంజ్ దిగ్గజం సీఎంఈ గ్రూప్ గత నెలలో బిట్‌కాయిన్‌లో ఫ్యూచర్స్‌ను ప్రారంభించనున్నామని వెల్లడించడంతో బిట్‌కాయిన్ జోరు మరింతగా పెరిగింది. కేవలం రెండు వారాల్లో 45 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో దీని విలువ 752 డాలర్లుగా ఉంది. బిట్‌కాయిన్ జోరు మరింతగా పెరుగుతుందని, ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో ఇది 50 వేల నుంచి లక్ష డాలర్లకు పెరుగుతుందని సింగపూర్ శాక్సో బ్యాంక్‌కు చెందిన క్రిప్టో స్ట్రాటజిస్ట్ కే వాన్–పీటర్సన్ చెప్పారు. కాగా మన కాలానికి సంబంధించి అతి పెద్ద బబుల్‌గా బిట్‌కాయిన్ నిలవనున్నదని ప్రముఖ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైక్ నొవొగ్రాజ్ హెచ్చరించారు. కాగా, ఈ వర్చువల్ కరెన్సీని ఫ్రాడ్‌గా జేపీ మోర్గాన్ ఛేజ్ గతంలో అభివర్ణించింది. చైనా, దక్షిణ కొరియాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. -
చుక్కలు చూపిస్తున్న బిట్‌కాయిన్
ఒకే వారంలో 22 శాతం పతనం ∙ 3,017 డాలర్ల నుంచి 2,529 డాలర్లకు.. (సాక్షి బిజినెస్ విభాగం) అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన వర్చువల్ కరెన్సీ (డిజిటల్ రూపంలో ఉండేది) బిట్ కాయిన్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నెల 12న 3,017.78 డాలర్ల స్థాయికి వెళ్లిన బిట్ కాయిన్... మూడు రోజులు తిరిగేసరికి జూన్ 15న ఏకంగా 2,120 డాలర్ల కనిష్ట స్థాయికి చేరింది. కాకపోతే అదే రోజు 2,290 డాలర్ల వద్ద క్లోజయింది. మళ్లీ 16న... అంటే శుక్రవారం 2,529 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ వారం బిట్ కాయిన్ క్లోజింగ్ ధర రూ.1,57,732.14. ఈ వారంలో మొత్తం మీద బిట్ కాయిన్ విలువ గత వారం క్లోజింగ్‌తో చూస్తే 22 శాతం పతనమైంది. డిసెంబర్ 2013 తర్వాత ఒకే వారంలో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే. ఇక ఈ ఏడాది జనవరి నుంచీ చూస్తే మాత్రం ఇప్పటికి బిట్ కాయిన్ విలువ 137 శాతం పెరిగింది. ఎందుకీ హెచ్చుతగ్గులు? బిట్ కాయిన్‌కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్... బేరిష్ రిపోర్ట్ జారీ చేసింది. కొన్నాళ్లు క్షీణత కొనసాగవచ్చని అంచనా వేసింది. మరోవంక చైనాకు చెందిన బిట్మెయిన్ కొత్త వెర్షన్ బిట్ కాయిన్ బ్లాక్ చెయిన్ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తోం దంటూ వార్తలు వెలువడ్డాయి. నిజానికిది వర్చువల్ కరెన్సీ. మరో బిట్‌కాయిన్ వెర్షన్ అంటే... దీని విలువ తరిగిపోతుంది కదా! అందుకని ఇన్వెస్టర్లు లాభాలకు దిగారు. ఇవే బిట్ కాయిన్ క్షీణతకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఎనిమిదేళ్ల బిట్ కాయిన్ చరిత్రలో ఒకే రోజులో గరిష్టంగా 18% పెరగ్గా, 13% తగ్గిన చరిత్ర కూడా ఉంది. గోల్డ్ మ్యాన్ శాక్స్ రిపోర్టే కరెక్షన్కు కారణమని బిట్ మెక్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ జఫారీ పేర్కొన్నారు. స్వల్ప కాలానికి 3,134 డాలర్లు గరిష్ట స్థాయి, 2,330 డాలర్లు కనిష్ట స్థాయిల మధ్య కదలాడే అవకాశాలున్నాయని, స్టాప్ లాస్ 1,915 డాలర్లుగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత బిట్ కాయిన్ నెట్‌వర్క్‌లో ఎన్ని కావాలంటే అన్ని బిట్కాయిన్లు సృష్టించటానికి వీల్లేదు. గరిష్ఠంగా 2,099 కోట్ల బిట్కాయిన్లను మాత్రమే సృష్టించగలరు. వీటిలో 72% ఇప్పటికే చలామణిలో ఉన్నాయి కూడా. అయితే ఒక్కో బిట్ కాయిన్‌ను కోటి భాగాలుగా విభజించొచ్చు. కోటి భాగంగా ఉండే బిట్‌కాయిన్‌ను ‘సతోషి’ పేరిట చలామణి చేస్తున్నారు. అంటే... కోటి సతోషిలు ఒక బిట్‌కాయిన్ అన్న మాట. ఈ దృష్ట్యా బిట్‌కాయిన్ రేటు పెరుగుతుండటంతో... దీనికి పరిష్కారంగా కొత్త వెర్షన్ బిట్ కాయిన్ సృష్టించే ఆలోచనలో చైనా బిట్ మెయిన్ ఉంది. -
బిట్ కాయిన్లను నిషేధించాలా.. నియంత్రించాలా?
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో ఆ తరహా బిట్‌కాయిన్స్ వినియోగంపై కేంద్రం చర్చకు తెరతీసింది. బిట్‌కాయిన్స్‌ను నిషేధించాలా, నియంత్రించాలా లేదా స్వయం నియంత్రణకు వదిలేయాలా అన్న అంశాలపై ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని చర్చావేదిక మైగవ్డాట్ఇన్లో కోరింది. ‘ఒకవేళ వర్చువల్ కరెన్సీలను (వీసీ) నియంత్రించనవసరం లేదని భావించిన పక్షంలో సమర్ధమైన స్వయంనియంత్రణ వ్యవస్థ ఎలా ఉండాలి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన చర్యలు ఎలా ఉండాలి’ అన్నవి తెలియజేయాల్సిందిగా సూచించింది. మే 31 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను మైగవ్డాట్ఇన్లో పేర్కొనవచ్చు. వన్నాక్రై రాన్సమ్వేర్తో సైబర్ దాడులకు దిగిన సైబర్ క్రిమినల్స్ బిట్కాయిన్ల రూపంలో చెల్లించాలంటూ బాధితులను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ తరహా కరెన్సీలు మరింతగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే బిట్‌కాయిన్స్ లాంటి వర్చువల్ కరెన్సీల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
కొత్త బంగారం.. బిట్‌కాయిన్
⇒ పసిడి రేటును మించిన వర్చువల్ కరెన్సీ విలువ ⇒ 1,300 డాలర్ల దిశగా పరుగులు.. ⇒ అమెరికాలో ఈటీఎఫ్‌కు అనుమతులపై ఆశలతో ఊతం ⇒ రిస్కులూ ఉన్నాయంటున్న విశ్లేషకులు భారత్‌లో బిట్‌కాయిన్.. భారత్‌లో ప్రస్తుతం బీటీసీఎక్స్ఇండియా, కాయిన్‌సెక్యూర్, యునోకాయిన్, జేబ్‌పే వంటి బిట్‌కాయిన్ ఎక్సే్చంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గతేడాది ఆగస్టు (డీమోనిటైజేషన్‌కి ముందు).. భారత్‌లో బిట్‌కాయిన్ యూజర్ల సంఖ్య సుమారుగా 50,000 పైచిలుకు ఉన్నట్లు అంచనా. మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు తర్వాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో రూ. 40,000 స్థాయిలో ఉన్న రేటు సుమారు రూ. 90,000 స్థాయికి ఎగిసింది. న్యూఢిల్లీ: వర్చువల్ బంగారంగా పేరొందిన బిట్ కాయిన్ ప్రస్తుతం అసలు బంగారాన్ని మించి పరుగులు తీస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో పసిడి ఈ మధ్య కాస్త తగ్గుతుండగా.. దానికి భిన్నంగా బిట్‌కాయిన్ మాత్రం దూసుకెడుతోంది. గడిచిన కొద్ది ట్రేడింగ్ సెషన్లలో వరుసగా కొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూ.. 1,300 డాలర్ల వైపు వెళుతోంది. కాయిన్‌డెస్క్ బీపీఐ ఎక్సే్ఛంజ్‌లో శుక్రవారం ఒక దశలో 1,293 డాలర్ల స్థాయిని తాకింది. మరోవైపు అదే సమయంలో ఔన్సు పసిడి ధర 1,227 డాలర్ల దగ్గర తిరుగాడుతుండటం గమనార్హం. 2008లో బిట్‌కాయిన్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తర్వాత.. వెయ్యి డాలర్ల పైన ఇంత సుదీర్ఘ కాలం ట్రేడవుతుండటం ఇదే తొలిసారి. అమెరికా వ్యాపారవేత్తలు కామెరాన్, టైలర్ వింకెల్వోస్లు తలపెట్టిన తొలి బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)కి అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర లభించగలదన్న ఆశలు ఈ వర్చువల్ కరెన్సీ వృద్ధికి ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఈటీఎఫ్ లిస్టింగ్‌కి అనుమతులకు సంబంధించి అనుమతులు ఇచ్చే విషయంపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మార్చ్ 11న తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈటీఎఫ్‌కు అనుమతులు లభిస్తే.. డిజిటల్ కరెన్సీగా బిట్‌కాయిన్ ఆమోదయోగ్యత, తదనుగుణంగా విలువ కూడా మరింతగా పెరుగుతుంది. మిగతా దేశాల్లోని మార్కెట్ నియంత్రణ సంస్థలు కూడా ఈ తరహా ఈటీఎఫ్ లిస్టింగ్స్‌ను పరిశీలించవచ్చు. సురక్షితమైనదేనా ... బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ.. ఇది సురక్షితమైన కరెన్సీయేనా అన్న సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిట్‌కాయిన్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం ఒక కారణం కాగా, దీని ఆమోదయోగ్యతపై సందేహాలు మరో కారణం. రిస్కుల విషయానికొస్తే.. క్రూడాయిల్, బాండ్ల స్థాయిలో బిట్కాయిన్కూ రిస్కులు ఉంటాయి. హెచ్చుతగ్గుల సంగతి తీసుకుంటే పసిడి రేట్లు సగటున 1.2 శాతం మేర, ఇతరత్రా ప్రధాన కరెన్సీలు 0.5–1.0 శాతం మేర మార్పులకు లోనవుతుంటాయి. అదే బిట్‌కాయిన్‌కి సంబంధించి చూస్తే.. 2011లో అమెరికా డాలర్‌తో పోల్చి చూసినప్పుడు బిట్‌కాయిన్ హెచ్చుతగ్గుల సూచీ ఏకంగా 16.11 శాతం మేర మారింది. ప్రస్తుతం ఇది 2.25 శాతానికి దిగి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. ఇలా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ధోరణి కారణంగా ఎక్కువగా స్పెక్యులేటర్స్ బిట్కాయిన్స్వైపు ఆకర్షితులవుతుంటారని, దీనితో హెచ్చుతగ్గులు మరింత ఎక్కువవుతుంటాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా సాధారణ ఇన్వెస్టర్లకు దీనిపై నమ్మకం కుదరడం కష్టంగా ఉంటుందని వివరించాయి. ఇక, ఆమోదయోగ్యతపరంగా చూస్తే.. మిగతా కరెన్సీలలాగా అన్ని రకాల ఉత్పత్తులు, సర్వీసుల కొనుగోళ్లకు బిట్కాయిన్లను వినియోగించడం వాడుకలోకి రాలేదు. ఈ నేపథ్యంలో.. రేటుపరంగా పసిడికన్నా ఎక్కువ పలుకుతున్నా బంగారం తరహాలో పెట్టుబడికి సురక్షితమైన సాధనంగా దీన్ని పరిగణించడం తొందరపాటు చర్యే అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇక వింకెల్వోస్ సోదరులు తలపెట్టిన ఈటీఎఫ్ ప్రయత్నాలు ఫలప్రదం కాకపోతే.. బిట్‌కాయిన్ రేటు మరింత పడిపోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ప్రస్తుతం పన్నెండు వందల డాలర్ల పైన ట్రేడవుతున్న బిట్‌కాయిన్.. ఆ పరిస్థితుల్లో 1,000–1,100 డాలర్ల స్థాయికీ పడిపోయి కొంత కాలం పాటు అక్కడక్కడే తిరుగాడవచ్చని దేశీ బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్ జేబ్‌పే వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ ఏమంటోంది.. బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలకు ఊతమిచ్చే క్రమంలో వివిధ దేశాల్లో నియంత్రణ సంస్థలు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నాయి. దేశీయంగా ఓవైపు ప్రభుత్వం నగదు వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ మాత్రం బిట్‌కాయిన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా ఎటువంటి వర్చువల్ కరెన్సీ వాడకానికీ లైసెన్సు ఇవ్వలేదని, ఎవరైనా దీన్ని వాడుతున్న పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదేనంటూ ఈ మధ్యే స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ఎస్ గాంధీ ఇటీవలే హెచ్చరించారు కూడా. నియంత్రణ సంస్థల పరిధిలో లేని ఈ తరహా కరెన్సీల వల్ల ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. అయితే, చైనా, రష్యా, సింగపూర్ తదితర దేశాలన్నీ కూడా ఈ తరహాలోనే ముందుగా హెచ్చరికలు వగైరా చేసినా.. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీని ఎంతో కొంత నియంత్రించే దిశగా మార్గదర్శకాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎంతో కాలం వేచి చూసే ధోరణి అవలంబించడం సరికాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల వీటి గురించి ఎక్కువగా అవగాహన లేని సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
వర్చువల్ కరెన్సీలతో రిస్కులు
⇒ ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ⇒ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై: బిట్‌కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీల వాడకంలో అనేక రిస్కులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ హెచ్చరించారు. ఆర్థికంగా, చట్టపరంగా, వినియోగదారుల హక్కుల పరిరక్షణపరంగా, భద్రతాపరంగానూ పలు ముప్పులు ఉంటాయని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా గాంధీ ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే వర్చువల్ కరెన్సీలకు .. హ్యాకింగ్, పాస్వర్డ్ చౌర్యం, మాల్వేర్ దాడుల ముప్పు కూడా ఉంటుందని గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియంత్రణ వ్యవస్థలు లేవు... వర్చువల్ కరెన్సీలను నియంత్రించేందుకు ఎలాంటి కేంద్రీయ బ్యాంకులు లేవని ఆయన చెప్పారు. కస్టమర్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థా వీటికి ఉండదన్నారు. చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాలకు వర్చువల్ కరెన్సీలు ఉపయోగపడుతున్నట్లు అనేక కేసులు కూడా నమోదైనట్లు గాంధీ చెప్పారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత బిట్‌కాయిన్ తదితర వర్చువల్ కరెన్సీలు వేటికైనా ప్రారంభ దశలోనే విశ్వసనీయత ఉంటుందని, తర్వాత దశల్లో కూడా దాన్ని కాపాడుకుంటేనే మనుగడ ఉండగలదని ఆయన చెప్పారు. ‘ప్రారంభ దశలో అడ్వెంచరిస్టులు, రిస్కులు తీసుకునే వారు ఉంటారు. తర్వాత మిగతావారు చేరతారు. రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడని వారు కూడా క్రమంగా చేరాలంటే వర్చువల్ కరెన్సీకి ఆమోదయోగ్యత ఉంటుందని, కొనసాగుతుందన్న నమ్మకం వారిలో కలగాలి. అప్పుడే ఇటువంటి కరెన్సీలకు మనుగడ ఉంటుంది‘ అని గాంధీ వివరించారు. నియంత్రణ సంస్థల పరిధిలో ఉన్నప్పుడే ఏ కరెన్సీపైన అయినా నమ్మకం ఉంటుందని గాంధీ వివరించారు. కరెన్సీ చలామణీ కనుమరుగు అపోహే... వర్చువల్ కరెన్సీ రాకతో కరెన్సీ చలామణీ పూర్తిగా కనుమరుగవుతుందన్నది అపోహేనని గాంధీ స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు.. ఆర్థిక సేవల పరిశ్రమలో వేగంగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ఆయన చెప్పారు. బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలు కూడా ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని గాంధీ ఈ సందర్భంగా అన్నారు. -
బిట్‌కాయిన్ ఆపరేటర్ల దుకాణాలు బంద్
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించిన నేపథ్యంలో పలు బిట్‌కాయిన్ ఆపరేటర్లు దేశీయంగా తమ కార్యకలాపాలను నిలిపివేశారు. కొన్ని సంస్థలు తాత్కాలికంగానూ, మరికొన్ని నిరవధికంగాను లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తమ వెబ్సైట్లలో పేర్కొన్నాయి. బెసైల్బిట్కోడాట్ఇన్, ఐఎన్‌ఆర్‌బీటీసీ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బిట్‌కాయిన్ అనే కల్పిత కరెన్సీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ వ్యవస్థ ద్వారా ఈ కరెన్సీని రూపొందిస్తున్నారు. దీనిపై ఏ నియంత్రణ సంస్థకు అధికారాలు లేవు. గడిచిన మూడేళ్లలో ఈ యూనిట్ విలువ 200 డాలర్ల నుంచి ఏకంగా 1,000 డాలర్లకు ఎగిసింది. ఈ కరెన్సీ మారకం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్బీఐ ఈ నెల 24న బిట్కాయిన్ల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.